అసలు సవాలు మొదలైంది...

ఐసీసీ నంబర్‌వన్‌ ర్యాంక్‌ జట్టుకు  ఇచ్చే గదను గావస్కర్‌ నుంచి అందుకుంటున్న కోహ్లి


‘మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లు ఎవరైనా రెచ్చగొడితే వారికి అదే స్థాయిలో బదులిస్తాం. ఇందులో ఎక్కడా తగ్గేది లేదు. మా దూకుడు అంతే మరి. విమర్శకులు... కొందరు కూర్చున్న చోటే అవాకులు చివాకులు రాసేస్తుంటారు. మరికొందరైతే మైక్‌ ఇస్తే రెచ్చిపోతారు. కానీ వాళ్లు మాట్లాడినంత తేలిక్కాదు బ్యాటింగ్, బౌలింగ్‌ చేయడం! మా సుదీర్ఘ ప్రయాణం చక్కగా సాగింది. ర్యాంకింగ్స్‌లో ఏడు నుంచి ఏకంగా టాప్‌ ర్యాంకు అందుకున్నాం.



అయితే ఈ ర్యాంక్‌ పట్ల అత్యుత్సాహం అవసరం లేదు. ఇక్కడి నుంచి అసలు సవాలు మొదలైంది. విదేశాల్లోనూ నిలకడగా విజయాలు సాధించిన రోజు నా ముఖంలో రెట్టింపు ఆనందాన్ని చూస్తారు. ఇక ముందు ఆస్ట్రేలియా ఆటగాళ్లు నా మిత్రులుగా ఉన్నారని చెప్పను. నా గైర్హాజరీలో జింక్స్‌ (రహానే ముద్దుపేరు) జట్టును బాగా నడిపించాడు.



 సహచరులు తమ వంతు బాధ్యత తీసుకున్నారు. బౌలర్లు నలుగురా, ఐదుగురా అన్న విషయాన్ని అతనికే వదిలేశా. అతనూ మంచి ఆలోచనే చేశాడు. ఉన్న బౌలర్లపై మితిమీరిన భారం తగదనే మరో బౌలర్‌ను... అది కూడా ప్రత్యర్థులెప్పుడు ఎదుర్కొనని కుల్దీప్‌ను రంగంలోకి దించాడు.

– కోహ్లి (భారత కెప్టెన్‌)



ఇదో అద్భుతమైన సిరీస్‌. నేనాడిన గొప్ప సిరీస్‌లో ఇది కూడా ఒకటి.  భిన్న పరిస్థితుల్లో ఎలా ఆడాలో భారత్‌ మాకు నేర్పింది. భారత్‌కే విజయార్హత ఉంది. ఈ సిరీస్‌లో మెరుగైన ఆట వారిదే. మేం (తొలి టెస్టు విజయం) ఆరంభంలో ఆధిక్యం చూపినా... మొత్తంమీద పైచేయి సాధించింది, ఆధిపత్యం చాటింది మాత్రం కోహ్లి సేనే. మాకు ఇక్కడ క్లిష్టపరిస్థితులెదురైనా... ఎదురొడ్డి నిలిచాం. కొందరైతే సిరీస్‌కు ముందు వైట్‌వాష్‌ (4–0) అవుతామన్నారు... కానీ మేం 1–2తో నిలువరించాం. మూడో రోజు ఆటలో మురళీ విజయ్‌ అత్యుత్సాహంపై నేను నోరు పారేసుకున్నాను.



 దీనికి నేను క్షమాపణ కోరుతున్నాను. బహుమతి ప్రదానోత్సవం తర్వాత ఐపీఎల్‌ పుణే జట్టులో నా సహచరుడు, భారత స్టాండ్‌ఇన్‌ కెప్టెన్‌ రహానే వద్దకు వెళ్లి బీర్‌ తాగుదామని ఆహ్వానించాను. ఈ సిరీస్‌ ముగియడంతో మేమిద్దరం ఐపీఎల్‌లో కొన్ని వారాలు కలిసి ఆడనున్నాం.   

 – స్మిత్‌ (ఆస్ట్రేలియా కెప్టెన్‌)



...ఇక రచ్చ గెలవాలి

ఇంట గెలిచాం. ఇక గెలవాల్సింది బయటే! విదేశీ గడ్డపై గెలిస్తే ఆ ఆనందమే వేరు. ప్రస్తుత కోహ్లి సేన అక్కడ కూడా గెలవగలదు. ఓ మేటి ప్రత్యర్థిపై జట్టంతా కలసికట్టుగా సాధించిన విజయమిది. పేసర్లు, స్పిన్నర్లు, బ్యాట్స్‌మెన్‌ అంతా బాగా ఆడారు. చివరి టెస్టులో సారథ్య బాధ్యతలు చేపట్టిన రహానే నాయకత్వం ఆకట్టుకుంది. ఉమేశ్‌ స్పెల్‌ అద్భుతం. పుజారా, రాహుల్‌ల బ్యాటింగ్‌ కూడా బాగుంది. కుంబ్లే కోచింగ్‌లో జట్టు సరైన ట్రాక్‌లో వెళుతోంది. ఓ మేటి జట్టుకు సారథి అయిన స్మిత్‌ జరిగిన తప్పుకు క్షమాపణ కోరడం అతనిపై గౌరవం కలిగేలా చేసింది. తప్పులందరూ చేస్తారు. మన్నించమని కోరడం కొందరే చేస్తారు. అదే వాళ్ల గొప్పతనం.

– సునీల్‌ గావస్కర్‌



విదేశాల్లోనూ గెలుస్తాం

ఆస్ట్రేలియాను కంగుతినిపించిన ఈ జట్టు విదేశీ గడ్డపై కూడా గెలవగలదు. 0–1తో వెనుకబడిన దశ నుంచి గెలిచే వరకు కుర్రాళ్లు చాలా కష్టపడ్డారు. రహానే సారథ్యం బాగుంది. పేసర్లు ఈ సిరీస్‌ అసాంతం ఆకట్టుకున్నారు. బ్యాటింగ్‌లో లోయర్‌ ఆర్డర్‌ కూడా తమవంతుగా పరుగులు జతచేయడం సానుకూలాంశం. అన్ని అంశాల్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్న ఈ జట్టు భవిష్యత్‌లో విదేశాల్లోనూ తప్పకుండా విజయాలు నమోదు చేస్తుంది.

– అనిల్‌ కుంబ్లే (భారత కోచ్‌)

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top