డోపింగ్ చేయమని కోచ్ ఒత్తిడి తెచ్చాడు!
బీజింగ్: గత రెండు దశాబ్దాల క్రితం కొంతమంది చైనా టాప్ మహిళా అథ్లెట్స్‌ను డోపింగ్ కు పాల్పడమని ప్రేరేపించిన విషయం తాజాగా బయటపడింది. దేశం తరపున అథ్లెట్స్ ను ముందుండి నడిపించాల్సిన కోచ్ ఇందులో భాగస్వామ్యం అయినట్లు చైనా జర్నలిస్టు హో యూ ఆరోపించింది. ఇందులో ఒలింపిక్ చాంపియన్స్ తో సహా 10 మంది క్రీడాకారులు ఉన్నట్లు ఆమె స్పష్టం చేసింది. 1995లో చోటు చేసుకున్నఈ ఘటనకు సంబంధించి వారు తనకు లేఖ రాసిన విషయాన్ని పేర్కొంది.
ఇందులో చైనా స్టార్ అథ్లెట్, రెండు సార్లు ప్రపంచ రికార్డు సాధించిన వాంగ్ జునియాతో పాటు, మిగతా తొమ్మిది మంది రన్నర్స్ డోపింగ్ లో భాగస్వామ్యమయ్యారని ఆ జర్నలిస్టు స్పష్టం చేసింది. వారి కోచ్ మా జున్రేన్ డోపింగ్ కు ఒత్తిడి చేసి అధిక మొత్తంలో నిషేధిత డ్రగ్స్ కు తీసుకోవడానికి ప్రేరేపించినట్లు వారు లేఖ ద్వారా తనకు తెలియజేశారని పేర్కొంది. దీనిపై 1997లో జున్రేన్ రాసుకున్న ఓ పుస్తకంలో ఈ విషయాల్ని వెల్లడించినా, గత సంవత్సరం ఈ పుస్తకం పునఃప్రచురణలో ఆ అంశాలను తొలగించినట్లు హో యూ తెలిపింది. ఆ పుస్తకంలో ఆ లేఖ గురించి ఒక్క దాని కోసమే ప్రస్తావించలేదని, అథ్లెట్స్ కు సంబంధించి మిగతా లేఖలు, వారి డైరీల్లోనూ విషయాలు కూడా అందులో పొందుపరిచినట్లు ఆమె పేర్కొంది. ప్రస్తుతం 'డోపింగ్ లేఖ'ను చైనా సెంట్రల్ టెలివిజన్(సీసీటీవీ) ఆన్ లైన్ లో పోస్ట్ చేయడంతో కలకలం రేపుతోంది.