ఈ క్రేజ్‌కు విలువెంత?

ఈ క్రేజ్‌కు విలువెంత? - Sakshi


ఐఎస్‌ఎల్ సూపర్ సక్సెస్

 జోష్‌లో ఉన్న భారత ఫుట్‌బాల్

 నిరాటంకంగా కొనసాగేనా?


 

 ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)... క్రికెట్‌ను శ్వాసగా పీలుస్తున్న భారత్‌లో ఇప్పుడు ఓ సరికొత్త సంచలనం. ఐపీఎల్ సక్సెస్‌తో ఫుట్‌బాల్‌లోనూ ఓ లీగ్ ప్రారంభిస్తున్నారనగానే అంతటా ఆశ్చర్యం.. అసలు ఇది అయ్యే పనేనా..? ఇక్కడ ఫుట్‌బాల్‌ను ఎవరు చూస్తారు..? అనే వ్యాఖ్యలు వినిపించాయి. అయితే ఎవరూ ఊహించని రీతిలో ఐఎస్‌ఎల్ విజయఢంకా మోగించింది.

 

  భారత క్రీడాభిమానులకు మరో కోణాన్ని చూపించింది. ఈ దేశంలో ఫుట్‌బాల్‌కు ఉన్న ఆదరణ ఏమిటో లోకానికి చాటి చెప్పింది. ఎక్కడ మ్యాచ్ జరిగినా దాదాపుగా స్టేడియాలు పూర్తి స్థాయిలో నిండాయి. అంతేకాకుండా రెండు నెలలకు పైగా సాగినప్పటికీ చివరిదాకా ఏమాత్రం ఆదరణ కోల్పోకుండా సత్తా చూపించింది. అయితే ఇదే ఊపు భవిష్యత్‌లోనూ కొనసాగుతుందా? ఐపీఎల్ తరహాలోనే ఐఎస్‌ఎల్ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగుతుందా? ఈ సమాధానాలకు వేచి చూడాలి.

 

 న్యూఢిల్లీ: ఇప్పటిదాకా ఫుట్‌బాల్ అంటే కోల్‌కతా, గోవా, కొచ్చిలలో మాత్రమే ఆదరణ ఉంటుందని చాలామంది భావించారు. అయితే అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ ఈ క్రీడకు దేశ వ్యాప్తంగా ఆదరణ ఉందని ఇండియన్ సూపర్‌లీగ్ (ఐఎస్‌ఎల్) నిరూపించింది. ఓరకంగా దేశ క్రీడా సంస్కృతిని ఐఎస్‌ఎల్ మార్చిందనే చెప్పవచ్చు.

 

 ఠ అక్టోబర్ 12న ప్రారంభమైన ఈ లీగ్ డిసెంబర్ 20 వరకు కొనసాగింది. అసలు మనదేశంలో ఈ క్రీడకు ‘సోఫా స్పోర్ట్’ అని పేరు. ఎందుకంటే ఫుట్‌బాల్ అభిమానులు భారత్‌లో ఆడే మ్యాచ్‌లను స్టేడియానికి వెళ్లి చూసే బదులు ఇంట్లో టీవీల ముందు కూర్చుని యూరోపియన్ లీగ్‌ల గురించి మాట్లాడుకోవడం పరిపాటి.

 

 ఠ కానీ రెండు నెలలపాటు సాగిన ఐఎస్‌ఎల్‌ను స్టేడియాల్లో చూసిన సగటు అభిమానుల సంఖ్య 24,357. ఇది ఆసియాలో అత్యధికం. అంతేకాదు.. ఓవరాల్‌గా ప్రత్యక్ష ప్రేక్షకాదరణలో జర ్మనీకి చెందిన బుండెస్‌లిగా, ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్), లా లిగా (స్పెయిన్) తర్వాత స్థానంలో నిలిచి సత్తా చూపించింది. అసలు ప్రారంభ మ్యాచే 65 వేల మంది ప్రేక్షకుల మధ్య జరిగింది.

