మన ‘రాకెట్‌’ పైపైకి...

మన ‘రాకెట్‌’ పైపైకి...


పురుషుల సింగిల్స్‌లో భారత బ్యాడ్మింటన్‌ ఆటగాళ్ల జోరు

ఒకరిని మించి మరొకరు రాణిస్తున్న వైనం

సంచలన విజయాలతో ప్రత్యర్థులకు చుక్కలు

చైనాకు దీటుగా ప్రదర్శన




నాడు... చైనా, కొరియా, జపాన్, మలేసియా, ఇండోనేసియా ఆటగాళ్లు ప్రత్యర్థులుగా ఎదురైతే మనోళ్ల విజయంపై ఎవరికీ అంతగా నమ్మకం ఉండేది కాదు.



నేడు... ప్రపంచ నంబర్‌వన్‌ లేదా ఒలింపిక్‌ చాంపియన్‌ లేదా ఆసియా విజేతలు ప్రత్యర్థులుగా ఎదురైనా మనోళ్లు వెనుకడుగు వేయడం లేదు. సంచలనం కూడా సంబర పడేలా విజయాలు సాధిస్తున్నారు.



ఇన్నాళ్లూ మహిళల సింగిల్స్‌లో సైనా, సింధు సాధించిన విజయాలతోనే మనం మురిసిపోయాం. పురుషుల సింగిల్స్‌ విషయానికొస్తే మనోళ్ల పోరాటం క్వార్టర్‌ ఫైనల్లో లేదా సెమీఫైనల్లో ముగిసేది. ఏడాదిలో ఒకటి లేదా రెండు టోర్నీల్లో ఈ మెరుపులు కనిపించేవి. కానీ నేడు సీన్‌ రివర్స్‌ అయింది. అడపాదడపా విజయాలు కాకుండా నిలకడగా రాణిస్తూ భారత్‌ నుంచి ఒక్కసారిగా నలుగురైదుగురు ఆటగాళ్లు తెరపైకి వచ్చేశారు.



సాక్షి క్రీడావిభాగం : వరుసగా మూడు సూపర్‌ సిరీస్‌ టోర్నమెంట్‌లలో ఫైనల్‌కు చేరుకోవడమే కాకుండా... వారం వ్యవధిలో రెండు సూపర్‌ సిరీస్‌ టోర్నమెంట్‌ టైటిల్స్‌ సాధించి కిడాంబి శ్రీకాంత్‌ భారత క్రీడాభిమానులను ఆనందడోలికల్లో ముంచాడు. పట్టుదలకు తోడు కృషి, సరైన మార్గదర్శకత్వం జతకలిస్తే అంతర్జాతీయస్థాయిలో మన ఆటగాళ్లు ఎవరికీ తీసిపోరని శ్రీకాంత్‌ నిరూపించాడు. 2014లో చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ టోర్నమెంట్‌లో దిగ్గజం లిన్‌ డాన్‌ (చైనా)ను మట్టికరిపించి శ్రీకాంత్‌ పెను సంచలనమే సృష్టించాడు. ఆ తర్వాత ఏడాది అతని ఖాతాలో గొప్ప విజయాలు కనిపించలేదు.



 2015లో ఇండియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ సాధించి శ్రీకాంత్‌ మరోసారి మెరిశాడు. ఈ టైటిల్‌ తర్వాత అదే ఏడాది అతను మళ్లీ ‘సూపర్‌ సిరీస్‌’ విజయాలు సాధించలేకపోయాడు. 2016లో రియో ఒలింపిక్స్‌లో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకోవడం మినహా శ్రీకాంత్‌ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. అయితే ఈ ఏడాది ఈ తెలుగు తేజం పడిలేచిన కెరటంలా ఎగిశాడు. చీలమండ గాయం నుంచి తేరుకున్నాక శ్రీకాంత్‌ ఈ ఏడాది వరుసగా మూడు సూపర్‌ సిరీస్‌ టోర్నీలలో (సింగపూర్, ఇండోనేసియా, ఆస్ట్రేలియన్‌) ఫైనల్‌కు చేరుకున్నాడు.



 సింగపూర్‌ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన అతను తర్వాతి రెండు టోర్నీల్లో టైటిల్స్‌ను సొంతం చేసుకున్నాడు. తద్వారా పురుషుల సింగిల్స్‌లో వరుసగా రెండు సూపర్‌ సిరీస్‌ టోర్నీలు గెలిచిన తొలి భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. జాతీయ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ శిక్షణలో రాటుదేలిన శ్రీకాంత్‌ను ఇటీవలే కొత్తగా వచ్చిన ఇండోనేసియా కోచ్‌లు ముల్యో హొండోయో, హరియవన్‌ మరింత మెరుగ్గా తీర్చిదిద్దారు.



జయహో సాయి...

