చలో అమెరికా

చలో అమెరికా - Sakshi


యూఎస్‌లో తొలిసారి భారత క్రికెట్ జట్టు

శని, ఆదివారాల్లో విండీస్‌తో టి20 మ్యాచ్‌లు

అగ్రరాజ్యం మార్కెట్‌పై ఐసీసీ దృష్టి




ఎవరు ఆడితే క్రికెట్ అభిమానులు విరగబడి మ్యాచ్‌లు చూస్తారో... ఎవరి సిక్సర్ల కోసం ఎంత దూరమైనా వచ్చేస్తారో... ఎవరి మెరుపు బ్యాటింగ్ కోసం ఎంత టికెట్ అయినా ఖర్చు చేస్తారో... ఆ ఆటగాళ్లు ఇప్పుడు అమెరికాలో ఆటకు సిద్ధమైపోయారు. యూఎస్‌ఏలో ఉన్న భారతీయులు, ఆసియన్లను ఆకర్షించేందుకు ఐసీసీ వేసిన పెద్ద ఎత్తుగడ ఇది. ఆడితే బేస్ బాల్ లేదంటే బాస్కెట్‌బాల్... అప్పుడప్పుడు ఫుట్‌బాల్, వ్యక్తిగత క్రీడల్లో టెన్నిస్... అగ్రరాజ్యం అమెరికాకు చెందిన అభిమానులు ఆసక్తి చూపించే ఆటలు ఇవే. కామన్వెల్త్ క్రీడ క్రికెట్ ఇప్పుడిప్పుడే అక్కడ నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో భారత జట్టు అడుగు పెట్టడం అమెరికాలో ఆట స్థాయిని పెంచుతుందా... అంతా ఆశిస్తున్నట్లుగా అక్కడ క్రికెట్‌కు కూడా తగిన ఆదరణ లభిస్తుందా!


 


సాక్షి క్రీడా విభాగం : అమెరికాలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో 2010లో న్యూజిలాండ్, శ్రీలంక మధ్య, ఆ తర్వాత 2012లో న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండేసి టి20 మ్యాచ్‌ల సిరీస్‌లు జరిగాయి. ఇటీవల కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆరు మ్యాచ్‌లు కూడా నిర్వహించారు. వీటికి ప్రేక్షకులు అంతంత మాత్రమే ఆసక్తి కనబరిచారు. అమెరికా అభిమానులను ఆకట్టుకోవడంలో మాత్రం అవి పెద్దగా విజయవంతం కాలేదు. అయితే గత ఏడాది నవంబర్‌లో సచిన్-వార్న్ కలిసి నిర్వహించిన ఆల్ స్టార్స్ క్రికెట్ మాత్రం ఒక్కసారిగా యూఎస్‌లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ను చూపించింది. న్యూయార్క్, హోస్టన్, లాస్ ఏంజెల్స్‌లో జరిగిన మూడు టి20 మ్యాచ్‌లకు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. సచిన్ పేరు ఈ ఆదరణకు కారణమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారత మాజీలు ఆడితేనే ఇలా ఉంటే ఇక ప్రస్తుత భారత జట్టు బరిలోకి దిగితే ఎలా ఉంటుందనే ఆలోచనే అమెరికాలో ఈ సిరీస్‌కు కారణమైంది.


 


