లేటు వయసులో రెచ్చిపోయారు


కోల్కతా: టీ-20 ఫార్మాట్లో సాధారణంగా కొత్త ముఖాలు,  యువ క్రికెటర్లు సత్తాచాటుతుంటారు. సీనియర్లు, అందులోనూ 35 ప్లస్ వయసులో ఉన్న ఆటగాళ్లు ఈ ఫార్మాట్ పెద్దగా రాణించలేరు. తాజాగా జరిగిన ఐపీఎల్-8లో వెటరన్లు దుమ్మురేపారు. వయసు అన్నది ఓ సంఖ్య మాత్రమే కానీ ఆటకు ప్రతికూలం కాదంటూ లేటు వయసులో అదరగొట్టారు.  ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని నిరూపించారు.



 చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించిన 36 ఏళ్ల నెహ్రా 22 వికెట్లు పడగొట్టాడు. మూడు సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక 35 హర్భజన్ కూడా ఐపీఎల్ ప్రదర్శన ద్వారా మళ్లీ వెలుగులోకి వచ్చాడు. ముంబై తరపున బరిలో దిగిన బంతితో పాటు కొన్నిసార్లు బ్యాట్తో రెచ్చిపోయాడు.  ఈ సీజన్లో 18 వికెట్లు పడగొట్టిన భజ్జీ.. రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ టీమిండియాలో చోటు సంపాదించాడు. కోల్కతా బౌలర్ బ్రాడ్ హాగ్ లేటు వయసులో విజృంభించాడు. 44 ఏళ్ల ఈ ఆస్ట్రేలియా బౌలర్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వయసు క్రికెటర్. ఆడిన ఆరు మ్యాచ్ల్లో 9 వికెట్లు తీశాడు. చెన్నైతో మ్యాచ్లో 4 వికెట్లు పడగొట్టాడు. చెన్నై ఆల్ రౌండర్ డ్వెన్ బ్రావో 26 వికెట్లతో పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఈ వెస్టిండీస్ ఆటగాడి వయసు 32 ఏళ్లు. ఢిల్లీ ప్లే ఆఫ్కు అర్హత సాధించకపోయినా ఆ జట్టు స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ అద్భుతంగా రాణించాడు. దక్షిణాఫ్రికాకు చెందిన 36 ఏళ్ల బౌలర్ 15 వికెట్లు తీశాడు.



ఈ సీజన్లో 4 సెంచరీలు నమోదు కాగా, ఈ నాలుగూ 30  ప్లస్ వయసు ఆటగాళ్లే బాదడం విశేషం. బెంగళూరు క్రికెటర్లు డివిల్లీర్స్ (31), క్రిస్ గేల్ (36), రాజస్థాన్ కెప్టెన్ షేన్ వాట్సన్ (34), చెన్నై ఓపెనర్ మెకల్లమ్ (34) సెంచరీలతో కదంతొక్కారు. ఐపీఎల్-8లో అత్యధిక సిక్సర్లు (38) సంధించింది 36 ఏళ్ల గేల్ కావడం మరో విశేషం. డివిల్లీర్స్ 513, గేల్ 491, మెకల్లమ్ 436 పరుగులు చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top