మువ్వన్నెలు మురిసేనా!

మువ్వన్నెలు మురిసేనా!


భారత బృందంపై పెరిగిన అంచనాలు

 టాప్-3 లక్ష్యం


 

 నూట ఇరవై కోట్ల జనాభా... కానీ ఒలింపిక్స్‌లో ఒక స్వర్ణం కోసం కళ్లు  కాయలు కాస్తున్నాయి. పసిడి గెలవడానికి ప్రమాణాలు సరిపోవడం లేదంటున్నారు.పోనీ ఆసియా గేమ్స్‌లోనైనా సాధిద్దామంటే చైనా డ్రాగన్‌కు భయపడిపోతున్నారు.అందుకే భారత క్రీడాకారులకు కామన్వెల్త్ గేమ్స్ ఓ పండుగలాంటిది. పెద్ద సంఖ్యలో పసిడి పతకాలు సాధించాలన్నా... అసాధారణ ప్రతిభతో రికార్డుల మోత మోగించాలన్నా ఈ గేమ్స్ వేదికగా నిలుస్తున్నాయి.

 

 గతంలో మాదిరిగా ఈసారి కూడా భారీ బృందంతో బరిలోకి దిగుతున్న భారత్... ఢిల్లీ గేమ్స్‌ని దాటాలని ప్రయత్నిస్తోంది. అయితే ప్రస్తుత గేమ్స్‌లో కొన్ని ఈవెంట్లను తప్పించడంతో పతకాల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నా ... టాప్-3 లక్ష్యంగా పెట్టుకుంది.


 

 గ్లాస్గో : స్వదేశంలో జరిగిన ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ (2010)ను ఊహించని వివాదాలు చుట్టిముట్టినా... ఆట పరంగా భారత్‌కు మధురస్మృతులే మిగిలాయి. సొంతగడ్డను అనుకూలాంశంగా మల్చుకుని భారత అథ్లెట్లు చెలరేగిపోయారు. దీంతో ఎన్నడూ లేని విధంగా 101 పతకాలతో రెండో స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించారు.

 

  రికార్డు స్థాయిలో 38 స్వర్ణాలు గెలిచి విమర్శకులు సైతం ఆశ్చర్యపోయేలా చేశారు. జిమ్నాస్టిక్స్‌లో ఆశిష్ కుమార్ పతకాలు గెలవడం, 52 ఏళ్ల తర్వాత అథ్లెటిక్స్‌లో స్వర్ణం సాధించడంతో ఈ క్రీడల చరిత్రలోనే భారత్ మరుపురాని విజయాలను సొంతం చేసుకుంది.

 

 నాలుగేళ్ల కిందటి ప్రదర్శనను పునరావృతం చేయాలనే భారీ ప్రణాళికతో భారత్ గ్లాస్గోకు బయలుదేరి వెళ్లింది. 14 విభాగాల్లో 213 మంది బరిలోకి దిగుతున్నారు. అత్యధికంగా అథ్లెటిక్స్‌లో 32 మంది పోటీపడుతున్నారు. 2010 గేమ్స్‌లో 12 పతకాలు అందించిన ఆర్చరీ, టెన్నిస్‌లను ఈసారి తొలగించారు. దీంతో భారత్ పతకాల సంఖ్యపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఓవరాల్‌గా 60 పతకాలు సాధించి టాప్-3లో నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అభినవ్ బింద్రా, నారంగ్, విజేందర్, సుశీల్, యోగేశ్వర్ దత్, కృష్ణ పూనియా, ఆశిష్ కుమార్, శరత్ కమల్ స్వర్ణాలపై కన్నేశారు.

 

 బ్యాడ్మింటన్

 గాయం కారణంగా స్టార్ సైనా నెహ్వాల్ గేమ్స్‌కు దూరమైనా.. ఈ విభాగంలో పతకం వచ్చే అవకాశాలున్నాయి. ఢిల్లీలో సైనా, కశ్యప్, జ్వాల-అశ్విని జోడి స్వర్ణాలు గెలిచింది. ఇప్పుడు రైజింగ్ స్టార్ పి.వి.సింధుపై ఆశలు అధికంగా ఉన్నాయి. పురుషుల విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ పోటీల నుంచి వైదొలగడంతో కశ్యప్ ఏదో ఓ పతకం లభించే అవకాశం ఉంది. శ్రీకాంత్, గురుసాయిదత్‌లు సంచలనాలు సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నారు. జ్వాల జోడీకి గట్టిపోటీ ఎదురుకానుంది.

 

 బాక్సింగ్

 ఈసారి కూడా భారత్ ‘పంచ్’ బలంగా పడనుంది. దేవేంద్రో సింగ్, శివ థాపా, మనోజ్ కుమార్, విజేందర్ సింగ్, సుమిత్ సాంగ్వాన్, ప్రవీణ్ మోరెలు పతకాల కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. మనోజ్ స్వర్ణం నెగ్గే అవకాశాలున్నాయి. ఇక తొలిసారిగా ఈ టోర్నీలో మహిళా బాక్సింగ్‌ను ప్రవేశపెట్టగా పింకీ జాంగ్రా, ఎల్.సరితా దేవి, పూజా రాణి తమ పంచ్ రుచి చూపేందుకు సిద్ధంగా ఉన్నారు.