సీన్ మారుతోంది

లెక్క ప్రకారం చెప్పుకోవడానికి వందకు పైగా దేశాల్లో క్రికెట్ ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నా... ఎక్కువ మంది అమెరికన్ల దృష్టిలో మాత్రం క్రికెట్ ‘మిస్టీరియస్ ఇంగ్లీష్ స్పోర్ట్’ మాత్రమే. అయితే ఆల్‌స్టార్స్ క్రికెట్‌కు సీఎన్‌ఎన్, సీఎన్‌బీసీ చానళ్లు పెద్ద ఎత్తున కవరేజీ ఇవ్వడం మారుతున్న ప్రాధాన్యాలను సూచిస్తోంది. బేస్‌బాల్ నేపథ్యంలో సాగిన ‘మిలియన్ డాలర్ ఆర్మ్’ అనే హాలీవుడ్ చిత్రంలో భారత క్రికెట్ గురించి కూడా చాలా చూపించారు. ఇటీవల బోస్టన్‌లో జరిగిన ప్రతిష్టాత్మక స్లోన్ క్రీడా సదస్సులో తొలిసారి క్రికెట్‌ను కూడా చేర్చడం విశేషం. ఇప్పటి వరకు ఇతర క్రీడలకే పరిమితమైన స్పోర్ట్స్ టెక్నాలజీ కంపెనీలు క్రికెట్‌లోనూ పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. 2013లోనే ఎన్‌బీఏ కమిషనర్ డేవిడ్ స్టెర్న్ ఐపీఎల్ వ్యాపారాన్ని అధ్యయనం చేసేందుకు భారత్‌కు రాగా... ఎన్‌బీఏ, ఎన్‌హెచ్‌ఎల్, ఎంఎల్‌ఎస్‌లాంటి టాప్ లీగ్‌లలో భాగస్వామ్యం ఉన్న ప్రముఖ స్పోర్ట్స్ వ్యాపారవేత్త స్టాన్ క్రోన్‌కే క్రికెట్‌లోనూ అడుగు పెట్టబోతున్నాడనేది తాజా వార్త.  అమెరికాలో ఉన్న ఇండియన్స్‌నే కాకుండా అసలు అమెరికన్లను క్రికెట్ వైపు ఆకర్షితులు చేయడమే తమ లక్ష్యమని ఐసీసీ సీఈ డేవ్ రిచర్డ్సన్ చెప్పారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని దీర్ఘకాలిక వ్యవధి లక్ష్యాలతోనే ఈ రెండు టి20లకు ఓకే చెప్పినట్లు ఆయన వెల్లడించారు.


 


అభిమానులు ఆశగా...

అమెరికాలో భారత జట్టు ఆడే టి20 మ్యాచ్‌ల కోసం అక్కడి ఫ్యాన్స్ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. దేశంలోని ప్రతీ పెద్ద నగరంనుంచి భారత అభిమానులు ఈ మ్యాచ్‌లు చూసేందుకు ఫ్లోరిడాకు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా భారత జట్టు వెస్టిండీస్‌లో ఆడుతుంటేనే అక్కడికి వచ్చి మద్దతు ఇచ్చే అభిమానుల్లో ఎక్కువ మంది అమెరికన్లే ఉంటారు. యూఎస్‌లో పెద్ద సంఖ్యలో స్థిరపడిన భారతీయులు, ఇతర ఆసియా దేశాలకు చెందిన ఫ్యాన్స్ వల్ల ఈ రెండు టి20 మ్యాచ్‌లు సూపర్ హిట్ కావడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. భారత్‌లో క్రికెట్‌కు ఉన్న విలువ, ఇక్కడి మార్కెట్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రపంచానికి పెద్దన్నలాంటి అగ్ర రాజ్యంలో కూడా క్రికెట్‌ను సరిగ్గా మార్కెటింగ్ చేయగలిగితే ఐసీసీకి తిరుగుండదు. ఒక్కసారి అక్కడ నిలదొక్కుకోగలిగితే క్రికెట్ మరింతగా దూసుకు పోవడం ఖాయం. ‘అమెరికాలో ఉన్న క్రికెట్ ఫ్యాన్‌కు ఇంతకంటే మంచి మ్యాచ్‌ను చూసే అవకాశం రాదు’ అని మార్క్ జాన్సన్ అనే ఒక అభిమాని చెప్పగా... ‘క్రికెట్‌లో రాక్‌స్టార్‌లాంటి దేశం ఆడుతుంటే చూడటం అదృష్టం’ అని ఫ్లోరిడాలో స్థిరపడిన రిజ్వాన్ అనే మరో వ్యక్తి చెబుతున్నాడు. ఈ మ్యాచ్‌లకు కనీస టికెట్ ధర 75 డాలర్లు ఉండగా, అత్యధికంగా 150 డాలర్లు ఖరారు చేశారు.


