సెమీస్‌లో శ్రీకాంత్

సెమీస్‌లో శ్రీకాంత్


సైనాకు నిరాశ  హాంకాంగ్ ఓపెన్

 

 కౌలూన్: మరో అద్భుత విజయంతో శ్రీకాంత్ ముందంజ వేయగా... అనూహ్య ఓటమితో సైనా నెహ్వాల్ నిష్ర్కమించింది. హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో భాగంగా శుక్రవారం భారత అగ్రశ్రేణి ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. పురుషుల క్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్ కుర్రాడు కిడాంబి శ్రీకాంత్ 21-14, 21-15తో ప్రపంచ 21వ ర్యాంకర్ వీ నాన్ (హాంకాంగ్)ను ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లగా... మహిళల క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ సైనా నెహ్వాల్ 15-21, 19-21తో ఆరో సీడ్ తాయ్ జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. తొలి గేమ్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయిన సైనా, రెండో గేమ్‌లో గట్టిపోటీనిచ్చింది. అయితే 19-19 స్కోరు వద్ద వరుసగా రెండు పాయింట్లు కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకుంది.



 గతంలో వీ నాన్‌తో ఆడిన ఏకైక మ్యాచ్‌లో మూడు గేముల్లో నెగ్గిన శ్రీకాంత్ ఈసారి రెండు గేముల్లో విజయాన్ని దక్కించుకున్నాడు. తొలి గేమ్‌లో స్కోరు 10-10 వద్ద ఉన్నపుడు శ్రీకాంత్ వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 14-10తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఇదే జోరును కొనసాగించి గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. రెండో గేమ్‌లోనూ దూకుడు కనబరిచిన ఈ తెలుగు తేజం 8-3తో ఆధిక్యాన్ని సంపాదించాడు.



 ఆ తర్వాత వీ నాన్ తేరుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. శనివారం జరిగే సెమీఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్, టాప్ సీడ్ చెన్ లాంగ్ (చైనా)తో శ్రీకాంత్ తలపడతాడు. లాంగ్‌తో శ్రీకాంత్ ఆడనుండటం ఇది రెండోసారి.. ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆడిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 12-21, 10-21తో ఓడిపోయాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top