కల చెదిరె...

కల చెదిరె...


ప్రపంచకప్‌ ఫైనల్లో భారత మహిళల జట్టుకు నిరాశ

9 పరుగులతో ఇంగ్లండ్‌ గెలుపు


నాలుగో సారి విశ్వ విజేత

పూనమ్‌ రౌత్‌ పోరాటం వృథా

ష్రబ్‌సోల్‌కు 6 వికెట్లు




ఎన్నో ఆశలు, ఎన్నో కలలు... అనుభవరాహిత్యం, ఒత్తిడి ముందు చెదిరిపోయాయి. అద్భుతాన్ని ఆశించిన జట్టు దానిని అందుకునే క్రమంలో ఎంతో చేరువగా వచ్చినా, చివరకు ఆ విజయం అందకుండా దూరంగా వెళ్లిపోయింది. చిరస్మరణీయ ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్‌ దృష్టిని తమ వైపునకు  తిప్పుకున్న భారత మహిళల సైన్యం చివరకు గుండె పగిలే రీతిలో ఓటమిని ఆహ్వానించింది. ఎప్పుడో పన్నెండేళ్ల క్రితం చేజారిన అవకాశాన్ని ఈ సారి ఒడిసిపట్టుకునేలా కనిపించినా... ‘విమెన్‌ ఇన్‌ బ్లూ’ కడకు దానిని చేజార్చుకున్నారు. సొంత మైదానంలో ఒక దశలో అనూహ్య పరాజయం పలకరిస్తున్నా... పట్టుదల వదలకుండా పోరాడిన ఇంగ్లండ్‌ నాలుగోసారి సగర్వంగా ట్రోఫీని తలకెత్తుకుంది.



229 పరుగులను ఛేదించే క్రమంలో ఒక దశలో స్కోరు 191/3. కెప్టెన్‌ మిథాలీ, హిట్టర్‌ హర్మన్‌ప్రీత్‌ వెనుదిరిగినా... ఫామ్‌లో ఉన్న పూనమ్‌ రౌత్, వేద కృష్ణమూర్తి అలవోకగా జట్టును గెలిపించేలా కనిపించారు. ప్రతీ భారత అభిమానికి ఇక విజయం ఖాయమే అనిపించింది. కానీ ఇంగ్లండ్‌ బౌలర్‌ ష్రబ్‌సోల్‌ ఒక్కసారిగా చెలరేగింది. ఉత్కంఠ స్థితిలో మన మహిళల పొరపాట్లు కూడా కలిసి భారత్‌

తలరాతను మార్చేశాయి. చివరకు 28 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోయి ఏమీ చేయలేక టీమిండియా చేతులెత్తేసింది. భారత్‌ దూకుడు ముందు ఓటమికి చేరువైనట్లు కనిపించినా హీథెర్‌ నైట్‌ కెప్టెన్సీ ఆతిథ్య జట్టును విజేతగా నిలిపింది.



ప్రపంచ కప్‌ గెలిస్తే భారత్‌లో మహిళల క్రికెట్‌ రాత మారిపోతుంది... మన కెప్టెన్‌ పదే పదే టోర్నీలో చెప్పిన మాట ఇది. ఫర్వాలేదు... ఫైనల్లో ఓడినా మీ ఆటకు జోహార్లు. ఈ టోర్నీలో ప్రదర్శన చాలు మీ ఆట ఎన్నో మెట్లు పైకి ఎక్కిందని చెప్పేందుకు! మీ మ్యాచ్‌ల గురించి ఇక ముందు ప్రపంచం చర్చిస్తుంది. జయాపజయాల గురించి మాట్లాడుతుంది. లార్డ్స్‌ మైదానంలో హౌస్‌ఫుల్‌గా వరల్డ్‌ కప్‌ మహిళల మ్యాచ్‌ జరిగిందంటే అది మీ ఆటపై నమ్మకంతోనే. లక్షలాది మంది టీవీలకు అతుక్కుపోయి ఆడవారి ఆట కోసం ఎదురు చూశారంటే అది మీ ఆటలోని గొప్పతనమే. ఫైనల్‌ ఓటమి తీవ్రంగా కలచివేసిందనడంలో సందేహం లేదు. కానీ వారి ఘనతను ఈ ఓటమి ఏమాత్రం తగ్గించలేదనేది సత్యం.  



