క్వార్టర్స్లో టీమిండియా


ప్రపంచ కప్లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆల్రౌండ్ షోతో అదరగొడుతున్న ధోనీసేన వరుసగా నాలుగో విజయం సాధించింది. గ్రూపు-బిలో టాపర్గా కొనసాగుతున్న భారత్ నాకౌట్ బెర్తు దక్కించుకుంది. తాజాగా వెస్టిండీస్పై విజయం సాధించింది. ఈ ఈవెంట్లో ఇప్పటి వరకు ఓటమెరుగని జట్లు రెండే. న్యూజిలాండ్, భారత్ ఆడిన చెరో నాలుగు మ్యాచ్లలో గెలుపొందాయి. లీగ్ దశలో భారత్ మరో రెండు మ్యాచ్లు ఆడనుంది. అవి కూడా పసికూనలు ఐర్లాండ్, జింబాబ్వే జట్లతో కాబట్టి భారత్ లీగ్ దశను ఓటమి లేకుండా ముగించే అవకాశముంది. భారత టాపార్డర్తో పాటు బౌలర్లు సమిష్టిగా రాణించారు. రెండు మ్యాచ్ల్లో తొలుత బ్యాటింగ్ టీమిండియా రెండింటిలోనూ 300 పైచిలుకు స్కోర్లు సాధించింది. ఇక నాలుగు మ్యాచ్లలోనూ ధోనీసేన ప్రత్యర్థి జట్లను ఆలౌట్ చేయడం విశేషం. లీగ్ దశలో భారత్ ప్రస్థానం ఇప్పటి వరకు ఎలా సాగిందంటే..



పాక్పై ఘనవిజయం: ప్రపంచ కప్ చరిత్రలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఓటమే ఎరుగని భారత్.. తాజా ఈవెంట్లోనూ అదే ఆనవాయితీ కొనసాగించింది. పాక్పై 76 పరుగులతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కోహ్లీ సెంచరీ సాయంతో 300 పరుగులు చేసింది. అనంతరం పాక్ను 224 పరుగులకే కుప్పకూల్చింది. భారత పేసర్ షమీ (4/48) అద్భుతంగా రాణించాడు.



సఫారీలపై కొత్త చరిత్ర: ప్రపంచ కప్ చరిత్రలో దక్షిణాఫ్రికాపై విజయమే ఎరుగని భారత్ తొలిసారి అద్భుత విజయం నమోదు చేసింది. టీమిండియా ఏకంగా 130 పరుగుల తేడాతో సఫారీలను చిత్తుచేసింది. ధవన్ సెంచరీ సాయంతో 307 పరుగులు చేసిన ధోనీసేన.. సౌతాఫ్రికాను 177 పరుగులకు ఆలౌట్ చేశారు. భారత బౌలర్లు అశ్విన్ 3, మోహిత్ 2, షమీ 2 వికెట్లు తీశారు.



యూఏఈపై భారీ విజయం: భారత్ పసికూన యూఏఈపై 9 వికెట్లతో భారీ విజయం నమోదు చేసి హ్యాట్రిక్ కొట్టింది. యూఏఈని 102 పరుగులకే ఆలౌట్ చేసిన ధోనీసేన.. ఆ తర్వాత 18.5  ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించారు. ఈ మ్యాచ్లో రోహిత్ హాఫ్ సెంచరీ చేయగా,.. భారత బౌలర్లు అశ్విన్ 4, ఉమేష్ 2, జడేజా 2 వికెట్లు తీశారు.



విండీస్: వెస్టిండీస్ తో హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో ధోనీసేన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు వెస్టిండీస్ను 182 పరుగులకు ఆలౌట్ చేశారు. షమీ 3, ఉమేష్ 2, జడేజా 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో టీమిండియా తడబడింది. టాపార్డర్ విఫలమయ్యారు. అయితే ధోనీ కెప్టెన్ ఇన్నింగ్స్ తో జట్టును గెలిపించాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top