‘లార్డ్స్’ మన చేతుల్లోకి!

‘లార్డ్స్’ మన చేతుల్లోకి!


 రెండో టెస్టులో గెలుపు దిశగా భారత్

 ఇంగ్లండ్ లక్ష్యం 319 పరుగులు

 ప్రస్తుతం 105/4

 భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 342 ఆలౌట్

 జడేజా, భువనేశ్వర్ అర్ధ సెంచరీలు

 

 లండన్: లార్డ్స్ టెస్టులో భారత్ చెలరేగిపోయింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో సమష్టి ప్రదర్శనతో మ్యాచ్‌ను చేతుల్లోకి తెచ్చుకుంది. ఇంగ్లండ్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన మురళీ విజయ్ (247 బంతుల్లో 95; 11 ఫోర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకోగా... రవీంద్ర జడేజా (57 బంతుల్లో 68; 9 ఫోర్లు), భువనేశ్వర్ కుమార్ (71 బంతుల్లో 52; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. భారత బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచి భారీ ఆధిక్యాన్ని అందించారు. ఫలితంగా ఆదివారం నాలుగో రోజు ధోని సేన రెండో ఇన్నింగ్స్‌లో 103.1 ఓవర్లలో 342 పరుగులకు ఆలౌటైంది.

 

 దీంతో ఇంగ్లండ్ ముందు 319 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. స్టోక్స్, ప్లంకెట్ చెరో మూడు వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆతిథ్య జట్టు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 46 ఓవర్లలో 4 వికెట్లకు 105 పరుగులు చేసింది. రూట్ (14 బ్యాటింగ్), అలీ (15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కుక్ (22), బాలెన్స్ (27)తో పాటు మిగతా వారు విఫలమయ్యారు. ప్రస్తుతం ఇంగ్లండ్ విజయానికి 214 పరుగుల దూరంలో ఉంది. మరో ఆరు వికెట్లు తీస్తే విజయం భారత్‌ను వరిస్తుంది. ఇషాంత్ శర్మ రెండు వికెట్లు తీయగా... షమీ, జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు.

 

 సెషన్-1 విజయ్ సెంచరీ మిస్

 ఓవర్‌నైట్ స్కోరు 169/4 తో బ్యాటింగ్ కొనసాగించిన విజయ్, ధోని (19) ఆరంభంలో ఆచితూచి ఆడారు. ఇన్నింగ్స్ 76వ ఓవర్‌లో ప్లంకెట్ వేసిన ఆఫ్ స్టంప్ బంతిని ఆడిన ధోని రెండో స్లిప్‌లో బెల్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో ఐదో వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.  లైనప్‌లో ముందుకొచ్చిన స్టువర్ట్ బిన్నీ (0) ఓ నిర్లక్ష్యపు షాట్‌కు అవుట్ కావడంతో భారత్ ఒక్క పరుగు వ్యవధిలో రెండు కీలక వికెట్లు (బిన్నీ, ధోని) కోల్పోయింది.

 తర్వాత ఇంగ్లండ్ కొత్త బంతిని తీసుకున్నా విజయ్, జడేజా నాణ్యమైన షాట్లతో ఆకట్టుకున్నారు.

 

 సెంచరీ దిశగా సాగుతున్న విజయ్‌ను 83వ ఓవర్‌లో అండర్సన్ ఓ అద్భుతమైన బంతితో దెబ్బతీశాడు. దీంతో ఐదు పరుగుల తేడాతో శతకం మిస్సయింది. విజయ్, జడేజా ఐడో వికెట్‌కు 32 పరుగులు జోడించారు.

 

 రెండు పరుగుల వద్ద భువనేశ్వర్ అవుటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. ఇతని అండతో జడేజా వేగంగా పరుగులు రాబట్టడంతో భారత్ 267/7 స్కోరుతో లంచ్‌కు వెళ్లింది.

 ఓవర్లు: 25; పరుగులు: 98; వికెట్లు: 3

 

 సెషన్-2 జడేజా దూకుడు

 లంచ్ తర్వాత వేగంగా ఆడిన జడేజా, భువీ తొలి 10 ఓవర్లలో 66 పరుగులు జోడించారు. ఇదే క్రమంలో జడేజా అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎనిమిదో వికెట్‌కు 99 బంతుల్లో 99 పరుగులు జోడించాక జడేజా కొట్టిన పుల్ షాట్ గాల్లోకి లేచింది. కుక్... కీపర్ వెనుక పరుగెత్తుతూ చక్కగా అందుకున్నాడు.

 

 మరో ఏడు బంతుల తర్వాత షమీ (0) పెవిలియన్‌కు చేరుకున్నాడు. తర్వాత ఇషాంత్ (0 నాటౌట్) బంతిని ఎక్కువగా డిఫెన్స్ చేశాడు. టెస్టుల్లో మూడో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న భువీ మరో రెండు పరుగులు చేసి అవుట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ నిదానంగా ఆడింది. అయితే ఐదు ఓవర్ల తర్వాత ఓ ఎండ్‌లో ఇషాంత్‌ను మరో ఎండ్‌లో జడేజాను తేవడం భారత్‌కు కలిసొచ్చింది.



 రాబ్సన్ (7)ను జడేజా ఎల్బీ చేయడంతో ఇంగ్లండ్ 12 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.

