2 రోజులు.. రూ. 24 కోట్లు

2 రోజులు.. రూ. 24 కోట్లు


ఐఎస్‌ఎల్‌లో పూర్తయిన దేశవాళీ ఆటగాళ్ల ఎంపిక

అత్యధికంగా ఖర్చు చేసిన కోల్‌కతా


 

 ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో ఆడే దేశవాళీ ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు రూ.24 కోట్లు ఖర్చు చేశాయి. రిలయన్స్, ఐఎంజీ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌లో మొదలయ్యే ఈ టోర్నీ కోసం రెండు రోజుల పాటు ముంబైలో నిర్వహించిన డ్రాఫ్ట్ పద్ధతి ద్వారా ఫ్రాంచైజీలు 84 మంది ఫుట్‌బాలర్లను ఎంపిక చేసుకున్నాయి. 8ఫ్రాంచైజీల్లో అట్లెటికో డి కోల్‌కతా అత్యధికంగా రూ. 3.91 కోట్లతో ఆటగాళ్లతో ఒప్పందం చేసుకుంది. ముంబై రూ. 3.76, కేరళ బ్లాస్టర్స్ రూ. 3.31, పుణె రూ. 3.19, బెంగళూరు రూ. 3.04, ఢిల్లీ డైనమోస్ రూ. 2.81 కోట్లను ఆటగాళ్ల కోసం వెచ్చించాయి. గోవా, నార్త్‌ఈస్ట్ యునెటైడ్ ఫుట్‌బాల్ క్లబ్ ఫ్రాంచైజీలు కలిపి రూ. 3.98 కోట్లతో ఆటగాళ్లను సొంతం చేసుకున్నాయి.

 

 సీనియర్ల కోసం పోటాపోటీ

 అనుభవం ఉన్న భారత ఆటగాళ్లు సందీప్ నంది,  లారెన్స్, ఎన్.పి. ప్రదీప్, స్టీవెన్ డయాస్‌లను ఎంపిక చేసుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. భారత మాజీ గోల్ కీపర్ సందీప్ నందిని కేరళ బ్లాస్టర్స్ దక్కించుకుంది. మిడ్ ఫీల్డర్లు లారెన్స్, డయాస్, ప్రదీప్‌లతో వరుసగా అట్లెటికో డి కోల్‌కతా, ఢిల్లీ డైనమోస్, బెంగళూరు ఫ్రాంచైజీలు ఒప్పందాలు చేసుకున్నాయి. గోవా, నార్త్‌ఈస్ట్ యునెటైడ్ ఫుట్‌బాల్ క్లబ్‌లు తాము ఇది వరకే ఒప్పందం చేసుకున్న ప్లేయర్లను డ్రాఫ్ట్ ద్వారా సొంతం చేసుకున్నాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ డ్రాఫ్ట్ ద్వారా మొత్తం 84 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకున్నాయి. ఇందులో 30 మంది కాంట్రాక్ట్ ప్లేయర్లు, నాలుగు ఐ లీగ్ క్లబ్‌కు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. ఐఎస్‌ఎల్‌లో ఎవరైనా గాయాల బారిన పడితే వారి స్థానాల్ని భర్తీ చేసేందుకు అదనంగా ఏడుగురిని నిర్వాహకులు సెంట్రల్ రిజర్వ్ పూల్‌లో ఉంచారు. ఇక వచ్చే నెల్లో విదేశీ ఆటగాళ్ల ఎంపిక జరగనుంది. సెప్టెంబర్ 19 నుంచి డిసెంబర్ 7 మధ్య టోర్నీ నిర్వహించే అవకాశాలున్నాయి. షెడ్యూల్‌ను త్వరలోనే ఐఎస్‌ఎల్ నిర్వాహకులు ఖరారు చేయనున్నారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top