టైటాన్స్ జోరు కొనసాగేనా?

టైటాన్స్ జోరు కొనసాగేనా?


సెమీస్‌లో నేడు జైపూర్‌తో అమీతుమీ  ప్రొ కబడ్డీ లీగ్




హైదరాబాద్: వరుస విజయాలతో ఊపు మీదున్న తెలుగు టైటాన్స్ సొంత గడ్డపై నాకౌట్ సమరానికి సిద్ధమయింది. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగల స్టార్ ఆటగాడు రాహుల్ చౌదరి జట్టులోనే ఉన్నా టైటాన్స్ ఇప్పటిదాకా ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. దీంతో ఈసారి ఎలాగైనా విజేతగా నిలవాలనే కసితో ఉన్న ఈ జట్టు నేటి (శుక్రవారం) రెండో సెమీఫైనల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో తలపడనుంది. సెమీఫైనల్స్‌తో పాటు ఫైనల్ మ్యాచ్‌కు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. లీగ్ దశలో ఈ రెండు జట్లు రెండు సార్లు తలపడగా చెరో విజయంతో సమానంగా ఉన్నాయి. 2015 సీజన్‌లో మాత్రమే సెమీస్‌కు చేరిన టైటాన్స్ అందులో ఒక్క పాయింట్ తేడాతో బెంగళూరుపై ఓడింది. అనంతరం తాజాగా మరోసారి సెమీస్‌కు రాగా ఈసారి మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావీయకూడదనే ఆలోచనతో ఉంది. లీగ్ ఆరంభంలో టైటాన్స్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడింది. కానీ తర్వాత పుంజుకుని తొమ్మిది మ్యాచ్‌ల్లో ఓటమనేదే లేకుండా 50 పాయింట్లతో లీగ్ దశలో రెండో స్థానంలో నిలిచింది.





ఇప్పటికే రాహుల్ ప్రతీ మ్యాచ్‌లోనూ భీకర ఫామ్‌తో జట్టుకు పాయింట్ల వర్షం కురిపిస్తున్నాడు. ఓవరాల్‌గా లీగ్ చరిత్రలో రాహుల్ అత్యధికంగా 455 రైడింగ్ పాయింట్లు సాధించి చరిత్ర సృష్టించాడు. తనపై జట్టు పెట్టుకున్న ఆశలకు అనుగుణంగానే రాణించి టైటాన్స్‌ను తొలిసారి ఫైనల్‌కు చేర్చాలని భావిస్తున్నాడు. రైడింగ్‌లో సుకేశ్, అతుల్, నీలేశ్ కూడా కీలకం కానున్నారు. ఇక ఆల్‌రౌండర్ సందీప్ నర్వాల్ ప్రత్యర్థికి తన పట్టు పవర్ చూపిస్తే విజయం సులభమే. మరోవైపు మాజీ చాంపియన్ పింక్ పాంథర్స్‌ను తక్కువ అంచనా వేయలేం. టైటాన్స్‌లా కాకుండా ఈ జట్టు సమష్టి కృషితో రాణిస్తోంది. కెప్టెన్ జస్వీర్ సింగ్, అజయ్ కుమార్, షబీర్ రైడింగ్‌లో మెరుపులు మెరిపించేవారే. ఈ సీజన్‌లో కొన్ని రోజులు టాప్ పొజిషన్‌లో కొనసాగిన జైపూర్‌ను ఓడించాలంటే టైటాన్స్ పూర్తి స్థాయిలో రాణించాల్సిన అవసరం ఉంది.




పట్నాతో పుణెరి ఢీ

శుక్రవారం జరిగే తొలి సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ జట్టు పుణెరి పల్టన్‌తో తలపడుతుంది. ఇప్పటిదాకా ప్రతీ సీజన్‌లో సెమీస్ వరకు చేరిన టేబుల్ టాపర్ పట్నాను ఓడించాలంటే మంజీత్ చిల్లర్ సారథ్యంలోని పుణెరి జట్టు చెమటోడ్చాల్సిందే.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top