ఇక అద్భుతం జరిగితేనే..!

ఇక అద్భుతం జరిగితేనే..!


- మూడో టెస్టులో ఓటమి దిశగా భారత్

- లక్ష్యం 445.. ప్రస్తుతం  112/4


 

లార్డ్స్‌లో విజయం తాలూకు ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించకముందే... ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్ గెలవాలనే ఆశకు పూర్తిగా రెక్కలు తొడగకముందే... భారత యువ జట్టు చేతులెత్తేసింది. మూడో టెస్టులో రక్షణాత్మక ధోరణిలో ఆడి మూల్యం చెల్లించుకున్నారు.  ఇక చివరి రోజు ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఇంగ్లండ్ విజయాన్ని ఆపటం కష్టమే. చేతిలో ఉన్న ఆరు వికెట్లతో ధోనిసేన ఎంతసేపు పోరాడుతుందనేదే ఆసక్తికరం.



సౌతాంప్టన్: అద్భుతమేదైనా జరిగితే తప్ప మూడో టెస్టులో భారత్ ఓటమి దాదాపు ఖాయమైనట్టే. నాలుగోరోజు భారత్ తొలి ఇన్నింగ్స్‌కు నాలుగు ఓవర్లలోనే ముగింపు పలికిన ఇంగ్లండ్.. ఆపై రెండో ఇన్నింగ్స్‌లో చకచకా పరుగులు చేసి ధోనిసేన ముందు 445 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. అనంతరం టాప్ ఆర్డర్ మరోసారి తడబడగా... బుధవారం ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. రహానే (18 బ్యాటింగ్), రోహిత్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 330 పరుగులకు ఆలౌట్ కాగా... ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌ను 4 వికెట్ల నష్టానికి 205 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.

 

నాలుగు ఓవర్లలోనే...: ఓవర్‌నైట్ స్కోరు 323/8తో ప్రారంభమైన భారత్ తొలిఇన్నింగ్స్ 4 ఓవర్లలోనే ముగిసింది. వ్యక్తిగత స్కోరుకు ఒక్క పరుగు కూడా జోడించకుండానే కెప్టెన్ ధోని (113 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) అవుటయ్యాడు. ఆ వెంటనే షమీ (5)ని కూడా ఔట్ చేసిన అండర్సన్ 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 239 పరుగుల ఆధిక్యం లభించినా... భారత్‌ను ఫాలోఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగింది.

 

ఇంగ్లండ్ దూకుడు: వీలైనంత వేగంగా పరుగులు చేసే ప్రయత్నంలో రాబ్సన్ (16), బ్యాలెన్స్ (38) అవుటయ్యారు. లంచ్ సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్లకు 80 పరుగులు చేసింది. బెల్ (23), రూట్ (56) కూడా వేగంగా ఆడారు. కుక్ (114 బంతుల్లో 70 నాటౌట్; 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టీ విరామానికి ముందు రూట్ అవుటయ్యాడు. 40.4 ఓవర్లలో 4 వికెట్లకు 205 పరుగులు చేసిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

 

మళ్లీ అదే తీరు..: మ్యాచ్‌ను కాపాడుకోవాలంటే నాలుగు సెషన్లపాటు ఆడాల్సివుండగా విజయ్ (12) రనౌట్ రూపంలో భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. పుజార (2) విఫలమయ్యాడు. ఈ దశలో ధావన్ (85 బంతుల్లో 37; 6 ఫోర్లు), కోహ్లి (56 బంతుల్లో 28; 3 ఫోర్లు) పోరాటపటిమ కనబరిచారు. కానీ, వీరిద్దరు వెంటవెంటనే అవుట్ కావడంతో రహానే, రోహిత్‌లపై భారం పడింది.

 స్కోరు వివరాలు: ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 569/7 డిక్లేర్డ్

 

భారత్ తొలి ఇన్నింగ్స్: 330 ఆలౌట్

 ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: రాబ్సన్ (సి) ధావన్ (బి) భువనేశ్వర్ 13; కుక్ నాటౌట్ 70; బ్యాలెన్స్ (సి) పుజారా (బి) జడేజా 38; బెల్ (బి) జడేజా 23; రూట్ (బి) జడేజా 56; ఎక్స్‌ట్రాలు 5, మొత్తం (40.4 ఓవర్లలో 4 వికెట్లకు): 205 డిక్లేర్డ్.

 వికెట్ల పతనం: 1-22, 2-80, 3-106, 4-205. బౌలింగ్: భువనేశ్వర్ 10-0-59-1; పంకజ్ 10-4-33-0; షమీ 4-0-24-0; రోహిత్ 5-0-32-0; జడేజా 10.4-1-52-3; విజయ్ 1-0-1-0.

 

భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ రనౌట్ 12; ధావన్ (సి) జోర్డాన్ (బి) రూట్ 37; పుజారా (సి) జోర్డాన్ (బి) అలీ 2; కోహ్లి (సి) బట్లర్ (బి) అలీ 28; రహానే బ్యాటింగ్ 18; రోహిత్ బ్యాటింగ్ 6; ఎక్స్‌ట్రాలు 9, మొత్తం(42 ఓవర్లలో 4 వికెట్లకు): 112.

 వికెట్ల పతనం: 1-26, 2-29, 3-80, 4-89. బౌలింగ్: అండర్సన్ 8-3-13-0; బ్రాడ్ 9-4-18-0; వోక్స్ 5-2-7-0; అలీ 12-2-33-2; జోర్డాన్ 5-0-22-0; రూట్ 2-0-5-1; బ్యాలెన్స్ 1-0-5-0.  

 

మరో వివాదంలో అండర్సన్

 ఇంగ్లండ్ పేసర్ అండర్సన్ మరోమారు వివాదాస్పద చర్యకు పాల్పడ్డాడు. బుధవారం ఆట ముగిశాక మైదానం నుంచి బయటకు వెళ్తున్న భారత బ్యాట్స్‌మన్ రహానేకు వేలు చూపిస్తూ డ్రెస్సింగ్ రూమ్ వైపు దారి చూపించాడు. ఈలోగా అంపైర్ టక్కర్ కలగజేసుకుని సర్దిచెప్పారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top