అద్భుత ప్రతిభ ఉన్నా కీలక సమయంలో ఒత్తిడికి లోనై పరాజయాలు మూటగట్టుకున్న భమిడిపాయి సాయిప్రణీత్‌ ఈ ఏడాది అద్భుత పురోగతి సాధించాడు. తొలుత జనవరిలో సయ్యద్‌ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఏప్రిల్‌లో సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో ఈ హైదరాబాద్‌ ప్లేయర్‌ అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగి టైటిల్‌ను ఎగురేసుకపోయాడు. ఫైనల్లో అతను శ్రీకాంత్‌ను ఓడించడం విశేషం. ఆ తర్వాత జూన్‌లో థాయ్‌లాండ్‌ ఓపెన్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టోర్నీలో సాయిప్రణీత్‌ విజేతగా నిలిచాడు. ఇండోనేసియా ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే ఓడినప్పటికీ... ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌లో శ్రీకాంత్‌ చేతిలో ఓడిపోయాడు.  



ప్రణయ్‌ నాదం...

ఏడేళ్ల క్రితం యూత్‌ ఒలింపిక్‌ గేమ్స్‌లో రజతం సాధించి వెలుగులోకి వచ్చిన కేరళ ప్లేయర్‌ ప్రణయ్‌ ఇటీవలే జరిగిన ఇండోనేసియా ఓపెన్‌లో వరుస మ్యాచ్‌ల్లో మాజీ నంబర్‌వన్‌ లీ చోంగ్‌ వీ (మలేసియా), ప్రపంచ చాంపియన్‌ చెన్‌ లాంగ్‌ (చైనా)లను ఓడించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 2014లో ఇండోనేసియా గ్రాండ్‌ప్రి గోల్డ్, 2016లో స్విస్‌ ఓపెన్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టైటిల్స్‌ గెలిచిన ప్రణయ్‌ తాజా ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే... ఈ ఏడాది మిగిలిన ఆరు సూపర్‌ సిరీస్‌ టోర్నీలలో అతని రాకెట్‌ నుంచి మరిన్ని అద్భుత విజయాలు వచ్చే అవకాశాలున్నాయి.



శభాష్‌...సమీర్‌

ఆరేళ్ల క్రితం ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన సమీర్‌ వర్మ గత రెండేళ్లలో ఒక్కసారిగా దూసుకొచ్చాడు. గతేడాది హాంకాంగ్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన సమీర్‌... ఈ ఏడాది సయ్యద్‌ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టోర్నీ ఫైనల్లో సాయిప్రణీత్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచాడు. మరోవైపు సీనియర్లు అజయ్‌ జయరామ్, సౌరభ్‌ వర్మ, పారుపల్లి కశ్యప్‌ కూడా మళ్లీ మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతుండగా... జూనియర్‌ ఆటగాళ్లు సిరిల్‌ వర్మ, ప్రతుల్‌ జోషి, ఆదిత్య జోషి, లక్ష్య సేన్‌ కూడా ఆకట్టుకుంటున్నారు.



ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య పురుషుల సింగిల్స్‌ తాజా ర్యాంకింగ్స్‌లో చైనా తర్వాత భారత్‌ నుంచి మాత్రమే టాప్‌–35లో  ఆరుగురు (శ్రీకాంత్, జయరామ్, సాయిప్రణీత్, ప్రణయ్, సమీర్‌ వర్మ, సౌరభ్‌ వర్మ) ఆటగాళ్లున్నారు.



ఈ ఏడాది జరిగిన ఆరు సూపర్‌ సిరీస్‌ టోర్నమెంట్‌లలో పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు మూడు టైటిల్స్‌ లభించడం విశేషం. సింగపూర్‌ ఓపెన్‌లో సాయిప్రణీత్, ఇండోనేసియా, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో శ్రీకాంత్‌ విజేతలుగా నిలిచారు. ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌లో లీ చోంగ్‌ వీ (మలేసియా)... ఇండియా ఓపెన్‌లో విక్టర్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌), మలేసియా ఓపెన్‌లో లిన్‌ డాన్‌ (చైనా) టైటిల్స్‌ గెలిచారు.



ప్రపంచ నంబర్‌వన్‌ సన్‌ వాన్‌ హో (కొరియా), విశ్వవిజేత, ఆసియా చాంపియన్, రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ చెన్‌ లాంగ్‌ (చైనా) వరుసగా రెండు టోర్నీల్లో భారత ఆటగాళ్ల చేతిలోనే ఓడిపోయారు. ఇండోనేసియా ఓపెన్, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సన్‌ వాన్‌ హోపై శ్రీకాంత్‌ రెండుసార్లు గెలుపొందాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లో చెన్‌ లాంగ్‌ను శ్రీకాంత్‌ ఓడించాడు. ఇండోనేసియా ఓపెన్‌లో చెన్‌ లాంగ్‌తోపాటు మలేసియా దిగ్గజం లీ చోంగ్‌ వీపై ప్రణయ్‌ గెలిచాడు.



ఈ ఏడాది జరిగిన ఆరు సూపర్‌ సిరీస్‌ టోర్నీలలోనూ బ్యాడ్మింటన్‌ పవర్‌ సెంటర్స్‌గా పేరొందిన చైనా, కొరియా, ఇండోనేసియా, మలేసియా, జపాన్‌ దేశాల ఆటగాళ్లపై భారత ఆటగాళ్లు కనీసం ఒక్కో విజయమైనా సాధించారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top