చెమటోడ్చి నెగ్గిన కివీస్

చెమటోడ్చి నెగ్గిన కివీస్


ఆక్లాండ్:వన్డే వరల్డ్ కప్ లో న్యూజిలాండ్-ఆస్ట్రేలియాల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ ఆద్యంతం ఆసక్తిని తలపించింది. ప్రేక్షకుడు టీవీలకు అతుక్కుపోయేలా చేసిన ఈ మ్యాచ్ లో కివీస్ చెమటోడ్చి గెలిచింది. తొలుత ఆసీస్ ను 151పరుగులకే కివీస్ ఆటగాళ్లు ఆలౌట్ చేస్తే.. తరువాత బ్యాటింగ్ దిగిన కివీస్ కు ఆసీస్ చుక్కలు చూపించింది. 


 


శనివారం ఆసీస్ తో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది.  23.1 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయిన  లక్ష్యాన్ని చేరుకుంది.  లక్ష్య ఛేదనలో ఆద్యంతం తడబడిన కివీస్ చివర్లో తేరుకుని ఆసీస్ కు గెలుపును దూరం చేసింది. మెక్ కల్లమ్ పెవిలియన్ కు చేరిన అనంతరం న్యూజిలాండ్ ఆటగాళ్లు కూడా ఆసీస్ బాటలో పయనించినట్టు కనబడ్డారు. కివీస్ ఆటగాళ్లలో రాస్ టేలర్(1), ఎలియట్(0), కోరీ అండరసన్(26), లూక్ రోంచీ (6), వెటోరీ(2) వరుసగా పెవిలియన్ చేరడంతో కివీస్ కష్టాల్లో పడింది.  అయితే ఆదిలో ఓపెనర్ బ్రెండెన్ మెక్ కల్లమ్(50; 24 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులు) దూకుడుగా ఆడటంతో పాటు, విలియమ్స్ సన్(45 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా ఆకట్టుకోవడంతో కివీస్ బతికి బయటపడింది. దీంతో ఆసీస్ కు ఈ వరల్డ్ కప్ లో తొలి ఓటమి ఎదురైంది.


 


ఆసీస్ విలవిల


అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ విలవిల్లాడింది. ఆసీస్ ఇన్నింగ్స్ ను  ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ లు ధాటిగానే ఆరంభించారు. అయితే 30 పరుగుల వద్ద ఆసీస్ ఫించ్(14) వికెట్ ను కోల్పోవడమే తరువాయి ఇక  వరుసగా పెవిలియన్ కు క్యూ మొదలైంది. డేవిడ్ వార్నర్(34), షేన్ వాట్సన్(23),మైకేల్ క్లార్క్ (12), హాడిన్(43) పరుగులు మినహా ఎవరూ రాణించలేదు. క్రీజ్ లో కి వచ్చిన ఆటగాడు వచ్చినట్లే పెవిలియన్ కు చేరాడు. 106 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆసీస్ ను హాడిన్ ఆదుకున్నాడు. 10 వ వికెట్ కు హాడిన్-కమ్మిన్స్ లు 45 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఆసీస్ 32.2 ఓవర్లలో 151పరుగులు చేసింది.


ఆసీస్ ఖాతాలో 'అత్యల్ప'రికార్డు


వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా మరో చెత్త రికార్డును మూటగట్టుకుంది. వరల్డ్ కప్ 2015లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మూడోసారి పేలవమైన రికార్డును నమోదు చేసింది. శనివారం నాటి మ్యాచ్ లో ఆసీస్ 151పరుగులకే చాపచుట్టేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆసీస్ ఖాతాలో మరో రికార్డు చేరింది. అంతకుముందు 1983 నాటి వరల్డ్ కప్ లో ఇండియాపై ఆసీస్ చేసిన 129 పరుగులు తొలి అత్యల్ప స్కోరు కాగా, అదే వరల్డ్ కప్ లో వెస్టిండీస్ పై చేసిన 151 పరుగులు రెండో అత్యల్ప స్కోరు.

 

అయితే ఆ తరువాత జరిగిన  ఏ వరల్డ్ కప్ లోనూ ఆసీస్ ఇంత పేలవంగా ఆడలేదు. తాజాగా జరుగుతున్న వరల్డ్  కప్ లో ఆసీస్ బ్యాటింగ్ పేకమేడలా కూలడంతో గత వెస్టిండీస్ రికార్డును సమం చేసింది. అయితే వన్డేల్లో న్యూజిలాండ్ పై ఆసీస్ కు ఇది మూడో అత్యల్ప స్కోరు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top