ఆధిక్యమే... అయినా!

ఆధిక్యమే... అయినా!


 రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 21/3



♦ శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 201 ఆలౌట్

♦ కోహ్లి సేనకు 111 పరుగుల ఆధిక్యం

♦ ఇషాంత్ శర్మకు 5 వికెట్లు

 

 మూడో టెస్టు ముచ్చటగా మూడో రోజు మూడు మలుపులు తీసుకుంది. భారత పేసర్ల ధాటికి విలవిల్లాడిన శ్రీలంక ఒక దశలో 47 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. అయితే కుషాల్, హెరాత్ పోరాటం ఆ జట్టును కొంత వరకు కాపాడింది. వందకు పైగా ఆధిక్యం సంపాదించామన్న భారత్ ఆనందం అరగంటలోనే ఆవిరైంది. ఆరు ఓవర్లలోపే మూడు కీలక వికెట్లు కోల్పోయి ఆందోళన పెంచిన టీమిండియా, వర్షం రాకతో కాస్త తెరిపిన పడింది. ప్రస్తుతం పరిస్థితి సమంగా కనిపిస్తున్నా, మొగ్గు కోహ్లి సేన వైపే ఉంది. మన బ్యాటింగ్ బలగం, ప్రత్యర్థి బ్యాటింగ్ బలహీనత చూస్తే నాలుగో రోజు సాధారణ లక్ష్యం నిర్దేశించినా... భారత్ విజయానికి బాట పడుతుంది.

 

 కొలంబో : భారత్, శ్రీలంక మూడో టెస్టు ఒక్కసారిగా ఆసక్తికరంగా మారిపోయింది. ఇక్కడి సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆదివారం మొత్తం 15 వికెట్లు నేలకూలాయి. ఇందులో సింహభాగం ఇరు జట్ల పేసర్లు పంచుకున్నారు. మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసింది. పుజారా (0), రాహుల్ (2), రహానే (4) పెవిలియన్ చేరగా... రోహిత్ శర్మ (14 బ్యాటింగ్), కోహ్లి (1 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 111 పరుగుల ఆధిక్యం అందుకున్న టీమిండియా ప్రస్తుతం 132 పరుగులు ముందంజలో ఉంది.



  అంతకుముందు 312 పరుగుల వద్ద భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక పేలవ ఆటతీరు కనబర్చింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 201 పరుగులకే ఆలౌటైంది. కుషాల్ పెరీరా (56 బంతుల్లో 55; 9 ఫోర్లు), రంగన హెరాత్ (84 బంతుల్లో 49; 8 ఫోర్లు) ఏడో వికెట్‌కు 79 పరుగులు జోడించడం మినహా మిగతా ఆటగాళ్లంత విఫలమయ్యారు. ఇషాంత్ శర్మ (5/54) చెలరేగి ఐదు వికెట్లు పడగొట్టగా... స్టువర్ట్ బిన్నీ, అమిత్ మిశ్రా చెరో 2 వికెట్లు తీశారు. వర్షం మూడో రోజు ఆటకు కూడా అంతరాయం కలిగించింది. మూడో రోజు కనీసం 23 ఓవర్ల ఆట మిగిలి ఉన్న దశలో వాన రావడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు.



 స్కోరు వివరాలు

 భారత్ తొలి ఇన్నింగ్స్ 312; శ్రీలంక తొలి ఇన్నింగ్స్: తరంగ (సి) రాహుల్ (బి) ఇషాంత్ 4; సిల్వ (బి) ఉమేశ్ 3; కరుణరత్నే (సి) రాహుల్ (బి) బిన్నీ 11; చండీమల్ (ఎల్బీ) బిన్నీ 23; మ్యాథ్యూస్ (సి) ఓజా (బి) ఇషాంత్ 1; తిరిమన్నె (సి) రాహుల్ (బి) ఇషాంత్ 3; పెరీరా (సి) కోహ్లి (బి) ఇషాంత్ 55; ప్రసాద్ (స్టంప్డ్) ఓజా (బి) మిశ్రా 27; హెరాత్ (సి) ఓజా (బి) ఇషాంత్ 49; కౌశల్ (ఎల్బీ) (బి) మిశ్రా 16; ప్రదీప్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (52.2 ఓవర్లలో ఆలౌట్) 201.

 వికెట్ల పతనం: 1-11; 2-11; 3-40; 4-45; 5-47; 6-47; 7-127; 8-156; 9-183; 10-201.

 బౌలింగ్: ఇషాంత్ 15-2-54-5; ఉమేశ్ 13-2-64-1; బిన్నీ 9-3-24-2; అశ్విన్ 8-1-33-0; మిశ్రా 7.2-1-25-2.



 భారత్ రెండో ఇన్నింగ్స్: పుజారా (బి) ప్రసాద్ 0; రాహుల్ (బి) ప్రదీప్ 2; రహానే (ఎల్బీ) (బి) ప్రదీప్ 4; కోహ్లి (బ్యాటింగ్) 1; రోహిత్ (బ్యాటింగ్) 14; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (8.1 ఓవర్లలో 3 వికెట్లకు) 21.

 వికెట్ల పతనం: 1-0; 2-2; 3-7.

 బౌలింగ్: ప్రసాద్ 4.1-2-8-1; ప్రదీప్ 3-1-6-2; హెరాత్ 1-0-7-0.

