వానొచ్చె... మ్యాచ్ పోయె...

వానొచ్చె... మ్యాచ్ పోయె...


వర్షంతో రెండో టి20 రద్దు

సిరీస్ 1-0తో విండీస్ కైవసం





తొలి మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో ఓడిన భారత జట్టుకు సిరీస్ సమం చేసేందుకు వచ్చిన అవకాశాన్ని వరుణుడు అడ్డుకున్నాడు. చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే అవుట్ చేసిన ఆనందం అంతా రెండో ఇన్నింగ్స్ ఆరంభం కాగానే ‘నీరు’గారిపోయింది. గెలిచేందుకు అవకాశం ఉన్న మ్యాచ్ వర్షార్పణం కావడంతో టీమిండియాకు నిరాశే ఎదురైంది. సిరీస్ కోల్పోవడంతో పాటు ర్యాంకింగ్స్‌లో కూడా మన జట్టు ఒక మెట్టు దిగజారనుండగా... అభిమానులకూ అమెరికాలో ఆట చూసిన ఆనందం ఒక్క మ్యాచ్‌కే పరిమితమైంది.


లాడర్‌హిల్ (ఫ్లోరిడా): భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఆదివారం రెండో టి20 మ్యాచ్ వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దయింది. 144 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 2 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 15 పరుగులు చేసిన దశలో వాన పడింది. దాంతో దాదాపు గంటకు పైగా మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో పాటు సూపర్ సాపర్లు కూడా అందుబాటులో లేకపోవడంతో అవుట్‌ఫీల్డ్ మొత్తం నీటితో నిండిపోయింది. వర్షం ఆగిపోయిన తర్వాత అంపైర్లు మైదానాన్ని పరిశీలించారు. ఎక్కువ భాగం పొడిగా మారినా... పిచ్ సమీపంలో, 30 గజాల వృత్తం లోపల నీరు అలాగే ఉండిపోయింది. దీని వల్ల ఆటగాళ్లకు ప్రమాదమని తేల్చిన అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మ్యాచ్ ఆరంభానికి ముందు సాంకేతిక కారణాలతో 40 నిమిషాలు ఆలస్యం కావడం కూడా చివరికి ప్రభావం చూపించింది.




అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 19.4 ఓవర్లలో 143 పరుగులకే ఆలౌటైంది. జాన్సన్ చార్లెస్ (25 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్సర్లు ) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో అమిత్ మిశ్రా 3 వికెట్లు పడగొట్టగా, అశ్విన్, బుమ్రా, షమీ తలా 2 వికెట్లు తీశారు. తొలి మ్యాచ్‌ను నెగ్గిన విండీస్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0తో సొంతం చేసుకుంది.


 

చార్లెస్ మినహా...


24 గంటల్లోనే ఎంత మార్పు... అడ్డూ అదుపు లేకుండా పరుగుల వరద పారించిన మైదానంలోనే విండీస్ బ్యాట్స్‌మెన్ షాట్లు కొట్టలేక అల్లాడిపోయారు. ముందు రోజు లెక్కకు మిక్కిలి పరుగులిచ్చేసిన మన బౌలర్లు ఈసారి అద్భుత బంతులు వేసి పొదుపు పాటించారు! గత మ్యాచ్ హీరో లూయీస్ (7)ను షమీ చక్కటి బంతితో అవుట్ చేసి జట్టుకు శుభారంభం అందించగా, మరో ఓపెనర్ చార్లెస్ మాత్రం ధాటిని ప్రదర్శించాడు. షమీ ఓవర్లో అతను వరుస బంతుల్లో సిక్స్, రెండు ఫోర్లు బాది మొత్తం 15 పరుగులు రాబట్టాడు. అయితే మిశ్రా తన తొలి బంతికే చార్లెస్‌ను వెనక్కి పంపడంతో విండీస్ పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత ఒక్కరు కూడా క్రీజ్‌లో నిలబడలేకపోయారు. అశ్విన్, జడేజా బౌలింగ్‌లో బ్యాట్స్‌మెన్ పరుగులు తీయడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అశ్విన్ వైడ్ బంతిని ఆడబోయి సిమన్స్ (19) స్టంపౌట్ కాగా... తర్వాతి ఓవర్లో శామ్యూల్స్ (5) వెనుదిరిగాడు. అనంతరం వరుస ఓవర్లలో పొలార్డ్ (13), ఫ్లెచర్ (3) కూడా అవుటయ్యారు. బ్రేవో (3), బ్రాత్‌వైట్ (18)లను మిశ్రా డగౌట్ చేర్చగా, రసెల్ (13)ను భువీ అవుట్ చేశాడు. రెండో టి20 కోసం భారత్ బిన్నీ స్థానంలో మిశ్రాకు తుది జట్టులో చోటివ్వగా, విండీస్ మార్పులు లేకుండానే బరిలోకి దిగింది.




