చారిత్రక టెస్టులో భారత్ ఘన విజయం

చారిత్రక టెస్టులో భారత్ ఘన విజయం


భారత్ క్రికెట్ జట్టు చారిత్రాత్మక 500వ టెస్టు మ్యాచ్ ను కనీసం డ్రాతో ముగిద్దామని న్యూజిలాండ్ శతవిధాలా ప్రయత్నించింది. ప్రత్యేకంగా గ్రీన్ పార్క్ స్టేడియంలో గోడ కట్టిన ఆటను కొనసాగించాలనుకుంది. చివరి రోజు ఆటకు ఆరు వికెట్లు న్యూజిలాండ్ చేతిలో ఉండటంతో ఆ జట్టు  కాస్త ధీమాగా ఉంది. అయితే ఆఖరి రోజు ఆట తొలి సెషన్లో భారత బౌలర్లు పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ప్రత్యేకంగా ఈ సెషన్ లో రవీంద్ర జడేజా ఒక వికెట్ తీస్తే, పేసర్ మొహ్మద్ షమీ రెండు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు తీసి కివీస్ను చావు దెబ్బకొట్టాడు. దాంతో న్యూజిలాండ్ కు ఘోర పరాజయానికి స్వాగతం పలకగా, భారత్ 'చారిత్రక' విజయం సాధించింది.





కాన్పూర్: 434 పరుగుల లక్ష్యంగా 93/4 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్కు ఆరంభంలోనే తడబడింది. కివీస్ టాపార్డర్ ఆటగాడు ల్యూక్ రోంచీ(80; 120 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) ఐదో వికెట్ గా వెనుదిరిగాడు. రోంచీ నిలకడగా ఆడుతున్న సమయంలో రవీంద్ర జడేజా వేసిన చక్కటి బంతికి బోల్తా పడ్డాడు. ఆ తరువాత వాట్లింగ్(18), క్రెయిగ్(1)లను భారత ప్రధాన ఆయుధం మొహ్మద్ షమీ చేతికి చిక్కారు. వాట్లింగ్ ను ఎల్బీడబ్యూగా పెవిలియన్ కు పంపగా, ఆ తరువాతి ఓవర్ తొలి బంతికి క్రెయిగ్ బౌల్డ్ అయ్యాడు. కాగా, సాంట్నార్(71; 7ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతాయుతంగా ఆడినా జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. సాంట్నార్ ఎనిమిదో వికెట్ గా అవుటైన తరువాత మిగిలిన ఇద్దరి ఆటగాళ్లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ కు చేరారు. దాంతో కివీస్ 236 పరుగులకే చాపచుట్టేయడంతో భారత్కు 197 పరుగుల భారీ విజయం దక్కింది. భారత బౌలర్లలో అశ్విన్ ఆరు వికెట్లు సాధించి కివీస్ ఇన్నింగ్స్ ను చెల్లాచెదురు చేయగా, షమీకి రెండు, జడేజాకు ఒక వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ లో అటు బౌలింగ్ లోనూ, ఇటు బ్యాటింగ్ లోనూ రాణించిన రవీంద్ర జడేజాకు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కింది.

 



భారీ భాగస్వామ్యం



చివరి రోజు ఆటను కొనసాగించిన న్యూజిలాండ్ కు రోంచీ-సాంట్నార్లు మరమ్మత్తులు చేపట్టారు.  భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. దాదాపు 36.0ఓవర్లు పాటు క్రీజ్లో నిలుచుని 102 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే  రెండో ఇన్నింగ్స్ 58.0 ఓవర్ ను అందుకున్న జడేజా ఊరించే బంతితో రోంచీని పెవిలియన్ కు పంపాడు. కాస్త నెమ్మదిగా ఫుల్ టాస్గా వేసిన బంతిని రోంచీ మిడ్ వికెట్ మీదుగా షాట్ ఆడే యత్నం చేశాడు. అయితే ఆ బంతి అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకుని పాయింట్ లో ఫీల్డింగ్ చేస్తున్న అశ్విన్ చేతికి చిక్కింది. దాంతో రోంచీ-సాంట్నార్ల భాగస్వామ్యానికి తెరపడింది.







భారత తొలి ఇన్నింగ్స్  318 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 377/5 డిక్లేర్



న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 262 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 236 ఆలౌట్



 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top