బాక్సింగ్ ఇండియాను గుర్తించడం లేదు


తేల్చి చెప్పిన ఐఓఏ

 జాతీయ క్రీడా సమాఖ్యలకు నిధులు

 కామన్వెల్త్, ఆసియా క్రీడల విజేతలకు రివార్డులు

 ఏజీఎంలో నిర్ణయాలు


 

 చెన్నై: నూతనంగా ఏర్పడిన బాక్సింగ్ ఇండియా (బీఐ)కు గుర్తింపునిచ్చేది లేదని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) స్పష్టం చేసింది. శుక్రవారం జరిగిన తమ సాధారణ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో సభ్యులు ఈ మేరకు తీర్మానించారు. బీఐకి ఇంతకుముందే తమ మాతృక బాడీ అయిన అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ-ఐబా) నుంచి గుర్తింపు లభించింది. మరోవైపు ‘ఐబా’ నిషేధానికి గురైన భారత అమెచ్యూర్ బాక్సింగ్ సమాఖ్య (ఐఏబీఎఫ్)ను ఇప్పటికీ తాము గుర్తిస్తున్నట్టు ఐఓఏ అధ్యక్షుడు ఎన్.రామచంద్రన్ తెలిపారు.



 దీంతో పూర్తిగా అయోమయ పరిస్థితి నెలకొన్నట్టయ్యింది. ‘బాక్సింగ్ వ్యవహారాన్ని మా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించాం. దీంతో బీఐకి గుర్తింపునివ్వరాదని ఏకగ్రీవంగా తీర్మానించాం. బీఐకి జరిగిన ఎన్నికల కోసం అటు ప్రభుత్వం కానీ, మా తరఫున కానీ పరిశీలకులు హాజరు కాలేదు.

 

 మాకిప్పటికే ఐఏబీఎఫ్ రూపంలో గుర్తింపు పొందిన బాక్సింగ్ సంఘం ఉంది. ఐఓఏ ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరగాలని ఐబా అధ్యక్షుడితో గతంలో మాట్లాడాం. కానీ మా సూచనలను వారు పట్టించుకోకుండా ఏకపక్షంగా ఎన్నికలకు వెళ్లారు. భారత్‌లో ఓ సమాఖ్యకు ఎన్నికలు జరిగితే వాటిలో మా భాగస్వామ్యం లేకపోతే ఎలా?’ అని రామచంద్రన్ ప్రశ్నించారు.

 

 క్రీడా సమాఖ్యలకు ఆర్థిక సహాయం

 దేశంలోని ఆయా క్రీడా సమాఖ్య (ఎన్‌ఎస్‌ఎఫ్)లకు ఆర్థికపరంగా వెన్నుదన్నుగా నిలిచేందుకు ఐఓఏ ముందుకు రానుంది. ఈ మేరకు కార్పొరేట్ స్పాన్సర్‌షిప్‌లను ఆకర్షించేందుకు ప్రయత్నించనుంది. అలాగే ఎన్‌ఎస్‌ఎఫ్, రాష్ట్రాల ఒలింపిక్ సంఘాలకు ప్రతీ ఏడాది రూ.3 లక్షల గ్రాంట్‌ను ఇవ్వనుంది. ఈ ఏడాది జరిగిన కామన్వెల్త్, ఆసియా గేమ్స్‌లో పతకాలు సాధించిన ఆటగాళ్లకు నగదు బహుమతులను అందించ నుంది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top