స్కోరు వివరాలు

వెస్టిండీస్ ఇన్నింగ్స్: చార్లెస్ (సి) రహానే (బి) మిశ్రా 43; లూయీస్ (సి) మిశ్రా (బి) షమీ 7; శామ్యూల్స్ (సి) ధోని (బి) బుమ్రా 5; సిమన్స్ (స్టంప్డ్) ధోని (బి) అశ్విన్ 19; ఫ్లెచర్ (బి) బుమ్రా 3; పొ లార్డ్ (ఎల్బీ) (బి) అశ్విన్ 13; రసెల్ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్ 13; బ్రేవో (బి) మిశ్రా 3; బ్రాత్‌వైట్ (బి) మిశ్రా 18; నరైన్ (నాటౌట్) 9; బద్రీ (బి) షమీ 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్) 143. వికెట్ల పతనం: 1-24; 2-50; 3-76; 4-76; 5-92; 6-98; 7-111; 8-123; 9-133; 10-143.


బౌలింగ్: భువనేశ్వర్ 4-0-36-1; షమీ 2.4-0-31-2; మిశ్రా 4-0-24-3; జడేజా 2-0-11-0; అశ్విన్ 3-0-11-2; బుమ్రా 4-0-26-2.

భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (నాటౌట్) 10; రహానే (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 15.

బౌలింగ్: రసెల్ 1-0-7-0; బద్రీ 1-0-7-0.


 


200

అంతర్జాతీయ, దేశవాళీ టి20 మ్యాచ్‌లు కలిపి అశ్విన్ పడగొట్టిన వికెట్ల సంఖ్య. 200 వికెట్ల క్లబ్‌లో చేరిన మొదటి భారత బౌలర్ అశ్విన్ కాగా, మిశ్రా (199) తర్వాతి స్థానంలో ఉన్నాడు.


 


అప్పుడు నోబాల్, ఇప్పుడు వైడ్ బాల్...

వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అశ్విన్ వేసిన ‘నోబాల్’ కారణంగానే బతికిపోయిన సిమన్స్ ఆ తర్వాత భారత్‌ను ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. అది చాలా రోజులు అశ్విన్‌ను వెంటాడింది. తాజా సిరీస్ తొలి మ్యాచ్‌లో అశ్విన్‌ను ఎదుర్కొనే అవకాశం సిమన్స్‌కు రాలేదు. ఈ మ్యాచ్‌లో వీరిద్దరు మరోసారి ఎదురెదురుగా తలపడ్డారు. అశ్విన్ మొదటి బంతిని సింగిల్ తీసిన అతను రెండో బంతికే అవుటయ్యాడు. ముందుకు దూసుకొస్తున్న సిమన్స్‌ను గుర్తించి అశ్విన్ లెగ్‌సైడ్ బంతిని విసిరాడు. తడబాటులో ప్యాడ్‌తో అడ్డుకునే ప్రయత్నం చేసి జారిన సిమన్స్ వెనక్కి రాలేకపోయాడు. ‘వైడ్’ బంతికి ధోని చక్కగా స్టంపింగ్ చేయడంతో సిమన్స్ ఆట ముగిసింది. సిమన్స్‌ను ఇక వెళ్లిపో అన్నట్లుగా సైగ చేస్తూ అశ్విన్ సెండాఫ్ ఇచ్చి తన ఆనందాన్ని ప్రదర్శించాడు!


 


 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top