తొలి సెషన్ కీలకం


అనిల్ కుంబ్లే

క్రికెట్ అంటేనే అనిశ్చితికి మారుపేరు. అయితే భారత జట్టు మాత్రం మూడో టెస్టును శాసించే స్థితిలో ఉంది. ఇక శ్రీలంక జట్టు గెలవడానికి బదులు ఓటమి నుంచి తప్పించుకునేందుకు తమ చూపంతా వాతావరణంపైనే పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ జట్టు ఉన్న పరిస్థితి అలాంటిది. భారత బ్యాటింగ్‌లో మిడిల్, లోయర్ ఆర్డర్ కారణంగా జట్టు గౌరవప్రదమైన స్థితిలో నిలిచింది. నాలుగు రోజుల ఆటను గమనిస్తే... బ్యాట్స్‌మెన్‌కు సవాల్‌గా మారిన పిచ్‌పై నిలబడిన ఒకే ఒక్క టాపార్డర్ ఆటగాడు పుజారా. తొలి ఇన్నింగ్స్‌లో తన సెంచరీ అమూల్యం. లంక మాత్రం తమ పేసర్లను ఎక్కువ సేపు ఉపయోగించుకోవడంలో విఫలమైంది.



ఓ ఎండ్‌లో స్పిన్నర్లు సుదీర్ఘంగా బౌలింగ్ చేయడం భారత బ్యాట్స్‌మెన్‌కు కలిసొచ్చింది. దీంతో విలువైన భాగస్వామ్యాలను నెలకొల్పే అవకాశం చిక్కింది. కష్టసాధ్యమైన లక్ష్య ఛేదనలో శ్రీలంక మరోసారి ఇషాంత్ దెబ్బను చవిచూడాల్సి వచ్చింది. తన లైనప్‌ను తగ్గించుకున్న అనంతరం ఇషాంత్ లాభపడ్డాడు. ఇప్పుడు తను కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌ను పాటిస్తున్నాడు. అయితే కొన్నిసార్లు అదుపు తప్పుతున్నాడు. ఇక చివరి రోజు మంగళవారం లంక ఆటలో మాథ్యూస్ వికెట్ కీలకం.



రెండో టెస్టులోనూ భారత్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తొలి బంతికే అతడిని పెవిలియన్‌కు పంపి మ్యాచ్‌ను కాపాడుకుంది. చివరి రోజు తొలి సెషన్ చాలా కీలకం. ఇందులోనే లంక వికెట్లు తీసి ఒత్తిడిలోకి నెట్టాలి. శ్రీలంక జట్టు రెండో టెస్టును పోరాడలేక వదులుకుంది. పరిస్థితి చూస్తే ఇప్పుడు కూడా అలాంటి సన్నివేశమే పునరావృతమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఓవరాల్‌గా భారత్ ఈ టెస్టునే కాకుండా సిరీస్‌ను కూడా దక్కించుకునేందుకు సిద్ధంగా ఉంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top