అశ్విన్ ధాటికి విండీస్ మళ్లీ విలవిల!

అశ్విన్ ధాటికి విండీస్ మళ్లీ విలవిల!


రాణించిన భారత బౌలర్లు

విండీస్ తొలి ఇన్నింగ్స్‌ 196 ఆలౌట్


కింగ్‌స్టన్: వెస్టిండీస్‌తో శనివారం ప్రారంభమైన రెండో టెస్టు తొలి రోజు భారత బౌలర్లు అదరగొట్టారు. పిచ్‌పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకుంటూ బంతితో నిప్పులు కురిపించారు. దీంతో విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 52.3 ఓవర్లలో 196 పరుగులకు కుప్పకూలింది. విండీస్ ఆటగాళ్లలో బ్లాక్‌వుడ్ 62, శామ్యూల్స్ 37, కమ్మిన్స్ 24 పరుగులు చేశారు. భారత బౌలర్లలో అశ్విన్‌ 5 వికెట్లు పడగొట్టాడు. షమీ, ఇషాంత్ శర్మ చెరో రెండు వికెట్లు తీయగా, అమిత్ మిశ్రా ఒక వికెట్ తీశాడు.



భారత ఓపెనర్లు లోకేశ్ రాహుల్, శిఖర్ ధావన్ మంచి శుభారంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ధావన్ 52 బంతుల్లో 5 ఫోర్లతో 27 పరుగులు చేసి రోస్టన్ చేస్ బౌలింగ్‌లో బ్రావోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ లోకేశ్, పుజారా ధాటిగా ఆడుతున్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 126 పరుగులకు ఒక వికెట్ కోల్పోయింది. లోకేశ్ 114 బంతుల్లో 75 పరుగులు, పుజారా 57 బంతుల్లో 18 పరుగులతో నాటౌట్ గా క్రీజులో నిలిచారు.   



తొలుత బ్యాటింగ్ ఆరంభించిన విండీస్ ఆటగాళ్లు పరుగులు చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇషాంత్, షమీలు ఆరంభం నుంచే బంతితో చెలరేగారు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో ఇషాంత్ వరుస బంతుల్లో బ్రాత్‌వైట్(1), బ్రేవో (0)లను అవుట్ చేసి విండీస్‌కు షాకిచ్చాడు. ఆరో ఓవర్‌లో షమీ.. చంద్రికను వెనక్కి పంపడంతో విండీస్ 7 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 1983 తర్వాత భారత్‌పై ఏడు పరుగులలోపే తొలి మూడు వికెట్లు కోల్పోవడం వెస్టిండీస్‌కిదే తొలిసారి. భారత  పటిష్ట బౌలింగ్ దెబ్బకు విండీస్ ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top