 

 1   శ్రీలంక గడ్డపై భారత పేస్ బౌలర్లలో ఇషాంత్ (5/54)దే అత్యుత్తమ ప్రదర్శన

 4   గవాస్కర్, సెహ్వాగ్, ద్రవిడ్ తర్వాత ఓపెనర్‌గా వచ్చి నాటౌట్‌గా నిలిచిన నాలుగో భారత ఆటగాడు పుజారా. అయితే ప్రపంచ క్రికెట్‌లో ఒక టెస్టులో ఇలా చివరి వరకు ఆడి మరో  ఇన్నింగ్స్‌లో డకౌటైన నాలుగో ఆటగాడు కూడా పుజారానే.

 

 తొలి సెషన్ : టపటపా

  ఓవర్‌నైట్ స్కోరు 292/8తో ఆట ప్రారంభించిన భారత్ 34 బంతుల్లో మరో 20 పరుగులు జోడించి ఆలౌటైంది. ఇషాంత్ (6), ఉమేశ్ (4)లను హెరాత్ బౌల్డ్ చేశా డు. మరోవైపు పుజారా (145 నాటౌట్) ఓపెనర్‌గా వచ్చి చివరి వరకు నాటౌట్‌గా నిలిచిన నాలుగో భారత బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. లంక పేస్‌కు తడబడిన భారత్, అదే వ్యూహాన్ని లంకపై కూడా అమలు చేసింది. ఇషాంత్ ముందుండి నడిపించగా బిన్నీ, ఉమేశ్ అతడిని అనుసరించారు. తొలి ఓవర్లోనే మూడు నోబాల్స్ వేసిన ఇషాంత్ నాలుగో బంతికి తరంగ (4)ను అవుట్ చేసే అవకాశం వచ్చినా స్లిప్‌లో రాహుల్ క్యాచ్ వదిలేశాడు. అయితే ఐదో ఓవర్లో ఇదే తరహాలో ఇషాంత్ బౌలింగ్‌లో తరంగ ఇచ్చిన క్యాచ్‌ను రాహుల్ అందుకున్నాడు. మరుసటి ఓవర్లోనే సిల్వ (3)ను ఉమేశ్ క్లీన్‌బౌల్డ్ చేశాడు.  చండీమల్ (23; 5 ఫోర్లు) బిన్నీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తర్వాత మ్యాథ్యూస్(1), కరుణరత్నే(11) కూడా విఫలమయ్యారు.

 

 ఓవర్లు: 5.4, పరుగులు: 20, వికెట్లు: 2 (భారత్)  -  ఓవర్లు: 18, పరుగులు: 47, వికెట్లు: 5 (శ్రీలంక)

 

 రెండో సెషన్: కీలక భాగస్వామ్యం

 లంచ్ తర్వాత రెండో బంతికి తిరిమన్నె (0) అవుట్ కావడంతో లంక కష్టాలు మరింత పెరిగాయి. తర్వాతి బంతి చేతికి తగలడంతో ప్రసాద్ రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. ఈ దశలో తొలి టెస్టు ఆడుతున్న కుషాల్ పెరీరా, హెరాత్ జత కలిశారు. వీరిద్దరు జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. 9 పరుగుల వద్ద స్లిప్‌లో రాహుల్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన కుషాల్ ఈ క్రమంలో 49 బంతుల్లోనే  అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రెండో రోజు మిశ్రా తరహాలో ప్రధాన బ్యాట్స్‌మన్‌కు హెరాత్ అండగా నిలిచాడు. చివరకు ఇషాంత్ బౌలింగ్‌లో పుల్ షాట్ ఆడబోయి కుషాల్ అవుట్ కావడంతో ఈ భాగస్వామ్యానికి తెర పడింది.

 ఓవర్లు: 30, పరుగులు: 128, వికెట్లు: 3 (శ్రీలంక)

 

 మూడో సెషన్:  భారత్ తడబాటు

  విరామం అనంతరం రెండో ఓవర్లోనే ఇషాంత్, హెరాత్‌ను అవుట్ చేశాడు. అయితే కట్టుతో తిరిగొచ్చిన ప్రసాద్ (27; 4 ఫోర్లు) కొద్దిగా పోరాడటంతో లంక స్కోరు 200 పరుగులు దాటింది. మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ప్రసాద్ స్టంపౌంట్ కావడంతో లంక ఇన్నింగ్స్ ముగిసింది. 47 పరుగులకు తొలి 5 వికెట్లు తీసిన భారత్, చివరి 5 వికెట్లకు 154 పరుగులు ఇచ్చింది. సిరీస్‌లో తొలి ఓవర్లోనే వికెట్ తీస్తూ వస్తున్న తన రికార్డును కొనసాగిస్తూ ప్రసాద్ మరోసారి చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాటౌట్‌గా నిలిచిన పుజారా (0)ను రెండో బంతికే క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ప్రదీప్ భారత్‌ను దెబ్బ తీశాడు.



తొలి ఇన్నింగ్స్ తరహాలోనే మరోసారి షాట్ ఆడకుండా చేతులెత్తేసిన రాహుల్ (2) మళ్లీ క్లీన్‌బౌల్డ్ కాగా, గత ఇన్నింగ్స్ ‘రీప్లే’ చూపిస్తూ రహానే (4) ఎల్బీగా వెనుదిరిగాడు. స్కోరు 7/3కి చేరిన ఈ దశలో కోహ్లి, రోహిత్ మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్త పడ్డారు. ఈ సమయంలో వర్షంతో మ్యాచ్ ఆగిపోయింది.

 ఓవర్లు: 4.2, పరుగులు: 26, వికెట్లు: 2 (శ్రీలంక)  -  ఓవర్లు: 8.1, పరుగులు: 21, వికెట్లు: 3 (భారత్)

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top