ఈడెన్... తడబడెన్!

ఈడెన్... తడబడెన్! - Sakshi


భారత బ్యాట్స్‌మెన్ విఫలం

- తొలి రోజు 239/7

- రాణించిన పుజారా, రహానే

- న్యూజిలాండ్‌తో రెండో టెస్టు


అదృష్టవశాత్తూ అవకాశం దక్కించుకున్న శిఖర్ ధావన్ పట్టుమని పది బంతులే ఆడగా, హెన్రీ వేగానికి మురళీ విజయ్ తలవంచాడు... మరోసారి మన కెప్టెన్, ప్రత్యర్థి వ్యూహాత్మక ఉచ్చులో చిక్కితే, రోహిత్ శర్మ ప్రతిభ ఈసారి కూడా రెండు పరుగులకే పరిమితమైంది. ఇలాంటి స్థితిలో మేమున్నామంటూ పుజారా, రహానేలు అచ్చమైన టెస్టు ఆటతో జట్టును ఆదుకున్నారు. జట్టు కుప్పకూలిపోకుండా ఈ ఇద్దరి జోడి ఆపద నుంచి కాపాడినా... తొలి రోజు భారత్ ప్రదర్శన మోస్తరు స్కోరుకే పరిమితమైంది. సొంతగడ్డపై అచ్చొచ్చిన మైదానంలో గుర్తుండిపోయే 250వ టెస్టులో ఆశించిన ఆరంభం మాత్రం కాదిది.

 

 కొత్తగా వేసిన పిచ్ పేస్‌కు అనుకూలిస్తోంది...మరోవైపు వికెట్‌పై అదనపు బౌన్‌‌స కూడా కలిసి రావడంతో కివీస్ బౌలర్లు ఆటాడుకున్నారు. కచ్చితత్వంతో పదే పదే ఆఫ్ స్టంప్‌పై బౌలింగ్ చేసి ఫలితం రాబట్టారు. ఇన్నింగ్‌‌స ఆరంభంలోనే మూడు వికెట్లు తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. తమ ప్రధాన బ్యాట్స్‌మన్, కెప్టెన్ విలియమ్సన్ దూరమైనా స్థయిర్యం కోల్పోని ఆ జట్టు పట్టుదలతో ఆధిక్యం ప్రదర్శించింది. తొలి టెస్టులానే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్‌‌సలో కూడా భారత్ బ్యాటింగ్ ఆశించిన స్థాయిలో లేకపోగా, ప్రత్యర్థి బౌలర్లు చక్కగా రాణించారు. ఈ నేపథ్యంలో రెండో రోజు ఆట ఎలా సాగుతుందనేది ఆసక్తికరం.  



కోల్‌కతా: సొంతగడ్డపై 250వ టెస్టు మ్యాచ్ బరిలోకి దిగిన భారత జట్టు బ్యాటింగ్‌లో తడబడింది. న్యూజిలాండ్‌తో శుక్రవారం ఇక్కడి ఈడెన్ గార్డెన్‌‌స మైదానంలో ప్రారంభమైన రెండో టెస్టులో భారీ స్కోరుకు బాటలు వేయడంలో జట్టు విఫలమైంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 86 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. చతేశ్వర్ పుజారా (219 బంతుల్లో 87; 17 ఫోర్లు), అజింక్య రహానే (157 బంతుల్లో 77; 11 ఫోర్లు) అర్ధసెంచరీలు చేశారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 141 పరుగులు జోడించడం విశేషం. కివీస్ బౌలర్లలో హెన్రీ 3 వికెట్లు పడగొట్టగా, జీతన్ పటేల్‌కు 2 వికెట్లు దక్కాయి. ప్రస్తుతం వృద్ధిమాన్ సాహా (14 బ్యాటింగ్), రవీంద్ర జడేజా (0 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. 

 

తొలి సెషన్: టపటపా

 గాయపడిన కేఎల్ రాహుల్ స్థానంలో భారత జట్టు ధావన్‌కు అవకాశం కల్పించడంతో గౌతమ్ గంభీర్‌కు తుది జట్టులో చోటు లభించలేదు. ఉమేశ్‌కు బదులుగా భువనేశ్వర్‌ను ఎంపిక చేశారు. అటు న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ అనారోగ్యంతో తప్పుకోవడంతో రాస్ టేలర్ నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. ఆ జట్టు మొత్తం మూడు మార్పులతో బరిలోకి దిగింది. భారత జట్టు సొంతగడ్డపై వరుసగా ఏడో టెస్టులోనూ టాస్ నెగ్గడం విశేషం.

 

తనకు దక్కిన అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో ధావన్ (1) విఫలమయ్యాడు. హెన్రీ వేసిన మ్యాచ్ రెండో ఓవర్లోనే అతను బంతిని వికెట్లపైకి ఆడుకున్నాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే మరో అద్భుత బంతితో హెన్రీ, ఫామ్‌లో ఉన్న విజయ్ (9)ను కూడా పెవిలియన్ చేర్చాడు. మైదానంలో ఉన్నంత సేపూ ఇబ్బంది పడిన కెప్టెన్ కోహ్లి (9) మరోసారి అంచనాలు అందుకోలేకపోయాడు. దూరంగా వెళుతున్న బౌల్ట్ బంతిని వెంటాడి గల్లీలో క్యాచ్ ఇవ్వడంతో 46 పరుగులకే భారత్ 3 వికెట్లు కోల్పోయి0ది. ఈ దశలో పుజారా, రహానే మరో వికెట్ పడకుండా అడ్డుకున్నారు. ఒక ఎండ్‌లో సహచరులు వెనుదిరిగినా... మరో ఎండ్‌లో పట్టుదలగా ఆడిన పుజారా లంచ్ సమయానికి క్రీజ్‌లో నిలదొక్కుకున్నాడు.