లండన్‌: తొలిసారి వన్డే ప్రపంచ కప్‌ విజేతగా నిలవాలని భావించిన భారత మహిళలకు నిరాశే ఎదురైంది. తుది పోరులో చక్కటి విజయావకాశాలు లభించినా... అనూహ్యంగా తడబడి చివరకు జట్టు ఓటమి పాలైంది. ఆదివారం ఇక్కడి లార్డ్స్‌ మైదానంలో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ 9 పరుగుల స్వల్ప తేడాతో భారత్‌పై విజయం సాధించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. నటాలీ సివర్‌ (68 బంతుల్లో 51; 5 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, జులన్‌ గోస్వామి 3 కీలక వికెట్లు పడగొట్టింది. అనంతరం భారత్‌ 48.4 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌటైంది. పూనమ్‌ రౌత్‌ (115 బంతుల్లో 86; 4 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుగైన ప్రదర్శన కనబర్చింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అన్య ష్రబ్‌సోల్‌ (6/46) భారత్‌ పతనాన్ని శాసించింది. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బీమాంట్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ అవార్డు దక్కింది.



జులన్‌ జోరు...

పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న ఇంగ్లండ్‌ సాధారణ స్కోరుకు పరిమితమైందంటే అది జులన్‌ గోస్వామి చలవే. తన రెండో ప్రపంచ కప్‌ ఫైనల్‌ ఆడుతున్న ఈ సీనియర్‌ పేసర్‌ కీలక సమయంలో కదం తొక్కింది. ఆమె వేసిన రెండు స్పెల్‌లు ప్రత్యర్థిని దెబ్బ తీశాయి. తొలి స్పెల్‌లో 5 ఓవర్లలో కేవలం 9 పరుగులే ఇచ్చిన జులన్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టిపడేసింది. ఓపెనర్లు విన్‌ఫీల్డ్‌ (35 బంతుల్లో 24; 4 ఫోర్లు), బీమాంట్‌ (37 బంతుల్లో 23; 5 ఫోర్లు) శిఖా పాండే బౌలింగ్‌లో పరుగులు చేయగలిగినా, జులన్‌ను మాత్రం ఎదుర్కోలేకపోయారు. స్పిన్నర్‌ రాజేశ్వరి తొలి ఓవర్లో విన్‌ఫీల్డ్‌ మూడు ఫోర్లు కొట్టి దూకుడు ప్రదర్శించడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 43 పరుగులకు చేరింది. ఎట్టకేలకు విన్‌ఫీల్డ్‌ను రాజేశ్వరి బౌల్డ్‌ చేసి భారత్‌కు తొలి వికెట్‌ అందించింది.



అనంతరం లెగ్‌స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ తొలి ఓవర్లోనే బీమాంట్‌ను పెవిలియన్‌ పంపించింది. ఆ వెంటనే కీలకమైన కెప్టెన్‌ నైట్‌ (1)ను కూడా ఎల్బీడబ్లు్యగా అవుట్‌ చేసి ఆమె ఇంగ్లండ్‌ను దెబ్బ తీసింది.  భారత్‌ ఎల్బీ అప్పీల్‌ను ముందు అంపైర్‌ తిరస్కరించినా... మిథాలీ రివ్యూకు వెళ్లి ఫలితం సాధించింది. అనంతరం సారా టేలర్‌ (62 బంతుల్లో 45), సివర్‌ కలిసి జాగ్రత్తగా ఆడుతూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 83 పరుగులు జోడించారు. 32 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్‌ స్కోరు 144/3. ఈ దశలో జులన్‌ తన రెండో స్పెల్‌ను మొదలు పెట్టింది. తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో టేలర్, విల్సన్‌ (0)లను అవుట్‌ చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే సివర్‌ను కూడా ఆమె ఎల్బీగా అవుట్‌ చేయడంతో ఇంగ్లండ్‌ కష్టాలు పెరిగాయి. జులన్‌ తన రెండో స్పెల్‌లో 5 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టడం విశేషం.



కీలక భాగస్వామ్యం...

