'ప్రాక్టీస్' లో బౌలర్లు భేష్

'ప్రాక్టీస్' లో బౌలర్లు భేష్


అడిలైడ్: ఆస్ట్రేలియా పర్యటనను భారత జట్టు ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. తొలి ప్రాక్టీస్ మ్యాచ్ మొదటి రోజు మన ఆటగాళ్లు చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. టీమిండియా బౌలర్లు రాణించడంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 71.5 ఓవర్లలో 219 పరుగులకే ఆలౌటైంది.


వరుణ్ ఆరోన్ 3 వికెట్లు పడగొట్టగా... కరణ్‌శర్మ, భువనేశ్వర్, షమీ తలా 2 వికెట్లు, అశ్విన్ ఒక వికెట్ తీశారు. అనంతరం భారత్ ఆట ముగిసే సమయానికి 16 ఓవర్లలో వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. ధావన్ (10) పెవిలియన్ చేరగా...విజయ్ (32 బ్యాటింగ్), పుజారా (13 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు.



అందరికీ వికెట్

టాస్ గెలిచిన క్రికెట్ ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. భువనేశ్వర్ తనదైన శైలిలో తొలి ఓవర్లోనే షార్ట్ (0)ను అవుట్ చేసి శుభారంభం అందించాడు. అనంతరం కార్టర్స్ (151 బంతుల్లో 58; 6 ఫోర్లు), టర్నర్ (29) రెండో వికెట్‌కు 51 పరుగులు జత చేసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఈ దశలో ఆరోన్ మూడు బంతుల వ్యవధిలో రెండు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని దెబ్బ తీశాడు.



అయితే కెల్విన్ స్మిత్ (40)తో కలిసి కార్టర్స్ మరోసారి జట్టును ఆదుకున్నాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 74 పరుగులు జోడించారు. లోయర్ ఆర్డర్‌లో హ్యరీ నీల్సన్ (43 నాటౌట్) రాణించడంతో సీఏ స్కోరు 200 పరుగులు దాటింది. భారత బౌలర్లందరూ కనీసం ఒక వికెట్ పడగొట్టగా...వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా 5 క్యాచ్‌లు పట్టి, ఒక స్టంపింగ్ చేయడం విశేషం. అనంతరం భారత ఇన్నింగ్స్‌లో ధావన్ త్వరగానే అవుటైనా... విజయ్, పుజారా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top