 


అన్ని మ్యాచ్‌లూ అక్కడే

లాడర్‌హిల్ నగరం (ఫ్లోరిడా రాష్ట్రం)లోని సెంట్రల్ బ్రోవర్డ్ రీజినల్ పార్క్ స్టేడియం భారత్, విండీస్ టి20 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తోంది. గతంలో నాలుగు అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లూ ఇక్కడే జరిగాయి. అమెరికా మొత్తంలో ఐసీసీ అధికారిక గుర్తింపు ఉన్న క్రీడా మైదానం ఇదొక్కటే. 2007లో నిర్మించిన ఈ స్టేడియంలో అప్పుడప్పుడు కొన్ని ఎగ్జిబిషన్, బెనిఫిట్ క్రికెట్ మ్యాచ్‌లు జరిగాయి. అయితే క్రికెట్ ద్వారా చెప్పుకోదగ్గ ఆదాయం లేదని, నిర్వహణ భారంగా మారిందని చెబుతూ మూడేళ్ల క్రితం సిటీ మేయర్ ఐసీసీకి లేఖ రాసి మరీ దీనిని మల్టీపర్పస్ స్టేడియంగా మార్చేశారు. ఇప్పుడు క్రికెట్‌కంటే కూడా ఫుట్‌బాల్, రగ్బీ పోటీలు ఎక్కువగా జరుగుతుంటాయి. వాస్తవానికి నవంబర్ దాకా క్రికెట్ మ్యాచ్‌లు లేవని అప్పటి వరకు స్టేడియాన్ని బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్ క్యాంప్‌ల కోసం అద్దెకు ఇచ్చేశారు. అయితే భారత్, విండీస్ బోర్డుల అభ్యర్థనతో ఆదివారం కార్యక్రమాలను రద్దు చేసి మరీ 20 వేల సామర్థ్యం గల ఈ స్టేడియాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేయాల్సి వచ్చింది.


 


ఆటగాళ్లు 14 మంది... అధికారులు 46 మంది!

అమెరికా టి20లకు  బీసీసీఐ భారీ బృందం

ముంబై: భారత క్రికెట్ జట్టు తొలిసారి అమెరికాలో ఆడుతున్న సందర్భంగా దీనిని చిరస్మరణీయం చేసేందుకు బీసీసీఐ ‘భారీ’గా సిద్ధమైంది. మొత్తం 46 మంది అధికారులను ఈ మ్యాచ్‌లు చూసేందుకు బోర్డు సొంత ఖర్చులతో ఫ్లోరిడా పంపిస్తోంది. బీసీసీఐ గుర్తింపు ఉన్న ప్రతీ రాష్ట్ర క్రికెట్ సంఘంనుంచి ఒక్కో ప్రతినిధితో పాటు ఈశాన్య రాష్ట్రాల అధికారులకు కూడా యూఎస్ వెళ్లే అవకాశం కల్పించింది. ఇటీవలే జరిగిన బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక క్రికెట్ సిరీస్‌కు ఆటగాళ్లకంటే అధికారులే ఎక్కువ సంఖ్యలో వెళ్లటం బహుశా ఇదే తొలిసారి కావచ్చు!



ఇప్పటికే విండీస్‌లో ఉన్న సెలక్టర్లు కూడా అమెరికా వెళతారా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత లేదు. రానూ పోనూ బిజినెస్ క్లాస్ టికెట్లతో పాటు రోజూవారీ ఖర్చుల కింద (మొత్తం ఆరు రోజులు) ఒక్కొక్కరికి 250 డాలర్లను బీసీసీఐ అందిస్తుంది. ఇందు కోసం ప్రత్యేకంగా రూ. 3 కోట్ల బడ్జెట్‌ను కేటాయించడం విశేషం. అమెరికాలో భారత జట్టు ఆడటం ఒక చారిత్రాత్మక ఘట్టమని, దీనికి సాక్షిగా నిలవాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు సీనియర్ అధికారి ఒకరు వివరణ ఇచ్చారు.


 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top