కుర్రాళ్లు కొట్టారు...

కుర్రాళ్లు కొట్టారు...


సచిన్, ద్రవిడ్, గంగూలీ, లక్ష్మణ్, సెహ్వాగ్, కుంబ్లే...భారత టెస్టు క్రికెట్‌ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన ఒక తరం ఆటగాళ్లు. కానీ వీరెవ్వరూ ‘క్రికెట్ మక్కా’గా పేరొందిన లార్డ్స్ మైదానంలో విజయం రుచి చూడలేదు. కానీ రహానే, భువనేశ్వర్, జడేజాలాంటి ఈతరం కుర్రాళ్లు ఈ 200 ఏళ్ల చారిత్రక మైదానంలో తమ కోసం కొత్త చరిత్ర ‘లిఖించుకున్నారు’. లార్డ్స్‌లో ఆడిన తొలిసారే లార్డ్‌లా సత్తా చాటి భారత క్రికెట్ అభిమానులకు చాలా కాలం తర్వాత ఆనందాన్ని పంచారు. యువ ఆటగాళ్లంతా తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన చోట... నేనున్నానంటూ వెన్నుతట్టిన సారథి ధోని అండగా నిలవగా క్రికెట్ పుట్టింట్లో టీమిండియాకు చిరస్మరణీయ విజయం దక్కింది.

 

అందరూ కలిసి...

లార్డ్స్ విజయంలో దాదాపు అందరు ఆటగాళ్లూ కీలక పాత్ర పోషించారు. తొలి రోజు పచ్చని వికెట్‌పై బంతి స్వింగ్ అవుతున్న చోట పుజారా పట్టుదల కనబర్చాడు. చేసింది 28 పరుగులే అయినా వందకు పైగా బంతులు ఎదుర్కొని ఇన్నింగ్స్ కుప్పకూలకుండా కాపాడాడు. మరో వైపు తొలి ఇన్నింగ్స్‌లో గట్టిగా నిలబడ్డ ఓపెనర్ విజయ్, రెండో ఇన్నింగ్స్‌లో స్ఫూర్తిదాయక బ్యాటింగ్ ప్రదర్శించాడు. 18 ఏళ్లనాడు ద్రవిడ్ తరహాలో ఇక్కడే త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నా ఎంతో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. లార్డ్స్‌లో సెంచరీతో దిగ్గజాల సరసన రహానే చోటు దక్కించుకుంటే...ఇందుగలడందు లేడంటూ భువనేశ్వర్ కుమార్ అన్నింటా తానై సత్తా చాటాడు.



తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో ప్రత్యర్థిని కట్టడి చేసిన భువీ, రెండో ఇన్నింగ్స్‌లో తన బ్యాటింగ్ పదును చూపించి కీలక అర్ధ సెంచరీ సాధించాడు. ఈ వరుసలో రవీంద్ర జడేజా పాత్ర మరింత ప్రత్యేకం. తొలి టెస్టు వివాదం వెంటాడుతుండగా ఈ మ్యాచ్‌లో ఆటపై ఏకాగ్రత చెదరనివ్వలేదు. రెండో ఇన్నింగ్స్‌లో అతని దూకుడైన బ్యాటింగే భారత్ అవకాశాలు మెరుగు పర్చిందని చెప్పవచ్చు. అన్నింటికి మించి కొత్త శత్రువు అండర్సన్‌ను తొలి ఇన్నింగ్స్‌లో అవుట్ చేసిన జడేజా... రెండో ఇన్నింగ్స్‌లోనూ అతడిని డెరైక్ట్ త్రోతో రనౌట్ చేసి మ్యాచ్‌ను గొప్ప జ్ఞాపకంగా మలచుకున్నాడు.

- సాక్షి క్రీడావిభాగం

 

ఎన్నాళ్లకెన్నాళ్లకు...

1124 రోజులు... భారత జట్టు విదేశీ గడ్డపై టెస్టు మ్యాచ్ నెగ్గి గడిచిన కాలం. సరిగ్గా చెప్పాలంటే 2011 జూన్‌లో కింగ్‌స్టన్‌లో వెస్టిండీస్‌పై భారత్ 63 పరుగుల తేడాతో నెగ్గింది. అంతే...ఆ తర్వాత బయటికి అడుగు పెట్టిన చోటల్లా పరాభవమే వెక్కిరించింది. ఇంగ్లండ్‌లో 0-4, ఆస్ట్రేలియాలో 0-4, దక్షిణాఫ్రికాలో 0-1, న్యూజిలాండ్‌లో 0-1...ఈ వరుస 15 టెస్టుల పాటు గెలుపన్నదే లేకుండా సాగింది. ఈ క్రమంలో కెప్టెన్‌గా ధోని వైఫల్యంపై అనేక విమర్శలు వచ్చాయి. జొహన్నెస్‌బర్గ్‌లో, ఆ తర్వాత వెల్లింగ్టన్‌లో విజయానికి చేరువగా వచ్చినా...ఫలితం మాత్రం దక్కలేదు.



సీనియర్లు పోయారు, జూనియర్లు వచ్చారు...కానీ పరిస్థితి మాత్రం మారలేదు. ఇలాంటి స్థితిలో ధోని, కుర్రాళ్లను నమ్ముకొని ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టాడు. ‘గత రెండు టూర్‌లలో విజయం వాకిట నిలిచాం. ఈ సారి అవకాశం వస్తే వదులుకోం’ అని చెప్పిన ధోని దానిని నిజం చేసి చూపించాడు. తొలి టెస్టులో భారత్ ఆధిక్యం కనబర్చినా...లార్డ్స్‌లో పూర్తిగా పట్టు నిలబెట్టుకుంది. ముఖ్యంగా ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో బౌలర్లను మార్చడంలో, వ్యూహాల్లో ధోని ప్రత్యేకత కనిపించింది. అది చివరకు ఫలితాన్నిచ్చింది. ఇప్పటికే ఇంగ్లండ్‌ను చావు దెబ్బ కొట్టిన టీమిండియా ఇకపై అదే జోరును కొనసాగించి సిరీస్‌ను కూడా గెలుచుకోవాల్సి ఉంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top