అండర్సన్... అదుర్స్

అండర్సన్... అదుర్స్


6 వికెట్లతో చెలరేగిన ఇంగ్లండ్ పేసర్

 తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 136 ఆలౌట్

 యాషెస్ మూడో టెస్టు


 

 బర్మింగ్‌హామ్: యాషెస్ మూడో టెస్టులో ఇంగ్లండ్ పేసర్ అండర్సన్ (6/47) బంతితో నిప్పులు కురిపించాడు. క్రమం తప్పకుండా వికెట్లు తీసి ఆస్ట్రేలియాను అద్భుతంగా కట్టడి చేశాడు. ఫలితంగా ఎడ్జ్‌బాస్టన్‌లో బుధవారం ప్రారంభమైన మ్యాచ్‌లో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 36.4 ఓవర్లలో 136 పరుగులకే కుప్పకూలింది. రోజర్స్ (89 బంతుల్లో 52; 9 ఫోర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ఇన్నింగ్స్‌కు పలుమార్లు వర్షం అంతరాయం కలిగించింది.

 

  ఓపెనర్  రోజర్స్ మెరుగ్గా ఆడినా.. వార్నర్ (2), స్మిత్ (7), క్లార్క్ (10) స్వల్ప వ్యవధిలో అవుట్‌కావడంతో కంగారూలు 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయారు. అయితే రోజర్స్, వోజెస్ (16) నాలుగో వికెట్‌కు 43 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. కానీ అండర్సన్ ఓ ఎండ్‌లో నిలకడగా వికెట్లు తీయడంతో ఆసీస్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. 82 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన క్లార్క్‌సేన 54 పరుగుల తేడాతో చివరి ఐదు వికెట్లు చేజార్చుకుంది. చివర్లో స్టార్క్ (11), హాజెల్‌వుడ్ (14 నాటౌట్), లియోన్ (11) పోరాడే ప్రయత్నం చేశారు. బ్రాడ్, ఫిన్ చెరో రెండు వికెట్లు తీశారు.


తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 29 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసింది. రూట్ (30 బ్యాటింగ్), బెయిర్‌స్టో (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. లిథ్ (10) విఫలమైనా... బెల్ (53) నాణ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ కుక్ (34)తో కలిసి రెండో వికెట్‌కు 57; రూట్‌తో కలిసి మూడో వికెట్‌కు 57 పరుగులు జోడించి అవుటయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ ఇంకా 3 పరుగులు వెనుకబడి ఉంది. లియోన్ 2 వికెట్లు తీశాడు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top