‘బరువు’ పెరిగింది

‘బరువు’ పెరిగింది


వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకాల పంట

 పురుషుల హాకీ జట్టు బోణీ

 బ్యాడ్మింటన్‌లో జైత్రయాత్ర


 

కామన్వెల్త్ క్రీడల రెండో రోజు భారత షూటర్లు, వెయిట్ లిఫ్టర్లు పతకాలతో పరువు నిలబెట్టారు. న్యూఢిల్లీలో జరిగిన గత క్రీడలతో పోలిస్తే ఈసారి కాస్త జోరు తగ్గినా... ఓవరాల్‌గా తొలి రెండు రోజలు భారత క్రీడాకారుల ప్రదర్శన ఆశాజనకంగానే ఉంది.

 

 గ్లాస్గో:  కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో భారత లిఫ్టర్లు పతకాల పంట పండించారు. తొలి రెండు రోజుల్లో రెండు స్వర్ణాలతో కలిపి మొత్తం ఐదు పతకాలు గెలిచి సత్తా చాటారు. గురువారం అర్ధరాత్రి జరిగిన పురుషుల 56 కేజీల కేటగిరీలో సుకేన్ డే 248 (స్నాచ్ 109 + క్లీన్ అండ్ జర్క్ 139) కేజీల బరువు ఎత్తి స్వర్ణం గెలవగా, గణేశ్ మాలి 244 (స్నాచ్ 111 + క్లీన్ అండర్ జర్క్ 133) కేజీలతో కాంస్య పతకం దక్కించుకున్నాడు.




 మహిళల జూడో 63 కేజీల విభాగం కాంస్య పతక పోరులో సునీబాల హుడ్రోమ్... సాలీ కాన్‌వే (స్కాట్లాండ్) చేతిలో ఓడి పతకానికి దూరమైంది. రెప్‌చేజ్ రౌండ్‌లో ఆమె... మోనికా బార్గెస్ (కెనడా)పై నెగ్గి కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. గరిమా చౌదరీ (భారత్) క్వార్టర్స్ బౌట్‌లో క్లార్క్ (స్కాట్లాండ్) చేతిలో పరాజయం పాలైంది.




 బ్యాడ్మింటన్: మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. గ్రూప్-బి లీగ్ మ్యాచ్‌లో 5-0తో కెన్యాను చిత్తు చేసింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో శ్రీకాంత్-జ్వాల 21-8, 21-8తో మోబోగో-జోసెఫ్‌లపై; పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్ 21-7, 21-8తో విక్టర్ ముంగాపై; మహిళల సింగిల్స్‌లో పి.సి.తులసీ 21-4, 21-2తో లావినా మార్టిన్స్‌పై; పురుషుల డబుల్స్‌లో గురుసాయిదత్-ప్రణవ్ చోప్రా 21-5, 21-6తో జోసెఫ్ గితిటూ-మోబోగోపై; మహిళల డబుల్స్‌లో పి.వి.సింధు-జ్వాల 21-4, 21-5తో మార్టిన్స్-జోసెఫ్‌లపై గెలిచారు.

 

 

 పురుషుల బాక్సింగ్: సూపర్ హెవీ వెయిట్ (+91 కేజీ) ప్రిక్వార్టర్స్‌లో పర్వీన్ 0-3తో హెండర్సన్ (స్కాట్లాండ్) చేతిలో ఓడాడు.

 టేబుల్ టెన్నిస్: పురుషుల గ్రూప్ మ్యాచ్‌లో భారత్ 3-0తో గువానాపై గెలిచింది.

 స్విమ్మింగ్ 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్: సందీప్ సెజ్వాల్ సెమీస్‌కు అర్హత సాధించాడు. హీట్స్‌లో 1:02.97 సెకన్ల టైమింగ్‌తో 12వ స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా 16 మంది స్విమ్మర్లు సెమీస్‌కు చేరారు. మరోవైపు 200 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో సాజన్ ప్రకాశ్ 1:53.82 సెకన్ల టైమింగ్‌తో 22వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.

 

 సైక్లింగ్: భారత్ సైక్లిస్ట్‌ల నిరాశజనక ప్రదర్శన కొనసాగుతోంది. పురుషుల 4 వేల మీటర్ల వ్యక్తిగత పర్సుట్ విభాగంలో మంజిత్ సింగ్ (4:55.164 సెకన్లు) 16వ; సోంబీర్ (4:57.202 సెకన్లు) 17వ; అమిత్ కుమార్ (4:58.444 సెకన్లు) 18వ స్థానాల్లో నిలిచారు. మహిళల 3 వేల మీటర్ల వ్యక్తిగత పర్సుట్‌లో సునీతా ఎంగ్లమ్ (4:07.614 సెకన్లు) 17వ స్థానంతో సరిపెట్టుకుంది.

 

 స్క్వాష్: స్టార్ ప్లేయర్ జోష్న చిన్నప్పకు చుక్కెదురైంది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఆమె 3-11, 8-11, 11-8, 5-11తో మూడోసీడ్ జోలీ కింగ్ (న్యూజిలాండ్) చేతిలో ఓటమిపాలైంది. మహిళల ప్లేట్ రౌండ్‌లో ఆనక అలకమోని 3-0తో నడుని గుణవర్ధిని (శ్రీలంక)పై నెగ్గింది.




 హాకీలో బోణీ: పెనాల్టీ కార్నర్లతో విజృంభించిన భారత పురుషుల హాకీ జట్టు గేమ్స్‌లో శుభారంభం చేసింది. పూల్-ఏ ప్రిలిమినరి మ్యాచ్‌లో 3-1తో ప్రపంచ 31వ ర్యాంకర్ వేల్స్‌పై విజయం సాధించింది. రఘునాథ్ (20వ ని.), రూపిందర్ పాల్ సింగ్ (42వ ని.), గుర్విందర్ సింగ్ చండి (47వ ని.)లు భారత్‌కు గోల్స్ అందించారు. వేల్స్ తరఫున ఆండ్రూ కార్నిక్ (23వ ని.) ఏకైక గోల్ చేశాడు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top