సంచలనాల పసికూనలకు స(ఫారీ)వాల్


సంచలనాలు.. రికార్డులు..  చెత్తరికార్డులు.. బ్యాటింగ్ మెరుపులు.. బౌలింగ్,  ఫీల్డింగ్ విన్యాసాలు.. ఏకపక్ష, ఉత్కంఠ పోరాటాలు.. అనూహ్య ఫలితాలతో ప్రపంచ కప్ ఆసక్తికరంగా సాగుతోంది. లీగ్ దశలో సగభాగం ముగిసింది. మరో అంకానికి మంగళవారం తెరలేవనుంది. నేడు జరిగే మ్యాచ్లో సంచలనాల పసికూన ఐర్లాండ్, పటిష్టమైన దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. సమవుజ్జీల పోరు కాకపోయినా ఈ మ్యాచ్ ఆసక్తిరేకెత్తిస్తోంది. కారణమేంటంటే ప్రపంచ కప్ ఆడుతున్న పసికూనల్లో అత్యంత ప్రభావం చూపుతున్న జట్టు ఒక్క ఐర్లాండే. ప్రపంచ కప్లో ఇప్పటి వరకూ ఓటమెరుగని భారత్, న్యూజిలాండ్ జట్ల సరసన ఐర్లాండ్ ఉండటం విశేషం.  



మిగతా పసికూన జట్లు కిందామీదా పడుతూ నెట్టుకొస్తుంటే ఐర్లాండ్ సంచలన విజయంతో శుభారంభం చేసింది. ఈ మెగా ఈవెంట్లో వరుసగా రెండు విజయాలు సాధించి హ్యాట్రిక్ కొట్టాలని ఆరాటపడుతోంది. ఐర్లాండ్ తొలి మ్యాచ్లో ఏకంగా మాజీ చాంపియన్ వెస్టిండీస్కు షాకిచ్చింది. కరీబియన్లు 304 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశిస్తే.. ఐర్లాండ్ అద్భత పోరాటపటిమతో గెలుపొంది ఔరా అనిపించింది. ఈ మ్యాచ్లో ఐర్లాండ్ బ్యాట్స్మన్ స్టిర్లింగ్ (92), జాయ్సె (84), నియల్ ఒబ్రెయెన్ (79 నాటౌట్) బ్యాట్కు పనిజెప్పారు. ఇక యూఏఈతో మరుసటి మ్యాచ్లో 279 పరుగుల లక్ష్యాన్ని ఐర్లాండ్ సాధించింది. ఈ మ్యాచ్లో విల్సన్ (80), కెవిన్ (50) రాణించారు. ఈ రెండు మ్యాచ్ల్లోనూ ఐర్లాండ్ లక్ష్యఛేదనలో నెగ్గింది. ఐర్లాండ్ బౌలింగ్లో కంటే బ్యాటింగ్లో పటిష్టంగా కనిపిస్తోంది. తనదైన రోజున ఏ జట్టునైనా ఓడించగల సత్తా ఐర్లాండ్ సొంతం. తాజాగా విండీస్తో పాటు ఇంగ్లండ్, పాకిస్థాన్లను ఓడించిన చరిత్ర ఉంది.



ప్రపంచ కప్లో ఐర్లాండ్కు అతిపెద్ద సవాల్ ఎదురుకానుంది. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న సఫారీలను ఎదుర్కొంటోంది. సఫారీలు మూడు మ్యాచ్లు ఆడగా, రెండింటిలో గెలిచారు. మరో మ్యాచ్లో భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయారు. అయితే సఫారీలు చివరిగా వెస్టిండీస్ మ్యాచ్లో దుమ్మురేపారు. కరీబియన్లపై భారీ స్కోరు చేసిన సఫారీలు.. అనంతరం వారిని తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. ఈ నేపథ్యంలో సఫారీలను ఓడించడం ఐర్లాండ్కు పెను సవాలే. అయితే సంచనాలకు మారు పేరైన ఐర్లండ్ మరో అద్భుతం చేసినా వింతేమీకాదు!

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top