క్లీన్‌స్వీప్‌పై గురి

క్లీన్‌స్వీప్‌పై గురి


వెస్టిండీస్‌తో భారత్‌ వన్డే సిరీస్‌

∙ నేడు తొలి మ్యాచ్‌




ఓ వైపు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి,  మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లే వివాదం ఇంకా పూర్తిగా సమసిపోక ముందే  భారత క్రికెట్‌ జట్టు మరో సిరీస్‌కు సన్నద్ధమైంది. వెస్టిండీస్‌తో జరిగే ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు భారత్‌ తొలి వన్డే ఆడనుంది. అయితే  మైదానం బయట ఎలాంటి గందరగోళ పరిస్థితి ఉన్నా.. మైదానంలో బరిలోకి దిగాక తమ సత్తా ఏమిటో చాటుకుని చాంపియన్స్‌ ట్రోఫీ పరాభవాన్ని అభిమానుల మనసు నుంచి తుడిచివేయాలని టీమిండియా భావిస్తోంది.



పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: సరిగ్గా ఏడాది క్రితం భాతర జట్టు నూతన కోచ్‌గా అనిల్‌ కుంబ్లే తన బాధ్యతలను వెస్టిండీస్‌ పర్యటన నుంచే ఆరంభించారు. అయితే కెప్టెన్‌ కోహ్లితో విభేదాల కారణంగా ఇప్పుడు అదే విండీస్‌ పర్యటన ముందు రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈనేపథ్యంలో అత్యంత బలహీనంగా కనిపిస్తున్న విండీస్‌ను కెప్టెన్‌ కోహ్లి నాయకత్వంలో భారత జట్టు చిత్తుగా ఓడించాల్సిన అవసరం ఉంది. అలా అయితేనే తన కెప్టెన్సీపై.. తన వ్యక్తిత్వంపై వస్తున్న కామెంట్స్‌ను పటాపంచలు చేసినట్టు అవుతుంది. అన్ని విభాగాల్లోనూ సూపర్‌ ఫామ్‌లో ఉన్న భారత్‌కు ఇది పెద్ద కష్టం కాకపోవచ్చు. మరోవైపు ఇటీవల అఫ్ఘానిస్తాన్‌ చేతిలో కూడా ఓడిన  విండీస్‌ ఏమాత్రం పోటీనిస్తుందో చూడాలి.



అందరూ ఫామ్‌లోనే: భారత జట్టు జోరు ఏంటో తెలుసుకోవాలంటే ఇటీవలే ముగిసిన చాంపియన్స్‌ ట్రోఫీలో ఆటగాళ్ల ఫామ్‌ను చూస్తే అర్థమవుతుంది. ఒక్క ఫైనల్‌ మినహా ప్రతీ మ్యాచ్‌లోనూ సమష్టి ప్రదర్శనతో జట్టు అదరగొట్టింది. ఈ సిరీస్‌ తమ రిజర్వ్‌ బెంచ్‌ బలమెంతో కూడా తెలుసుకునేందుకు అవకాశంగా ఉపయోగించుకోవచ్చు. రోహిత్‌ శర్మ స్థానంలో రహానే ఓపెనింగ్‌ చేస్తాడని కోహ్లి ఇప్పటికే ప్రకటించాడు. అశ్విన్, జడేజాలలో ఒకరికే చాన్స్‌ ఉంటుంది.



అనుభవలేమితో విండీస్‌

విండీస్‌ జట్టులోని మొత్తం 13 మంది కలిసి ఆడిన వన్డేల సంఖ్య 213. ఒక్క యువరాజ్‌ ఆడిన వన్డేల సంఖ్యనే 301గా ఉంది. ఓవరాల్‌గా భారత ఆటగాళ్లు 776 వన్డేలు ఆడారు. ఇక్కడే తెలిసిపోతోంది విండీస్‌ ఆటగాళ్ల అనుభవం ఏపాటిదో... కెప్టెన్‌ హోల్డర్‌ 58 వన్డేలతో టాప్‌లో ఉన్నాడు. ఈనేపథ్యంలో ఏవిధంగా చూసుకున్నా భారత్‌ కన్నా అల్లంత దూరంలో ఉన్న విండీస్‌ ఏమేర ప్రభావం చూపిస్తుందనేది ఆసక్తికరం. ఇక 2019 ప్రపంచకప్‌కు అర్హత సాధించాలంటే కచ్చితంగా జట్టు మంచి ప్రదర్శన కనబరచాల్సిన ఆవశ్యకత ఉంది.

పిచ్‌: క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌ పిచ్‌పై ఈ ఏడాది ఆరంభంలో విండీస్, పాక్‌ మధ్య మూడు టి20లు జరిగాయి. ఇక్కడ అత్యధిక స్కోరు 138. స్లో బౌలింగ్‌కు అనుకూలించే అవ కాశం ఉండటంతో బ్యాట్స్‌మెన్‌కు కాస్త ఇబ్బందే.. వర్షం కురిసే అవకాశాలు లేవు.



జట్లు: (అంచనా):

భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), ధావన్, రహానే, యువరాజ్, ధోని, జాదవ్, పాండ్య, జడేజా, అశ్విన్‌/కుల్దీప్, భువనేశ్వర్, ఉమేశ్‌.

విండీస్‌: హోల్డర్‌ (కెప్టెన్‌), లూయిస్, పావెల్, హోప్, కార్టర్, మొహమ్మద్, చేజ్, రోవ్‌మన్‌ పావెల్, నర్స్, జోసెఫ్, కమిన్స్‌.



టెన్‌–3లో సాయంత్రం 6.30 నుంచి ప్రత్యక్ష ప్రసారం

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top