 

 హాకీ

 ఢిల్లీ గేమ్స్‌లో రజతంతో సరిపెట్టుకున్న హాకీ జట్టు ఈసారి కూడా తుది పోరుకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతా అనుకున్నట్లు జరిగితే సెమీస్‌లో న్యూజిలాండ్ లేదా ఇంగ్లండ్‌లను ఓడించాల్సి వస్తుంది. మహిళల జట్టు తమ గ్రూప్‌లో టాప్-2లో నిలవాలనే ఆశయంతో ఉంది.

 

 టేబుల్ టెన్నిస్

 భారత్ కనీసం రెండు పతకాలు గెలవొచ్చు. 2010లో ఒక స్వర్ణంతో పాటు ఐదు పతకాలు వచ్చినా ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ జట్టు కోచ్ పీటర్ ఎంగెల్ ఈసారి మూడు పతకాలు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. వెటరన్ ఆచంట శరత్ కమల్, సౌమ్యజిత్ ఘోష్, పౌలోమి ఘటక్, అంకితా దాస్‌పై అంచనాలు అధికంగా ఉన్నాయి.

 

 జిమ్నాస్టిక్స్

 ఢిల్లీ గేమ్స్‌లో ఆశిష్ కుమార్ అనూహ్యంగా ఓ రజతం, కాంస్యంతో మెరిసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఈసారి అంచనాలను అందుకోగలడా? లేదా? అనేది వేచి చూడాలి.

 

 స్క్వాష్

 స్టార్ ప్లేయర్లు దీపికా పల్లికాల్, జోష్న చినప్ప, సౌరవ్ ఘోశల్ బరిలో ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు.

 

 అథ్లెటిక్స్

 గతంలో ఈ విభాగంలో 2 స్వర్ణాలతో 12 పతకాలు సాధించిన భారత్... ఈసారి పతకాలు కోల్పోయే అవకాశాలున్నాయి. చాలా మంది ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు సరైన ఫామ్‌లో లేకపోవడం ప్రతికూలంగా మారింది. కృష్ణ పూనియా, సీమా పూనియా, వికాస్ గౌడ (డిస్కస్ త్రో), అర్పిందర్ సింగ్ (ట్రిపుల్ జంప్)లు పతకాలు తేవొచ్చు.

 

 షూటింగ్

 భారత్‌కు భారీగా పతకాలు వచ్చే విభాగంలో ఇదీ ఒకటి. 2010లో 14 స్వర్ణాలతో కలిపి మొత్తం 30 పతకాలు దక్కాయి. అయితే ఈసారి 18 ఈవెంట్స్‌ను తగ్గించి 19 విభాగాలకే పరిమితం చేశారు. 10మీ. ఎయిర్ రైఫిల్‌లో బింద్రా స్వర్ణంపై గురిపెట్టగా, 50మీ. రైఫిల్ ప్రోన్‌లో నారంగ్, 25మీ. ర్యాపిడ్ ఫైర్ పిస్టల్‌లో విజయ్ కుమార్, 10మీ. ఎయిర్ పిస్టల్‌లో హీనా సిద్ధు రూపంలో పతకాలు వచ్చే అవకాశాలున్నాయి.

 

 వెయిట్ లిఫ్టింగ్

 భారత లిఫ్టర్లు ఈసారి కూడా ఎనిమిది పతకాలు సాధించే అవకాశం ఉంది. ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు రవి కుమార్ (69కేజీ), సంగీతా చాను (48కేజీ) గత నెల రోజులుగా బర్మింగ్‌హామ్‌లో శిక్షణ పొందారు. రవికుమార్‌కు సహచరుడు సతీష్ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది.

 

 రెజ్లింగ్

 ఈ విభాగంలో భారత్‌కు ఈసారి ప్రతికూలతలు ఎదురుకానున్నాయి. క్రితంసారి రెజ్లింగ్‌లో భారత్ 19 పతకాలు సాధిస్తే... ఒక్క గ్రీకో రోమన్ విభాగంలోనే భారత్‌కు 7 పతకాలు దక్కాయి. ఇందులో 4 స్వర్ణాలున్నాయి. అయితే ఈసారి ఆ విభాగాన్ని తొలగించారు. సుశీల్ కుమార్ (74కేజీ), యోగేశ్వర్ (65కేజీ), రాజీవ్ తోమర్ (125కేజీ), అమిత్ కుమార్ (57కేజీ)పై అంచనాలు అధికంగా ఉండటంతో ఈసారి కనీసం 10 పతకాలను ఆశిస్తున్నారు.

 

 పారా స్పోర్ట్స్

 పురుషుల 50మీ. ఫ్రీస్టయిల్ స్విమ్మింగ్‌లో కాంస్యం గెలిచిన కర్మాకర్ ఈసారి కూడా పతకం రేసులో ఉన్నాడు. భారత ఆటగాళ్లు లాన్ బౌల్స్, జూడో, సైక్లింగ్, అక్వాటిక్స్‌లో కూడా  బరిలోకి దిగుతున్నారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top