కలాంకు క్రీడా ప్రపంచం నివాళి

కలాంకు క్రీడా ప్రపంచం నివాళి


శ్రద్ధాంజలి ఘటించిన ప్రముఖులు

న్యూఢిల్లీ:
మాజీ రాష్ర్టపతి ఏపీజే అబ్దుల్ కలాం పార్థివ దేహానికి భారత క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ నివాళులర్పించాడు. సోమవారం షిల్లాంగ్‌లోని ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ కుప్పకూలిన కలాం మరణించిన విషయం తెలిసిందే. మంగళవారం రాజాజీ మార్గ్‌లోని ఆయన అధికారిక నివాసంలో ఉంచిన మృతదేహాన్ని సచిన్ సందర్శించాడు. కలాంలాంటి ఉన్నతమైన వ్యక్తిని కోల్పోయి దేశం రోదిస్తోందని సచిన్ అన్నాడు.

 

కలాం పుస్తకాలు ప్రభావితం చేశాయి: పుజారా

కలాం రాసిన పుస్తకాలు దేశ యువతతో పాటు తనను కూడా ఎంతగానో ప్రభావితం చేశాయని టెస్టు బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ‘విజన్ 2020 మిషన్స్’ అనే పుస్తకమంటే ఎంతో ఇష్టమని చెప్పాడు. ‘కలాం పుస్తకాలు దాదాపు అన్నీ చదివాను. ఆయనకున్న అపార పరిజ్ఞానాన్ని దేశంతో పంచుకున్న తీరు అద్భుతం. అందరికీ ఆయన ఆదర్శప్రాయుడే’ అని పుజారా తెలిపాడు.

 

కొనసాగిన క్రీడా ప్రముఖుల నివాళి

అబ్దుల్ కలాం మృతికి క్రీడాలోకం నివాళి అర్పిస్తూనే ఉంది. దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్‌తో పాటు బల్బీర్ సింగ్ సీనియర్ తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. రాష్ర్టపతి భవన్‌లో జరిగిన అవార్డుల కార్యక్రమంలో తాను కలాంను కలుసుకున్నట్టు మిల్కా సింగ్ తెలిపారు. తనను చూడగానే ఆయన ఎంతో సంతోషించారని, దేశంలో క్రీడలు ఎందుకు వెనుకబడి ఉన్నాయని అడిగారని గుర్తుచేసుకున్నారు.  కలలను సాకారం చేసుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలంటూ ఆయన చెబుతుండేవారని 91 ఏళ్ల మాజీ హాకీ ఆటగాడు బల్బీర్ సింగ్ అన్నారు.

 

ఆయన చేతుల మీదుగా పద్మశ్రీ తీసుకున్నా..

అబ్దుల్ కలాం చేతులమీదుగా తాను పద్మశ్రీ అవార్డును అందుకోవడం జీవితంలో మరిచిపోలేని క్షణమని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ‘2003 ప్రపంచకప్ అనంతరం మేమంతా కలాంను కలిశాం. కొద్దిసేపు నేను ఆయనతో సంభాషించడం గౌరవంగా భావిస్తున్నాను. క్రికెట్ గురించి ఆయనకు విడమరిచి చెప్పాం. 2004లో ఆయన చేతుల మీదుగానే పద్మశ్రీని అందుకున్నాను. అదో చిరస్మరణీయ జ్ఞాపకం. ఎలాంటి భేషజాలు లేని అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. నా వాట్స్‌అప్‌లో కలాంతో దిగిన ఫొటోను పెట్టుకున్నాను’ అని గంగూలీ తెలిపాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top