క్వార్టర్స్‌లో భారత్‌ ఖేల్‌ఖతం

క్వార్టర్స్‌లో భారత్‌ ఖేల్‌ఖతం


థాయ్‌లాండ్‌ చేతిలో 2–3తో పరాజయం

ఆసియా మిక్స్‌డ్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ




హో చి మిన్‌ (వియత్నాం): స్టార్‌ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పీవీ సింధు గైర్హాజరీ భారత బ్యాడ్మింటన్‌ విజయావకాశాలపై ప్రభావం చూపింది. తొలిసారి జరుగుతున్న ఆసియా మిక్స్‌డ్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత పోరాటం క్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ 2–3తో థాయ్‌లాండ్‌ చేతిలో పరాజయం పాలైంది. తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ప్రణవ్‌ చోప్రా–సిక్కి రెడ్డి ద్వయం 25–23, 10–21, 10–21తో సావిత్రి అమృతపాయ్‌–దెచాపోల్‌ పువరనుక్రో జంట చేతిలో ఓడింది. అయితే రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 21–18, 21–15తో సుపన్యు అవింగ్‌సనోన్‌పై గెలిచి స్కోరును 1–1తో సమం చేశాడు. మూడో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో సుమీత్‌ రెడ్డి–మనూ అత్రి జోడీ 21–19, 21–16తో కిటినుపోంగ్‌ కెడ్రెన్‌–నిపిత్‌పోన్‌ జంటపై గెలిచి భారత్‌ను 2–1తో ఆధిక్యంలో నిలిపింది.



నాలుగో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో జాతీయ చాంపియన్, ప్రపంచ 55వ ర్యాంకర్‌ రితూపర్ణ దాస్‌ 21–11, 12–21, 15–21తో ప్రపంచ 40వ ర్యాంకర్‌ పోర్న్‌పవీ చోచువోంగ్‌ చేతిలో ఓటమి పాలైంది. ఒకవేళ ఈ టోర్నీలో సైనా లేదా సింధు పాల్గొని ఉంటే ఈ మహిళల సింగిల్స్‌ మ్యాచ్‌లో భారత్‌కు కచ్చితంగా విజయావకాశాలు మెరుగ్గా ఉండేవి. రితూపర్ణ ఓటమితో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌గా జరిగిన మహిళల డబుల్స్‌ మ్యాచ్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంట 21–15, 17–21, 7–21తో ప్రపంచ పదో ర్యాంక్‌ జోడీ జోంగ్‌కోల్‌ఫన్‌–రవింద ప్రజోంగ్‌జయ్‌ చేతిలో ఓడిపోవడంతో భారత్‌ 2–3తో పరాజయం పాలైంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top