విశ్వాసం పెరిగేలా...

విశ్వాసం పెరిగేలా...


వరుస ఓటములతో ఇంటా బయటా విమర్శల జడివానలో తడిసి ముద్దవుతున్న ధోని సేనకు కాస్త ఊరట.. విజయం కోసం మొహం వాచిపోయేలా ఎదురుచూస్తున్న భారత ఆటగాళ్లకు కొంత ఉపశమనం.. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ కోసం సన్నాహకంగా జరిగిన ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ సత్తా చూపింది. కీలకమైన పోరుకు ముందు ఈ మాత్రం ప్రదర్శనతో ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. ఫామ్ విషయంలో ఇబ్బందులెదుర్కొంటున్న విరాట్ కోహ్లితో పాటు తెలుగు తేజం అంబటి రాయుడు అదరగొట్టడం జట్టుకు కొండంత ధైర్యాన్నిచ్చింది.

 

ప్రాక్టీస్ వన్డేలో భారత్ ఘనవిజయం

అదరగొట్టిన రాయుడు  

ఫామ్‌లోకొచ్చిన కోహ్లి

బౌలర్ల సమష్టి రాణింపు

లండన్: భారత జట్టు తరఫున తొలిసారి ఇంగ్లండ్‌లో ఆడుతున్న అంబటి తిరుపతి రాయుడు (82 బంతుల్లో 72 రిటైర్డ్ అవుట్; 8 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. వన్డే సిరీస్ కోసం వచ్చీ రాగానే సన్నాహక మ్యాచ్‌లో అర్ధసెంచరీతో రాణించి భరోసానిచ్చాడు. అలాగే సాధారణ లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో మన బౌలర్లు కూడా విశేషంగా రాణించారు. ఫలితంగా లార్డ్స్ మైదానంలో శుక్రవారం మిడిలెసెక్స్‌తో జరిగిన వన్డేలో భారత్ 95 పరుగుల తేడాతో నెగ్గింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 44.2 ఓవర్లలో 230 పరుగులు చేసింది. పూర్తి స్థాయి ఆటగాళ్లతోనే బరిలోకి దిగినా నిర్ణీత ఓవర్లు ఆడలేకపోయింది.



స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి (75 బంతుల్లో 71; 8 ఫోర్లు; 1 సిక్స్) తన పరుగుల దాహాన్ని తీర్చుకోగా మిగిలిన బ్యాట్స్‌మెన్ మాత్రం నిరాశపరిచారు. 52 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన దశలో కెప్టెన్ కోహ్లికి రాయుడు అండగా నిలిచాడు. ఈ జోడి బౌండరీలతో విరుచుకుపడి స్కోరును పట్టాలెక్కించింది. 59 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ సాధించాడు. అయితే కుదురుగా సాగుతున్న ఇన్నింగ్స్‌ను రవి పటేల్ దెబ్బతీశాడు.



సింప్సన్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లి అవుట్ కావడంతో నాలుగో వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. కొద్దిసేపటికే జడేజా (7) వెనుదిరిగాడు. 60 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న రాయుడు 40వ ఓవర్‌లో రిటైర్డ్ అవుట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత భారత ఇన్నింగ్స్ కుప్పకూలింది. ఆఫ్ స్పిన్నర్ రేనర్ (4/32) ధాటికి 19 పరుగుల వ్యవధిలో చివరి ఐదు వికెట్లను కోల్పోయింది.



అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మిడిలెసెక్స్‌ను భారత బౌలర్లు కలిసికట్టుగా నిలువరించారు. వీరి కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా జట్టు 39.5 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటయ్యింది. హిగ్గిన్స్ (24 బంతుల్లో 20; 3 ఫోర్లు), హారిస్ (22 బంతుల్లో 20; 4 ఫోర్లు) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చివరి వరుస బ్యాట్స్‌మెన్‌ను కరణ్ శర్మ (3/14) వణికించాడు. భువనేశ్వర్, షమీ, మోహిత్, ఉమేశ్, కులకర్ణి, అశ్విన్‌లకు తలా ఓ వికెట్ దక్కింది.



స్కోరు బోర్డు

భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) సంధూ (బి) ఫిన్ 8; ధావన్ (సి) మలన్ (బి) సంధూ 10; కోహ్లి (సి) సింప్సన్ (బి) పటేల్ 71; రహానే (సి) ఫిన్ (బి) హారిస్ 14; రాయుడు (రిటైర్డ్ అవుట్) 72; జడేజా (సి) గుబ్బిన్స్ (బి) పటేల్ 7; అశ్విన్ ఎల్బీడబ్ల్యు (బి) రేనర్ 18; శామ్సన్ (సి అండ్ బి) రేనర్ 6; బిన్నీ (సి అండ్ బి) రేనర్ 0; కరణ్ శర్మ నాటౌట్ 8; రైనా (స్టంప్డ్) సింప్సన్ (బి) రేనర్ 5; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (44.2 ఓవర్లలో ఆలౌట్) 230.

వికెట్ల పతనం: 1-19; 2-29; 3-52; 4-156; 5-174; 6-211; 7-211; 8-211; 9-224; 10-230.

బౌలింగ్: ఫిన్ 6-0-20-1; సంధూ 9-1-65-1; హారిస్ 7-1-29-1; పొడ్‌మోర్ 4-0-26-0; పటేల్ 9-0-56-2; రేనర్ 9.2-1-32-4.

 

మిడిలెసెక్స్ ఇన్నింగ్స్: మలన్ (బి) షమీ 5; గుబ్బిన్స్ (సి) శామ్సన్ (బి) భువనేశ్వర్ 2; స్టిర్లింగ్ (సి) శామ్సన్ (బి) ఉమేశ్ 17; మోర్గాన్ (సి) శామ్సన్ (బి) మోహిత్ 16; హిగ్గిన్స్ (సి) ధావన్ (బి) కులకర్ణి 20; సింప్సన్ ఎల్బీడబ్ల్యు (బి) అశ్విన్ 19; బల్బిర్నీ (బి) కరణ్ 19; రేనర్ (రనౌట్) 5; హారిస్ (స్టంప్డ్) శామ్సన్ (బి) కరణ్ 20; పొడ్మోర్ నాటౌట్ 4; సంధూ ఎల్బీడబ్ల్యు (బి) కరణ్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (39.5 ఓవర్లలో ఆలౌట్) 135.

వికెట్ల పతనం: 1-7; 2-11; 3-34; 4-64; 5-67; 6-101; 7-108; 8-114; 9-135; 10-135.

బౌలింగ్: భువనేశ్వర్ 3-0-7-1; షమీ 4-1-13-1; మోహిత్ 5-2-20-1; ఉమేశ్ 7-0-32-1; కులకర్ణి 4-0-13-1; అశ్విన్ 6-2-16-1; జడేజా 6-0-14-0; కరణ్ 4.5-1-14-3.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top