 

  చెన్నైయిన్, కేరళ సెమీస్ అయితే ఆన్‌లైన్‌లో 11 లక్షల మంది వీక్షించారు. బాలీవుడ్ నటులతోపాటు క్రికెటర్ల భాగస్వామ్యం కూడా ఈ లీగ్ సక్సెస్‌కు కారణమైందని చెప్పుకోవచ్చు.  జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్, హృతిక్ రోషన్‌లాంటి బాలీవుడ్ ప్రముఖ నటులు యజమానులుగా వ్యవహరించడం... సౌరవ్ గంగూలీ, ధోని, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లిలాంటి ఆటగాళ్లు భాగస్వామ్యాన్ని కలిగి ఉండడం దేశంలో ఈ లీగ్‌కు ఎనలేని ప్రాచుర్యం లభించింది.

 

 మనుగడ ఇలాగే సాగేనా..?

 అయితే ఇప్పటిదాకా అంతా బాగానే ఉంది కానీ భవిష్యత్‌లో ఐఎస్‌ఎల్ ప్రస్థానం ఎలా సాగుతుందనేది కూడా గమనించాల్సి ఉంది. ఎందుకంటే ఐపీఎల్ తరహాలోనే భారత్‌లో గతేడాది ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) ప్రారంభమైంది. అయితే ఈ ఏడాది ఆ లీగ్ జాడలేదు. వచ్చే ఏడాది జరిగేదీ? లేనిదీ? ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఇక హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) తొలి సీజన్‌కు వచ్చే ఏడాది జరుగబోయే మూడో సీజన్‌కు జట్లలో మార్పు వచ్చింది. కొన్ని ఫ్రాంచైజీలు లీగ్ నుంచి తప్పుకోగా మరికొన్ని కొత్తగా జత చేరాయి.

 

  ప్రొకబడ్డీ ఈ ఏడాదే ప్రారంభమై కాస్త ఆదరణ దక్కించుకుంది. చాంపియన్స్ టెన్నిస్ లీగ్, అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ కూడా ప్రస్తుతానికి ఫర్వాలేదనిపించాయి. అయితే ఐఎస్‌ఎల్ తొలి సీజన్ సూపర్ సక్సెస్ నిర్వాహకుల్లో అంతులేని ఆత్మవిశ్వాసాన్ని కలిగించిందనడంలో సందేహం లేదు.

 

  ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు స్థానం 170. ఇప్పుడు ఈ ఆదరణను సరిగ్గా వినియోగించుకుని మరింతమందిని ఈ క్రీడ వైపు ఆకర్షితులను చేస్తే కచ్చితంగా మన దేశానికి కూడా ఫుట్‌బాల్‌లో సముచిత స్థానం దక్కుతుంది. అలాగే ఈ విజయంతో ప్రపంచ క్రీడా మీడియా దృష్టి కూడా ఒక్కసారిగా భారత్‌పై పడింది. ఇక్కడ జరుగుతున్న ఫుట్‌బాల్ కార్యకలాపాలపై ఫోకస్ పెట్టనారంభించారు. ఇక ఐఎస్‌ఎల్ విజయంతో చిన్నారులు ఈ ఆట వైపునకు మొగ్గు చూపితే అది భారత క్రీడలకు బంగారు బాట వేసినట్టే అనుకోవాలి.

 

 ఢిల్లీ జట్టుకు ఫెయిర్ ప్లే అవార్డు

 న్యూఢిల్లీ: సెమీస్‌లో చోటు దక్కించుకోలేకపోయిన ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సీ జట్టు తమ ఆటతీరుకు మాత్రం ఐఎస్‌ఎల్ ఫెయిర్ ప్లే అవార్డు దక్కించుకుంది. ఢిల్లీ 77.6 పాయిం ట్లతో అందరికన్నా ముందు నిలిచింది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top