ఛేదనలో భారత్‌కు సరైన ఆరంభం లభించలేదు. స్మృతి మంధన (0) మళ్లీ విఫలమైంది. రౌత్, మిథాలీ (31 బంతుల్లో 17; 3 ఫోర్లు) ఆదుకునే ప్రయత్నంలో నెమ్మదిగా ఆడటంతో పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు 31 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం కొద్ది సేపటికే మిథాలీ రనౌట్‌ భారత్‌ను ఇబ్బందుల్లో పడేసింది. రౌత్‌ మిడ్‌ వికెట్‌ దిశగా బంతిని ఆడి సింగిల్‌ కోసం ప్రయత్నించగా... చురుగ్గా స్పందించలేకపోయిన కెప్టెన్‌ మిథాలీ మరో ఎండ్‌కు చేరే సరికి కీపర్‌ టేలర్‌ బెయిల్స్‌ను పడగొట్టింది. ఈ స్థితిలో పూనమ్, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కలిసి జట్టు ఇన్నింగ్స్‌ను సమర్థంగా నడిపించారు. ఈ క్రమంలో వీరిద్దరు అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే భారీషాట్‌ ప్రయత్నంలో కౌర్‌ అవుట్‌ కావడంతో 95 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. వేద, రౌత్‌ క్రీజ్‌లో ఉన్నంత వరకు భారత్‌కు మంచి విజయావకాశాలు కనిపించాయి. అయితే ఆ తర్వాత పది పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోవడంతో జట్టు ఓటమికి చేరువైంది.బ్యాటింగ్‌ చేయగల సామర్థ్యం ఉన్న దీప్తి శర్మ (14) కూడా అదే బాట పట్టగా, రాజేశ్వరిని బౌల్డ్‌ చేసి ష్రబ్‌సోల్‌ ఇంగ్లండ్‌ను విశ్వ విజేతగా నిలిపింది.



నాకు గర్వంగా ఉంది. ఓడినా... మేం ఇంగ్లండ్‌ను వణికించాం. అయితే కడదాకా పోరాడి గెలిచారు వాళ్లు. మేం బాగానే ఆడినా... గెలిచే దారిలో ఓడాం. మా అమ్మాయిల ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉన్నా. ఏ మ్యాచ్‌నూ మా వాళ్లు తేలిగ్గా తీసుకోలేదు. ప్రతీ మ్యాచ్‌లోనూ కష్టపడ్డారు. ఎక్కువమందికి ఇదే తొలి ఫైనల్‌. ఈ అనుభవం వారికి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. అనుభవజ్ఞురాలైన జులన్‌ గోస్వామి చక్కగా బౌలింగ్‌ చేసింది. గెలిచి ఉంటే ఆమె కెరీర్‌లోనే ఇది అత్యుత్తమ ప్రదర్శన అయ్యేది. ఫైనల్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చిన వారికి థ్యాంక్స్‌. ఇది మహిళల క్రికెట్‌కు నూతన ఉత్తేజాన్నిస్తోంది. నేను మరో రెండు, మూడేళ్లు ఆడతాను. అయితే 2021లో జరిగే తదుపరి ప్రపంచకప్‌దాకా మాత్రం ఆటలో ఉండను.



భారత కెప్టెన్‌ మిథాలీ


మా సంతోషానికి అవధుల్లేవ్‌. జట్టు సహచరులంతా అసాధారణ ప్రదర్శన కనబరిచారు. మ్యాచ్‌ను చేజేతులా ఇక్కడిదాకా తెచ్చుకున్నాం. అయినా ఈ టోర్నీలో ఉత్కంఠ రేపే మ్యాచ్‌ల్లో గెలిచాం. గత 18 నెలలుగా మేం ఇలాంటి ఒత్తిడి మ్యాచ్‌ల్ని ఎన్నో ఎదుర్కొన్నాం. ష్రబ్‌సోల్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసింది. మ్యాచ్‌ను మా చేతుల్లోకి తెచ్చింది. భారత జట్టులో పూనమ్‌ రౌత్‌ బాగా ఆడింది. వారి భాగస్వామ్యాలు కూడా మమ్మల్ని కలవరపెట్టాయి.

– ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హీథెర్‌ నైట్‌



ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన ఇంగ్లండ్‌కు 6 లక్షల 60 వేల డాలర్లు (రూ. 4 కోట్ల 25 లక్షలు)... రన్నరప్‌ భారత జట్టుకు 3 లక్షల 30 వేల డాలర్లు (రూ. 2 కోట్ల 12 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సెమీఫైనల్స్‌లో ఓడిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లకు లక్షా 65 వేల డాలర్ల చొప్పున (రూ. కోటి) దక్కాయి. 2021 ప్రపంచకప్‌ న్యూజిలాండ్‌లో జరుగుతుంది.



Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top