కోహ్లి ఆడకుంటే ఖతమేనా!

కోహ్లి ఆడకుంటే ఖతమేనా! - Sakshi


భారత క్రికెట్‌లో గత మూడేళ్లుగా... ముఖ్యంగా గత ఏడాది కాలంగా ఓ ట్రెండ్ నడుస్తోంది. విరాట్ కోహ్లి బాగా ఆడితే భారత్ జట్టు కచ్చితంగా గెలుస్తోంది. ఒకవేళ కోహ్లి విఫలమైతే భారత్ గెలవొచ్చు లేదా ఓడిపోవచ్చు. ఫలితం ఊహించలేని పరిస్థితి. ముఖ్యంగా వన్డేలు, టి20ల్లో ఇది బాగా ఎక్కువగా కనిపిస్తోంది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి నాలుగు వన్డేల్లోనూ ఫలితం ఇలాగే వచ్చింది. ధర్మశాలలో 85 పరుగులు, మొహాలీలో 154 పరుగులు చేసి రెండు వన్డేల్లోనూ విజయం పూర్తయ్యేవరకూ కోహ్లి క్రీజులో ఉన్నాడు. ఢిల్లీలో 9 పరుగులు, రాంచీలో 45 పరుగులు చేసి కోహ్లి అవుటయ్యాడు. ఫలితం... భారత్ ఓటమి. ఎందుకిలా..? కొత్త కుర్రాళ్లు కుదురుకునేందుకు సమయం తీసుకుంటున్నందున ఇలా జరుగుతోందా..? లేక గతంలో జట్టు మొత్తం సచిన్ మీద ఆధారపడినట్లు... ఇప్పుడు కోహ్లిపై ఆధారపడుతుందా..? ఒకవేళ కోహ్లి విఫలమైతే పరిస్థితి ఏమిటి..?






సాక్షి క్రీడావిభాగం

భారత క్రికెట్ ప్రస్థానం 1990ల్లో ఎలా సాగిందో మనందరికీ తెలిసిందే. ఒక ఎండ్‌లో సచిన్ నిలబడి ఉంటే రెండో ఎండ్‌లో మిగిలిన వాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టేవారు. సచిన్ ఆడితే భారత్ గెలిచేది. లేకపోతే ఓడిపోయేది. సచిన్ అవుట్ కాగానే అభిమానులు స్టేడియం నుంచి వెళ్లిపోయేవాళ్లు. ద్రవిడ్, గంగూలీ, సెహ్వాగ్‌లాంటి ఆటగాళ్లు వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. దీంతో జట్టు విజయాలు పెరిగారుు. మళ్లీ సీనియర్లంతా రిటైరైన తర్వాత ఇప్పుడు కూడా పరిస్థితి క్రమంగా సచిన్ జమానా తరహాలో మారిపోతోంది. కోహ్లి ఉంటే కచ్చితంగా గెలుస్తామనే ధీమా భారత అభిమానుల్లో వచ్చింది. అరుుతే కోహ్లి అవుట్ కాగానే స్టేడియాల నుంచి వెళ్లిపోయే పరిస్థితి ఇంకా రాలేదు. సరైన ప్రత్యామ్నాయాలు, నాణ్యమైన క్రికెటర్లను చూసుకోకపోతే ఇలాంటి పరిస్థితి త్వరలోనే వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.


 

ఎందుకిలా జరుగుతోంది?

