‘కింగ్' కార్ల్‌సన్

‘కింగ్' కార్ల్‌సన్


సాక్షి క్రీడావిభాగం: ఎలా మొదలు పెట్టామన్నది కాదు... ఎలా ముగించామన్నదే ముఖ్యం. ఈ డైలాగ్ చెస్ మేధావి మాగ్నస్ కార్ల్‌సన్‌కు అచ్చు గుద్దినట్లు సరిపోతుంది. చదరంగంలో దిగ్గజాలు, మహామహులు కూడా గేమ్‌లో ఓపెనింగ్స్‌పై ప్రత్యేక దృష్టి పెడతారు.



మంచి ఆరంభం లభిస్తే సగం గేమ్ సొంతమైనట్లు అనుకుంటూ కొత్త తరహా ఓపెనింగ్‌లను ప్రయత్నిస్తారు. కానీ మాగ్నస్ దానిని లెక్క చేయడు. ఎలాంటి శైలి లేకపోవడం కూడా ఒక శైలి అన్నట్లుగా... పాపులర్ ఓపెనింగ్‌లను పట్టించుకోకుండా ప్రతీ గేమ్‌ను కొత్త రకం ఎత్తులతో ప్రారంభించడమే మాగ్నస్ పద్ధతి.



శాస్త్రీయత లేని సన్నాహకంగా కొందరు విమర్శించినా... ప్రత్యర్థులకు అంతు చిక్కకుండా, ఎలా మొదలు పెట్టాలో అర్థం కాకుండా మరింత గందరగోళంలో పడేసే ఈ నార్వేయన్ స్టైల్ ఇప్పుడు అతడిని శిఖరాన నిలబెట్టింది.



 కార్ల్‌సన్  బలం, బలగం అంతా మిడిల్ గేమ్‌లోనే. కంప్యూటర్ విశ్లేషకులు, గ్రాండ్ మాస్టర్లు ఇక ఆట ముగిసింది... ‘డ్రా’ తప్ప మరో అవకాశం లేదని తేల్చేసిన చోటే కార్ల్‌సన్ దూకుడు మొదలవుతుంది. అక్కడి నుంచి అతను వేసే వైవిధ్యమైన ఎత్తులు గేమ్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పుతాయి. చివరకు అతడిని విజేతగా నిలుపుతాయి. దీనికి అభిమానులు పెట్టుకున్న ముద్దు పేరు కార్ల్‌సన్ ఎఫెక్ట్.



 ఆరంభపు అడుగులు...

 24వ పుట్టిన రోజుకు వారం రోజుల ముందే ఈ చదరంగ పిడుగు మరోసారి జగజ్జేతగా తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. కార్ల్‌సన్ నేపథ్యం, అతనిలో వయసుకు మించిన ప్రతిభను చూసినవారికి ఇది ఆశ్చర్యం కలిగించదు. మాటలు కూడా సరిగా రాని రెండేళ్ల వయసులోనే అతను కఠినమైన జిగ్ సా పజిల్స్ ఛేదించాడు. 14 ఏళ్ల వయసువారు ఎంచుకునే లెగో బ్రిక్స్‌ను నాలుగేళ్లకే ఆడుకున్నాడు.



ప్రపంచ దేశాల పేర్లు, జనాభా... ఇలా సమస్త విజ్ఞాన సర్వస్వం బుర్రకెక్కించుకున్న మాగ్నస్ చాలా మందిలాగా బాల మేధావిగా మిగిలిపోలేదు. ఆరంభంలో ఆసక్తి లేకపోయినా, తండ్రి ప్రోత్సాహంతో, శిక్షణతో 64 గడుల ఆటలో తనదైన ముద్ర వేశాడు.



 అన్నీ ఘనతలే...

 ఒక్కసారి చెస్‌లో ఓనమాలు నేర్చుకున్న తర్వాత కార్ల్‌సన్ ఇక ఆగలేదు. నార్వేలోని అన్ని వయో విభాగాల ఈవెంట్లలో పోటీ పడుతూ వరుసగా విజయాలు దక్కించుకున్నాడు. 2004లో అతని పేరు ప్రపంచ చెస్‌కు పరిచయమైంది. 13 ఏళ్ల 148 రోజుల వయసులోనే గ్రాండ్‌మాస్టర్ అయి ఆ సమయంలో ఈ ఘనత సాధించిన రెండో పిన్న వయస్కుడిగా నిలిచాడు.



ఆ తర్వాత కూడా నిలకడగా విజయాలు సాధిస్తూ 19 ఏళ్లకే ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచిన రికార్డును సొంతం చేసుకున్నాడు. 2010 జనవరి నుంచి ఇప్పటి వరకు మధ్యలో ఆరు నెలలు మినహాయిస్తే (ఆనంద్) ఇప్పటికీ అతనే నంబర్‌వన్ కావడం విశేషం. కొన్నాళ్లు చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ శిక్షణలో రాటుదేలిన మాగ్నస్, ఆ తర్వాత దూసుకుపోయాడు.



ఏకంగా ప్రపంచ చెస్‌లో అత్యుత్తమ ఎలో రేటింగ్ (2882)తో పాత రికార్డులన్నీ బద్దలు కొట్టాడు. కంప్యూటర్‌లో ఆటను నేర్చుకునేకంటే తన మెదడుకే పదును పెట్టడం ఇష్టపడతానని చెప్పే మాగ్నస్, ఇప్పుడు ఏకకాలంలో క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్‌లలో ప్రపంచ చాంపియన్‌గా కొనసాగుతున్నాడు.



 ఆటొక్కటే కాదు...

 వరల్డ్ చాంపియన్ చాలెంజర్‌ను ఎంపిక చేసే క్రమంలో ఫిడే ఇష్టారాజ్యంగా నిబంధనలు మారుస్తుందంటూ ధ్వజమెత్తి ఒకసారి టోర్నీ నుంచే తప్పుకోవడం ఈ నార్వే ఆటగాడిలో మరో కోణం. సాధారణంగా చెస్ ఆటగాళ్లలో కనిపించే గాంభీర్య ప్రదర్శన కాకుండా అతనికి టెన్నిస్, బాస్కెట్‌బాల్, టీటీ, వాలీబాల్... ఇలా అన్ని క్రీడల్లో ప్రవేశం ఉండటం విశేషం.



ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ విరామం సమయంలో అతను వీటితోనే పునరుత్తేజం పొందాడు. ఒక డ్రెస్ డిజైనింగ్ కంపెనీకి మోడల్‌గా కూడా పని చేసిన ఇతను, హాలీవుడ్ చిత్రం స్టార్ ట్రెక్ ఇంటూ డార్క్‌నెస్‌లో అవకాశం వచ్చినా చేయలేకపోయాడు. గతంలో కేవలం అటాకర్‌గానే గుర్తింపు ఉన్న కార్ల్‌సన్ ఇప్పుడు యూనివర్సల్ ప్లేయర్‌గా మారి మరోసారి చదరంగపు రారాజుగా నిలిచాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top