చెప్పను బ్రదర్‌!

చెప్పను బ్రదర్‌!


కుంబ్లేతో వివాదంపై నోరు విప్పని కోహ్లి



పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: భారత కోచ్‌ పదవికి అనిల్‌ కుంబ్లే రాజీనామా, అందుకు దారి తీసిన కారణాల గురించి చర్చ జరగడంతో ఈ వివాదంలో రెండో కోణంపై అందరికీ ఆసక్తి నెలకొంది. కోహ్లి కూడా తన వాదనలు వినిపిస్తాడని అనిపించింది. అయితే దీనిపై కోహ్లి మౌనాన్నే ఆశ్రయించాడు. కుంబ్లే రాజీనామా అనంతరం గురువారం కోహ్లి తొలిసారి మీడియా ముందుకు వచ్చాడు. కుంబ్లే అంటే తనకు ‘గౌరవం’ ఉందని చెప్పిన కోహ్లి... ఆటగాళ్ల మధ్య జరిగిన విషయాలను తాను బయటకు చెప్పబోనన్నాడు. ‘అనిల్‌ భాయ్‌ తన అభిప్రాయాలు వెల్లడించారు. కోచ్‌ పదవి నుంచి తప్పుకోవాలని ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మేం గౌరవిస్తాం. క్రికెటర్‌గా దేశానికి ఎనలేని సేవలందించిన ఆయనంటే మాకు చాలా గౌరవం ఉంది.



ఆ విషయంలో కుంబ్లేను తక్కువ చేయలేం’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. అయితే డ్రెస్సింగ్‌ రూమ్‌ ‘పవిత్రత’ను తాను కాపాడాల్సిన అవసరం ఉందని అన్నాడు. ‘చాంపియన్స్‌ ట్రోఫీ సమయంలో నేను 11 సార్లు మీడియా సమావేశాల్లో పాల్గొన్నాను. గత 3–4 నాలుగేళ్లుగా భారత జట్టులో ఒక సంస్కృతి నెలకొంది. మా మధ్య అంతర్గతంగా ఏం జరిగినా దానిని బయటకు చెప్పకూడదని మేం గట్టిగా నిర్ణయించుకున్నాం. అదంతా వ్యక్తిగత వ్యవహారం. డ్రెస్సింగ్‌ రూమ్‌ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మాకుంది. అన్నింటికంటే మాకు అదే ముఖ్యం. దాని గురించి బహిరంగంగా మాట్లాడను. కుంబ్లే తాను చెప్పదల్చుకున్నది చెప్పారు. ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తాం’ అని అన్నాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top