హాకీ కోచ్ వాల్ష్ రాజీనామా

హాకీ కోచ్ వాల్ష్ రాజీనామా


న్యూఢిల్లీ: భారత హాకీ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జట్టు చీఫ్ కోచ్ టెర్రీ వాల్ష్ తన పదవికి రాజీనామా చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)తో నెలకొన్న చెల్లింపుల వివాదమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మొత్తానికి మూడు వారాల కిందట ఆసియా గేమ్స్‌లో జట్టుకు స్వర్ణం అందించిన ఆయన నాటకీయ పరిణామాల మధ్య పదవి నుంచి తప్పుకున్నారు.



ఒప్పందం ప్రకారం 2016 రియో ఒలింపిక్స్ వరకు వాల్ష్ ఈ పదవిలో కొనసాగొచ్చు. అయితే దేశ క్రీడలకు సంబంధించి అత్యున్నత స్థాయి అధికారుల నిర్ణయాధికార శైలి తనకు ఇబ్బందిగా ఉందని రాజీనామా సందర్భంగా 60 ఏళ్ల వాల్ష్ వెల్లడించారు. ‘చీఫ్ కోచ్ పదవికి రాజీనామా చేశా. క్రీడల్లో నిర్ణయాలు తీసుకునే అధికారుల వ్యవహార శైలి నాకు సరిపడటం లేదు. దీర్ఘకాలంలో భారత హాకీకి, ఆటగాళ్లకు ఇది మేలు చేస్తుందని నేను భావించడం లేదు’ అని కోచ్ పేర్కొన్నారు. మరోవైపు వాల్ష్‌తో పాటు మరికొంత మంది సహాయక సిబ్బందికి చెల్లిస్తున్న జీతభత్యాలలో ప్రభుత్వం టాక్స్‌ను కట్ చేయడంతో ఈ వివాదం మొదలైందని హాకీ వర్గాల సమాచారం.



 రాజీనామా ఆమోదం

 వాల్ష్ రాజీనామాను ఆమోదించామని సాయ్ డెరైక్టర్ జనరల్ జిజీ థామ్సన్ వెల్లడించారు. కోచ్ రాజీనామాకు టీడీఎస్ వివాదం కారణం కాదని, హాకీ ఇండియా (హెచ్‌ఐ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా నిర్వాకం వల్లే ఇదంతా జరిగిందని ఆరోపించారు. ‘వాల్ష్ అద్భుతమైన కోచ్. ఆయన ప్రదర్శనపై మేం సంతృప్తిగా ఉన్నాం. రాజీనామాకు కారణంగా వాల్ష్ అధికారులపై ఆరోపణలు చేశారు. కానీ ఇందులో హెచ్‌ఐ పాత్ర అధికంగా ఉంది. కోచ్‌కు మాకు సంబంధాలు పెద్దగా ఉండవు. కేవలం మేం నెలకు 16 వేల డాలర్ల జీతం మాత్రమే ఇస్తాం. మిగతా విషయాలన్నీ హెచ్‌ఐ చూసుకుంటుంది కాబట్టి వాళ్లే దీనికి కారణం’ అని థామ్సన్ వ్యాఖ్యానించారు.



అయితే వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించి వాల్ష్‌ను కొనసాగించేందుకు ప్రయత్నిస్తామని సాయ్ డీజీ తెలిపారు. మరోవైపు వాల్ష్ రాజీనామా అంశంపై 24 గంటల్లో తనకు నివేదిక ఇవ్వాలని క్రీడా శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ అధికారులను ఆదేశించారు.



 రాజీనామా తర్వాత కోచ్ పదవిలో కొనసాగే ఆసక్తి లేదని చెప్పిన వాల్ష్ ఆ తర్వాత కాస్త వెనక్కి తగ్గారు. తన నియమ నిబంధనలకు లోబడి కొత్త ఒప్పందం కుదుర్చుకుంటే పదవిలో కొనసాగే విషయాన్ని పునః పరిశీలిస్తానని సంకేతాలిచ్చారు. సాయ్‌తో నెలకొన్న సమస్క పరిష్కారమై వాల్ష్ కోచ్ పదవిలో కొనసాగుతాడని హెచ్‌ఐ హై పెర్ఫార్మెన్స్ డెరైక్టర్ రొలెంట్ ఆల్టమస్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top