గత ఏడాది కాలంగా కోహ్లి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది స్వదేశంలో జరిగిన టి20 ప్రపంచకప్, ఆ తర్వాత జరిగిన ఐపీఎల్‌లో తన ఆటను చూస్తే... మనిషా, పరుగుల యంత్రమా అనే సందేహం కూడా కలిగింది. ఆ తర్వాత క్రమంగా టెస్టుల్లోనూ చెలరేగిపోయాడు. ఈ ఏడాది రెండు డబుల్ సెంచరీలు చేశాడు. అదే జోరును న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేల్లో ప్రదర్శించలేకపోయాడు. రెండు మ్యాచ్‌ల్లో తను బాగా ఆడి రెండింట్లో విఫలమయ్యాడు. అందులోనూ మొహాలీలో ఆరంభంలోనే టేలర్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయాడు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని చివరి వరకూ నిలబడి జట్టును గెలిపించాడు. కోహ్లి బాగా ఆడుతున్నంతసేపు ఎలాంటి సమస్యా లేదు. కోహ్లి విఫలమైతేనే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నిజానికి జట్టులో అందరూ కొత్త ఆటగాళ్లేం కాదు. ఓపెనర్లు రోహిత్, రహానే ఇద్దరూ అనుభవజ్ఞులే. ఇక ధోని అందరికంటే సీనియర్. అరుుతే ఈ ముగ్గురూ తమ స్థారుుకి తగ్గట్లుగా ఆడటం లేదు. మొహాలీ ఇన్నింగ్‌‌సను మినహారుుస్తే ధోని మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. రోహిత్ దారుణమైన ఫామ్‌లో ఉంటే... రహానే ఒక్క మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించాడు. నిజానికి ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ భారత్‌కు ఇప్పటివరకూ అత్యంత భారీ లక్ష్యాలేం నిర్దేశించలేదు. కానీ సీనియర్ క్రికెటర్లు విఫలమైతే క్రీజులోకి వచ్చే మనీశ్ పాండే, కేదార్ జాదవ్‌లకు పెద్దగా అనుభవం లేదు. హార్ధిక్ పాండ్యా కూడా ఇంకా పూర్తి స్థారుులో కుదురుకోలేదు. గతంలో కోహ్లి విఫలమైతే యువరాజ్, రైనా లాంటి క్రికెటర్లు ఉండేవారు. కానీ ఇప్పుడు వాళ్లెవరూ జట్టులో లేరు. ఒకరకంగా జట్టు సంధికాలంలో ఉంది అనుకోవాలి. దీనికి తోడు శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ కూడా గాయాల కారణంగా అందుబాటులో లేరు. ఇవన్నీ కలిపి భారత బ్యాటింగ్ లైనప్‌ను బలహీనంగా మార్చారుు.


 

ఛేదనలో మరింత ఒత్తిడి

నిజానికి ఒకే క్రికెటర్ ఒంటిచేత్తో ఎల్లకాలం మ్యాచ్‌లు గెలిపించలేడు. ప్రతి మ్యాచ్‌లోనూ కోహ్లి ఆడతాడులే అనే ధీమా కూడా పనికిరాదు. ఇలాంటి స్థితి వల్ల కోహ్లిపై ఒత్తిడి పెరుగుతుంది. అంతేకాదు... కోహ్లి అవుట్ కాగానే తర్వాత వచ్చే ఆటగాళ్లు మరింత ఒత్తిడిలో పడతారు. ఇక లక్ష్య ఛేదనలో కోహ్లి ‘కింగ్’. ప్రపంచ క్రికెట్‌లో లక్ష్య ఛేదనలో అత్యుత్తమ సగటుతో పరుగులు చేసిన క్రికెటర్ కోహ్లి. 94 మ్యాచ్‌ల్లో తను 4656 పరుగులు 63.78 సగటుతో చేశాడు. నాటి సచిన్ నుంచి నేటి డివిలియర్స్ వరకూ ఎవరికీ ఇంత ఘనమైన రికార్డు లేదు. ఛేజింగ్‌లో కోహ్లి 16 సెంచరీలు చేస్తే భారత్ 14 మ్యాచ్‌లు గెలిచింది. 25 ఏళ్ల కెరీర్‌లో సచిన్ కూడా ఛేదనలో 14 సెంచరీలు చేసి మ్యాచ్‌లు గెలిపించాడు. ఇప్పటికే ఆధునిక సచిన్‌గా, రిచర్డ్స్‌ను మించిన హిట్టర్‌గా ప్రశంసలు అందుకున్న కోహ్లి కెరీర్ ఇలాగే సాగాలంటే మిగిలిన ఆటగాళ్లు కూడా మరింత బాధ్యతగా ఆడాలి.


 

పరిష్కారం ఏమిటి?


