వర్షార్పణం!

వర్షార్పణం!


- ఈడెన్‌ను ముంచెత్తిన వాన   

- కోల్‌కతా, రాజస్తాన్ మ్యాచ్ రద్దు


కోల్‌కతా: ఐపీఎల్-8లో మొదటిసారి వాన ఒక మ్యాచ్‌ను పూర్తిగా తుడిచి పెట్టేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో జరగాల్సిన లీగ్ మ్యాచ్  భారీ వర్షం కారణంగా రద్దయింది. మ్యాచ్ నిర్ణీత సమయానికి ముందు నుంచే నగరంలో పడుతున్న వర్షం చాలా సేపు ఇబ్బంది పెట్టింది. చివర్లో కాస్త ఆగినా... మైదానం ఆటకు అనుకూలంగా లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఫలితంగా కోల్‌కతా, రాజస్తాన్ జట్లకు చెరో పాయింట్ దక్కింది.

 

కుండపోత...

ఈ మ్యాచ్ కోసం టాస్ కూడా వేసే అవకాశం రాలేదు. నిర్ణీత సమయం సాయంత్రం 4 గంటల వరకు తగ్గని వర్షం గంట తర్వాత తెరిపినిచ్చింది. అయితే కవర్లు తొలగించిన కొద్ది క్షణాలకే మళ్లీ వాన ముంచెత్తింది. కాస్త విరామం ఇస్తూ అంపైర్లు మూడేసి సార్లు గ్రౌండ్‌ను పరిశీలించారు. సూపర్ సాపర్ ఉపయోగించినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. మరోసారి పరిశీలించి రాత్రి 7.30 గంటలకు కనీసం 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించాలని కూడా భావించారు.



అయితే దానికీ పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో 7.15కే మ్యాచ్‌ను నిర్వహించలేమని అధికారికంగా ప్రకటించారు. నైట్‌రైడర్స్‌ను గత మ్యాచ్‌లోనూ వర్షం వెంటాడింది. విశాఖపట్నంలో 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో ఆ జట్టు సన్‌రైజర్స్ చేతిలో ఓడిన సంగతి తెలిసిందే.

 

అంకిత్‌కు నివాళి...

ఇటీవల మైదానంలో గాయపడి మృతి చెందిన బెంగాల్ యువ క్రికెటర్ అంకిత్ కేసరికి కోల్‌కతా జట్టు నివాళి అర్పించింది. బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) విజ్ఞప్తికి స్పందిస్తూ... అంకిత్ పేరుని తమ జట్టులో 16వ సభ్యుడిగా చేర్చింది. నైట్‌రైడర్స్ తరఫున రూ. 10 లక్షలు అతని కుటుంబానికి అందించింది. మ్యాచ్ సందర్భంగా ‘అంకిత్ ఫరెవర్’ అంటూ మైదానంలో బ్యానర్లను ‘క్యాబ్’ ప్రదర్శించడం విశేషం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top