విరాట్ సేన ఇరగదీసింది..

విరాట్ సేన ఇరగదీసింది..


కటక్:ఇంగ్లండ్ తో ఇక్కడ బారాబతి స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఇరగదీసింది. ఇంగ్లండ్ కు 382 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించి తమ బ్యాటింగ్ బలాన్ని మరోసారి చూపించింది. భారత్ భారీ స్కోరులో యువరాజ్ సింగ్-మహేంద్ర సింగ్ ధోనిలు ప్రధాన పాత్ర పోషించారు. యువరాజ్ సింగ్(150;127 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడగా, మహేంద్ర సింగ్ ధోని(134;122 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు) తనదైన మార్కును చూపెట్టాడు. ఈ జోడి నాల్గో వికెట్ కు 256 పరుగుల జోడించి సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఇంగ్లండ్ పై నాల్గో వికెట్ కు ఓవరాల్గా ఇదే అత్యధిక స్కోరు.





అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేఎల్ రాహుల్(5), కోహ్లి(8),శిఖర్ ధవన్(11)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరి తీవ్రంగా నిరాశపరిచారు. ఆ తరుణంలో యువరాజ్-ధోనిలు భారత్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. ఒకవైపు బాధ్యత, మరొకవైపు ఫుల్ జోష్తో ఈ జోడి చెలరేగిపోయింది. తొలి హాఫ్ సెంచరీ చేయడానికి 56 బంతులను ఎదుర్కొన్న యువీ.. రెండో హాఫ్ సెంచరీ చేయడానికి 42 బంతులను తీసుకున్నాడు. అయితే మూడో అర్థ శతకాన్ని మాత్రం యువీ 29 బంతుల్లోనే పూర్తి చేసి నిష్క్రమించాడు. ఇది యువరాజ్ కెరీర్లో 14వ వన్డే సెంచరీ కాగా,  ఐదేళ్ల తరువాత అతనికి ఇదే తొలి సెంచరీ. 2011లో జరిగిన వరల్డ్ కప్లో వెస్టిండీస్ పై యువరాజ్ చివరిసారి వన్డే శతకం సాధించాడు.





ఆ తరువాత ధోని సెంచరీ సాధించి తనలోని సత్తా తగ్గలేదని నిరూపించాడు. ప్రత్యేకంగా హెలికాప్టర్ షాట్లతో ధోని అలరించాడు. తొలి హాఫ్ సెంచరీ చేయడానికి 68 బంతులను ఎదుర్కొన్న ధోని.. రెండో హాఫ్ సెంచరీ చేయడానికి 38 బంతులను మాత్రమే ఎదుర్కొన్నాడు. ఇది ధోని కెరీర్లో 10వ వన్డే సెంచరీ. కాగా, యువీ నాల్గో వికెట్ గా నిష్కమణ తరువాత ధోనికి కేదర్ జాదవ్ జతకలిశాడు. స్కోరును పెంచే యత్నంలో 10 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 22 పరుగులు చేసిన జాదవ్ ఐదో వికెట్ గా పెవిలియన్ చేరాడు. చివర్లో హార్ధిక్ పాండ్యా(19 నాటౌట్;9 బంతుల్లో 2ఫోర్లు, 1సిక్స్), జడేజా(16 నాటౌట్;8 బంతుల్లో 1ఫోర్ల, 1 సిక్స్) రాణించడంతో భారత్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో  వోక్స్ నాలుగు వికెట్లు సాధించగా,  ప్లంకెట్కు రెండు వికెట్లు దక్కాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top