కోహ్లి మీద ఆధారపడే పరిస్థితి మంచిది కాదనే విషయం ధోనితో సహా భారత క్రికెట్‌లో అందరికీ తెలుసు. అరుుతే వన్డే కెప్టెన్ మాత్రం ఇది ‘నేర్చుకుంటున్న సమయం’ అని చెబుతున్నాడు. నిజానికి రోహిత్, రహానేలలో ఒక్కరు ఫామ్‌లో ఉండి... ధావన్, రాహుల్ కూడా అందుబాటులో ఉంటే పరిస్థితి ఇంత దారుణంగా ఉండకపోవచ్చు. అప్పుడు జాదవ్, మనీశ్ పాండే లాంటి క్రికెటర్లకు కుదురుకోవడానికి సమయం పడుతుంది. ఒకవేళ ఈ సీనియర్ క్రికెటర్లు ఇలాంటి ఫామ్‌లో ఉంటే పరిస్థితి ఏంటనేది చూసుకోవాలి. నిజానికి ఎంత నేర్చుకునే సమయమైనా విజయాలు కూడా ముఖ్యమే. వచ్చే ఏడాది చాంపియన్‌‌స ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్‌గా భారత్ బరిలోకి దిగబోతుంది. దానికి ముందు ధోనిసేనకు మిగిలింది కేవలం నాలుగు వన్డేలు. ఈ ఐదు వన్డేల్లో ఒకటి ఈ సిరీస్‌లోనే ఉంది. ఇక తర్వాత ఆడబోయే మూడు వన్డేలకై నా పూర్తిస్థారుులో అందరు ఆటగాళ్లూ అందుబాటులో ఉండి... కోహ్లి భారాన్ని కొంతవరకై నా వేరే క్రికెటర్లు పంచుకోవాలి. ఒకే క్రికెటర్ మ్యాచ్‌లన్నీ గెలిపించలేడనే వాస్తవాన్ని గ్రహించి జట్టు కూర్పును సరిచూసుకోవాలి. అలా కాకుండా ప్రయోగాలు చేస్తూ పోతే ఆ ప్రభావం ఫలితాలపై పడుతుంది.




గత రెండేళ్లలో కోహ్లి 34 వన్డేలు ఆడాడు. ఇందులో భారత్ 18 మ్యాచ్‌లు గెలిచి, 15 ఓడింది. ఒక మ్యాచ్ రద్దరుుంది.



  భారత్ గెలిచిన 18 మ్యాచ్‌ల్లో కోహ్లి సగటు 81.15. ఈ 18లో ఆరు మ్యాచ్‌ల్లో తను  చివరి వరకూ క్రీజులో ఉన్నాడు.



భారత్ గెలిచిన 18 మ్యాచ్‌ల్లో కోహ్లి 4 సెంచరీలు, నాలుగు అర్ధసెంచరీలు చేశాడు. విఫలమైన మ్యాచ్‌లు కేవలం 4.



గత రెండేళ్లలో భారత్ ఓడిన 15 మ్యాచ్‌ల్లో కోహ్లి సగటు 37.86.  ఈ 15 మ్యాచ్‌ల్లోనూ తను అవుటయ్యాడు.



భారత్ ఓడిన ఈ మ్యాచ్‌ల్లో కోహ్లి చేసిన సెంచరీలు 2. అర్ధసెంచరీలు 3. మిగిలిన 10 మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు.



  ఇక టి20ల్లో కోహ్లి గత రెండేళ్లలో 18 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో భారత్ 11 గెలిచి, ఆరు ఓడింది. ఒక మ్యాచ్  రద్దరుుంది.



  భారత్ గెలిచిన 11 మ్యాచ్‌ల్లో కోహ్లి సగటు 128.25. ఇందులో ఏడు మ్యాచ్‌ల్లో చివరి వరకూ క్రీజులో ఉన్నాడు.




ఈ 11 మ్యాచ్‌ల్లో కోహ్లి ఏకంగా ఏడు అర్ధసెంచరీలు చేశాడు. తను విఫలమైన మ్యాచ్ కేవలం ఒక్కటే.



భారత్ ఓడిన ఆరు మ్యాచ్‌ల్లో కోహ్లి సగటు 47.60. రెండు అర్ధసెంచరీలు చేశాడు. మూడు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు.


 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top