హెచ్‌ఐఎల్‌ కింగ్‌ కళింగ

హెచ్‌ఐఎల్‌ కింగ్‌ కళింగ


చండీగఢ్‌: పొగొట్టుకున్న చోటే వెతుక్కోవడం అంటే ఇదేనేమో... గత సీజన్‌ తుదిమెట్టుపై చేజారిన టైటిల్‌ను ఈసారి కళింగ లాన్సర్స్‌ ఒడిసి పట్టుకుంది. హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌) ఐదో సీజన్‌లో విజేతగా నిలిచింది. ఫైనల్లో కళింగ జట్టు 4–1తో దబంగ్‌ ముంబైపై జయభేరి మోగించింది. లాన్సర్స్‌ ఆటగాళ్ల దూకుడుతో మొదలైన ఈ మ్యాచ్‌ ఏకపక్షంగా ముగిసింది. మోరిట్జ్‌ ఫ్యుయరిస్ట్‌ రెండు గోల్స్‌తో అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పో షించాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో కళింగ లాన్సర్స్‌ రెండు అర్ధభాగాలు ముగిసే సమయానికి మ్యాచ్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకుంది.



 మొదట ఇరు జట్ల ఆటగాళ్లు చెమటోడ్చడంతో తొలి క్వార్టర్‌లో ఒక్క గోల్‌ కూడా నమోదు కాలేదు. రెండో అర్ధభాగంలో కళింగ లాన్సర్‌ ఆటగాళ్లు ఒక్కసారిగా చెలరేగారు. దీంతో ఆట మొదలైన మూడో నిమిషంలోనే గ్లెన్‌ టర్నర్‌ (18వ నిమిషం) ఫీల్డు గోల్‌ చేయడంతో కళింగ జట్టు 2–0తో ఆధిక్యంలో నిలిచింది. హెచ్‌ఐఎల్‌ నిబంధనల ప్రకారం ఫీల్డు గోల్‌కు రెండు గోల్స్‌గా పరిగణిస్తారు. తర్వాత రెండో క్వార్టర్‌ కాసేపట్లో ముగుస్తుందనగా మోరిట్జ్‌ ఫ్యుయరిస్ట్‌ (30వ ని.) పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. దీంతో కళింగ 3–0తో స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్లింది.



 అయితే మూడో క్వార్టర్‌లో దబంగ్‌ ముంబై ఖాతా తెరిచింది. ఆట 33వ నిమిషంలో అఫాన్‌ యూసుఫ్‌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచడంతో కళింగ ఆధిక్యం 3–1కు తగ్గింది. చివరి క్వార్టర్‌లో మళ్లీ మోరిట్జ్‌ (59వ ని.) గోల్‌ చేయడంతో లాన్సర్‌ 4–1తో టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. విజేతగా నిలిచిన కళింగ లాన్సర్స్‌కు రూ. 2 కోట్ల 50 లక్షలు... రన్నరప్‌ ముంబై జట్టుకు రూ. కోటీ 25 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో యూపీ విజార్డ్స్‌ 5–4తో ఢిల్లీ వేవ్‌రైడర్స్‌ను ఓడించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top