 ఓవర్లు: 15.1; పరుగులు: 75; వికెట్లు: 3 (భారత్)

 ఓవర్లు: 8; పరుగులు; 18; వికెట్లు 1 (ఇంగ్లండ్)

 

 సెషన్-3 కుక్ నిలకడ

 టీ తర్వాత కుక్, బాలెన్స్ వికెట్‌ను కాపాడుకునేందుకు ప్రాధాన్యమిచ్చారు. సింగిల్స్‌కే పరిమితం కావడంతో పరుగుల రాక మందగించింది.

 

 ఈ జోడిని విడదీసేందుకు ధోని చాలా ప్రయత్నాలు చేశాడు. ఓ ఎండ్‌లో ఇషాంత్‌ను కొనసాగిస్తూ... రెండో ఎండ్‌లో బౌలర్లను తరచూ మార్చాడు.  ఈ వ్యూహం 29వ ఓవర్‌లో ఫలితాన్నిచ్చింది. రెండో స్పెల్‌కు వచ్చిన షమీ తొలి బంతికే బాలెన్స్‌ను అవుట్ చేశాడు. కుక్, బాలెన్స్ రెండో వికెట్‌కు 58 పరుగులు జోడించారు. ఇషాంత్ తన తర్వాతి రెండు ఓవర్లలో బెల్ (1), కుక్‌లను పెవిలియన్‌కు పంపడంతో ఇంగ్లండ్ 72 పరుగులకే 4 వికెట్లు చేజార్చుకుంది.

 

రూట్‌తో జతకలిసిన అలీ చాలా నెమ్మదిగా ఆడాడు. భారత బౌలర్లు ఒత్తిడి పెంచినా ఎక్కువగా డిఫెన్స్ చేస్తూ వికెట్‌ను కాపాడుకున్నాడు. చివర్లో ధోని... అలీ క్యాచ్‌ను జార విడవడంతో ఈ ఇద్దరు ఐదో వికెట్‌కు అజేయంగా 33 పరుగులు జోడించి నాలుగో రోజు ఆటను ముగించారు.

ఓవర్లు: 38; పరుగులు: 87; వికెట్లు: 3

 

జడేజా బ్యాట్ విన్యాసం

అర్ధసెంచరీ పూర్తి చేసిన తర్వాత జడేజా... డ్రెస్సింగ్ రూమ్ వైపు చూస్తూ బ్యాట్‌ను కర్రసాము మాదిరిగా తిప్పాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న ధోని దీనికి ప్రతి స్పందనగా తన చేతిని అదే మాదిరిగా తిప్పుతూ చిరు నవ్వులు చిందించాడు.

 

 1  ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు భువనేశ్వర్ మూడు అర్ధసెంచరీలు చేశాడు. 9వ నంబర్ బ్యాట్స్‌మన్ ఒక సిరీస్‌లో ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి. అంతేకాకుండా వరుసగా రెండు టెస్టుల్లో 50కి పైగా పరుగులు చేసి, ఐదు వికెట్లు తీసిన తొలి భారతీయ క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు.

 

 స్కోరు వివరాలు

భారత్ తొలి ఇన్నింగ్స్: 295 ఆలౌట్

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 319 ఆలౌట్

భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ (సి) ప్రయర్ (బి) అండర్సన్ 95; ధావన్ (సి) రూట్ (బి) స్టోక్స్ 31; పుజారా (సి) ప్రయర్ (బి) ప్లంకెట్ 43; కోహ్లి (బి) ప్లంకెట్ 0; రహానే (సి) ప్రయర్ (బి) బ్రాడ్ 5; ధోని (సి) బెల్ (బి) ప్లంకెట్ 19; బిన్నీ (సి) కుక్ (బి) అలీ 0; జడేజా (సి) కుక్ (బి) స్టోక్స్ 68; భువనేశ్వర్ (సి) బెల్ (బి) స్టోక్స్ 52; షమీ (సి) ప్రయర్ (బి) అలీ 0; ఇషాంత్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 29; మొత్తం (103.1 ఓవర్లలో ఆలౌట్) 342 వికెట్ల పతనం: 1-40; 2-118; 3-118; 4-123; 5-202; 6-203; 7-235; 8-334; 9-338; 10-342.

 

బౌలింగ్: అండర్సన్ 29-11-77-1; బ్రాడ్ 23-6-93-1; స్టోక్స్ 18.1-2-51-3; ప్లంకెట్ 22-6-65-3; అలీ 11-3-28-2.ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: రాబ్సన్ ఎల్బీడబ్ల్యు (బి) జడేజా 7; కుక్ (సి) ధోని (బి) ఇషాంత్ 22; బాలెన్స్ (సి) ధోని (బి) షమీ 27: బెల్ (బి) ఇషాంత్ 1; రూట్ బ్యాటింగ్ 14; అలీ బ్యాటింగ్ 15; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (46 ఓవర్లలో 4 వికెట్లకు) 105  వికెట్ల పతనం: 1-12; 2-70; 3-71; 4-72. బౌలింగ్: భువనేశ్వర్ 8-4-10-0; షమీ 7-1-20-1; ఇషాంత్ 10-5-13-2; జడేజా 16-4-32-1; విజయ్ 4-1-11-0; ధావన్ 1-0-1-0.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top