'విరాట్పైనే ఆధారపడకండి'

'విరాట్పైనే ఆధారపడకండి'


కోల్కతా: ఇటీవల కాలంలో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి పొగడ్తలు కురిపించాడు. దాదాపు టీమిండియా గెలిచిన ప్రతీసారి విరాట్ కోహ్లి శతకం అనేది సర్వసాధారణంగా మారిపోయిందని గంగూలీ కొనియాడాడు. అందుకే విరాట్ ఒక గొప్ప ఆటగాడు అయ్యాడంటూ ప్రశంసలు కురిపించాడు. కాకపోతే ప్రతీ గేమ్లోనూ విరాట్పైనే ఆధారపడటం సరైన పద్ధతి కాదని టీమిండియా ఆటగాళ్లకు సూచించాడు.



'గత కొంతకాలంగా భారత క్రికెట్ జట్టు విరాట్పైనే ఆధారపడుతుంది అనడానికి అతని ఆడిన ఇన్నింగ్సే ఉదాహరణ. ప్రత్యేకంగా ఛేజింగ్లో విరాట్ మెరుగైన రికార్డును సొంతం చేసుకోవడమే కాకుండా, జట్టుకు కీలక విజయాల్ని అందిస్తున్నాడు. మన బ్యాటింగ్ లైనప్లో విరాట్పైనే పూర్తిగా ఆధారపడటం ఎంతమాత్రం సమంజసం కాదు. భారత జట్టులో చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారని అనుకుంటున్నా. న్యూజిలాండ్ తో ఐదు వన్డేల సిరీస్లో విరాట్ కోహ్లినే రెండు మ్యాచ్ ఫినిషింగ్ ఇన్నింగ్స్లు ఆడాడు. మొహాలీలో జరిగిన మూడో వన్డేలో విరాట్ క్యాచ్ను రాస్ టేలర్ వదిలేశాడు. ఒకవేళ ఆ క్యాచ్ను పట్టి ఉంటే భారత జట్టులోని మిగతా ఆటగాళ్లు ఏం చేసేవారో నాకైతే తెలీదు. అంతా సమష్టిగా పోరాడి విజయం కోసం కృషి చేస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయి' అని గంగూలీ తెలిపాడు.


 


ఈ సిరీస్లో ఇంకా రోహిత్ శర్మ గాడిలో పడలేదనే విషయం వాస్తవమన్నాడు. అయితే నిన్నటి మ్యాచ్లో అక్షర్ పటేల్ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు తీసుకురావడం తప్పుకాదని గంగూలీ తెలిపాడు. కుడి చేతి, ఎడమ చేతి ఆటగాళ్లు క్రీజ్లో ఉంటే ఈ తరహా వికెట్పై స్టైక్ రొటేట్ చేయడం సులభం అవుతుందనే కారణంగానే అలా చేసి ఉండవచ్చవన్నాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top