 ఓవర్లు: 27, పరుగులు: 57, వికెట్లు: 3

 

రెండో సెషన్: కీలక భాగస్వామ్యం

 విరామం తర్వాత పుజారా, రహానే జట్టు ఇన్నింగ్‌‌సను నడిపించారు. వీరిద్దరు జాగ్రత్తగా ఆడటంతో పాటు కివీస్ కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా పరుగులు బాగా నెమ్మదిగా వచ్చాయి. ఈ క్రమంలో అర్ధసెంచరీని అందుకోవడానికి పుజారా 146 బంతులు తీసుకున్నాడు. లంచ్ తర్వాత 19 పరుగులు చేసేందుకు అతనికి 66 బంతులు పట్టాయి. మరో వైపు రహానే కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. వీరిద్దరి పట్టుదల కారణంగా కివీస్‌కు మొత్తం సెషన్‌లో ఒక్క వికెట్ కూడా దక్కలేదు. అయితే భారత్ 31 ఓవర్లలో 79 పరుగులే చేయగలిగింది.

 ఓవర్లు: 31, పరుగులు: 79, వికెట్లు: 0

 

 మూడో సెషన్: కివీస్ పైచేయి

 టీ బ్రేక్ తర్వాత కొద్ది సేపటికే 100 బంతుల్లో రహానే అర్ధ సెంచరీ పూర్తయి0ది. ఆ తర్వాత ఇద్దరు బ్యాట్స్‌మెన్ ధాటిని పెంచి వేగంగా పరుగులు చేసేందుకు ప్రయత్నించారు. చివరకు 47.3 ఓవర్ల భాగస్వామ్యం తర్వాత ఈ జోడీని కివీస్ విడదీయగలిగింది. అప్పటి వరకు సంయమనంతో ఆడిన పుజారా, వాగ్నర్ వేసిన చక్కటి బంతికి షార్ట్ కవర్‌లో క్యాచ్ ఇచ్చి సెంచరీ చేజార్చుకున్నాడు.

 

 ఆ తర్వాత మ్యాచ్ మళ్లీ కివీస్ వైపు మొగ్గింది. రోహిత్ శర్మ (2) మరోసారి విమర్శలకు అవకాశం ఇస్తూ వచ్చిన వెంటనే వెనుదిరిగాడు. రోహిత్‌ను అవుట్ చేసిన పటేల్, అదే జోరులో తన తర్వాతి ఓవర్లోనే రహానేను ఎల్బీగా అవుట్ చేశాడు. వచ్చీ రాగానే సాన్‌ట్నర్ ఓవర్లో మూడు ఫోర్లు బాది దూకుడు ప్రదర్శించిన అశ్విన్ (33 బంతుల్లో 26; 4 ఫోర్లు)కు హెన్రీ బౌలింగ్‌లో బ్రేక్ పడింది. అశ్విన్ వికెట్ల ముందు దొరికిపోవడంతో భారత్ కష్టాలు పెరిగారుు. సాహా, జడేజా కలిసి మరో రెండు ఓవర్లు జాగ్రత్తగా ఆడారు.

 ఓవర్లు: 28, పరుగులు: 103, వికెట్లు: 4

 

మేం ఈ రోజు చాలా బాగా ఆడాం. మ్యాచ్‌కు ముందు పిచ్‌పై ఎక్కువగా కవర్లు కప్పి ఉంచారు కాబట్టి అది మాకు అనుకూలంగా మారుతుందని ఊహించి కొత్త బంతితో ప్రయోజనం పొందాలని ముందే అనుకున్నాం. ముఖ్యంగా పరుగులు ఇవ్వకుండా నిరోధించి ఒత్తిడి పెంచితేనే వికెట్లు దక్కుతాయని తెలుసు. అందుకే అదే వ్యూహాన్ని అమలు చేయగలిగాం. తొలి రోజు మాకు ఇలాంటి పిచ్ లభిస్తుందని మేం ఊహించలేదు. మా స్పిన్నర్లు కూడా తగిన విధంగా స్పందించి బ్యాట్స్‌మెన్‌ను అడ్డుకోగలిగారు.

 - హెన్రీ, కివీస్ బౌలర్  

 

 స్కోరు వివరాలు

 భారత్ తొలి ఇన్నింగ్‌‌స: ధావన్ (బి) హెన్రీ 1; విజయ్ (సి) వాట్లింగ్ (బి) హెన్రీ 9; పుజారా (సి) గప్టిల్ (బి) వాగ్నర్ 87; కోహ్లి (సి) లాథమ్ (బి) బౌల్ట్ 9; రహానే (ఎల్బీ) (బి) పటేల్ 77; రోహిత్ (సి) లాథమ్ (బి) పటేల్ 2; అశ్విన్ (ఎల్బీ) (బి) హెన్రీ 26; సాహా (బ్యాటింగ్) 14; జడేజా (బ్యాటింగ్) 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (86 ఓవర్లలో 7 వికెట్లకు) 239.

 వికెట్ల పతనం: 1-1; 2-28; 3-46; 4-187; 5-193; 6-200; 7-231.

 బౌలింగ్: బౌల్ట్ 16-8-33-1; హెన్రీ 15-6-35-3; వాగ్నర్ 15-5-37-1; సాన్‌ట్నర్ 19-5-54-0; పటేల్ 21-3-66-2.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top