అదే ‘స్ఫూర్తి’ కావాలి!

అదే ‘స్ఫూర్తి’ కావాలి!


ఇంగ్లండ్‌తో టెస్టుల్లో ఎదురైంది అవమానకర ఓటమే. గతంలో ఎన్నడూ చూడని పరాభవమే కావచ్చు... కానీ అడుగులు అక్కడే ఆగిపోవుగా! పడిన ప్రతీ సారి పైకి లేచేందుకు కూడా ఆటలో మరో అవకాశం ఉంటుంది. అణువణువునా ఆత్మవిశ్వాసం లోపించిన భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌తో టెస్టుల్లో మట్టికరిచింది గాక... కానీ ఉస్సురని కూలిపోకుండా ఉవ్వెత్తున లేచేందుకు, మన బలం, బలగం చాటేందుకు మళ్లీ సన్నద్ధమవ్వాలి. వన్డేలకు జట్టూ మారింది... ఆపై అండగా నిలిచేందుకు కొత్త సహాయక సిబ్బందీ రానున్నారు. అన్నట్లు...ఇంగ్లండ్ గడ్డపై ఆఖరి సారి వన్డేలు ఆడినప్పుడు మనమే చాంపియన్స్ ట్రోఫీ చాంపియన్లం. జట్టులో కొత్త ఉత్సాహం నింపేందుకు నాటి ప్రదర్శన స్ఫూర్తి సరిపోదా!



ఏడాది క్రితం ఇంగ్లండ్‌లోనే జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లోనూ ఎక్కడా ఉదాసీనత కనబర్చకుండా ప్రత్యర్థిపై ఆధిక్యం ప్రదర్శించింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, శ్రీలంక...ఇలా ప్రతి పటిష్ట జట్టును ఓడించింది. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్ అయితే అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఒక దశలో గెలుపు అవకాశాలు లేకున్నా... పట్టుదలతో భారత జట్టు విజయాన్ని అందుకుంది. అప్పుడు కూడా ఇంగ్లండ్‌లో సీమర్లకు అనుకూలించే వాతావరణంలో భారత జట్టు టైటిల్ గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ మనవాళ్లు సమష్టి ప్రదర్శనతో సంచలనం నమోదు చేశారు.

 

వాళ్లలో తొమ్మిదిమంది...

నాటి జట్టులో ఉన్న తొమ్మిది మంది ఆటగాళ్లు ప్రస్తుతం ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో కూడా ఉన్నారు. చాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో వారు, వీరని లేకుండా ఆటగాళ్లంతా కీలక పాత్ర పోషించారు. 2 సెంచరీలు సహా 363 పరుగులు చేసి ధావన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకుంటే... కోహ్లి, రోహిత్ శర్మ నిలకడైన ఆటతీరుతో అతనికి అండగా నిలిచారు. ఇక ఇంగ్లండ్ వికెట్లపై కూడా స్పిన్‌తో విజయాలు దక్కుతాయని జడేజా నిరూపించాడు. కేవలం 12.83 సగటుతో అతను 12 వికెట్లు తీశాడు. ఇక ఆరంభ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తూ భువనేశ్వర్ విజయానికి బాటలు వేశాడు.



వీరంతా ఇప్పుడు వన్డే సిరీస్‌లో అప్పటి ప్రదర్శనను పునరావృతం చేయాల్సి ఉంది. రైనా రాకతో వన్డే బ్యాటింగ్ పటిష్టంగా మారిందనడంలో సందేహం లేదు. రహానే, రాయుడు కూడా మిడిలార్డర్‌లో తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. మరో వైపు వన్డే వరల్డ్ కప్‌కు ఎక్కువగా సమయం లేదు.  ఇంగ్లండ్‌లోని పరిస్థితుల్లో ఈ సిరీస్‌లో రాణించే ఆటగాళ్లకే ఆస్ట్రేలియాలో జరిగే ప్రపంచకప్‌లో చోటు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి శామ్సన్, కరణ్ శర్మలాంటి ఆటగాళ్లు కూడా తమ సామర్థ్యం నిరూపించుకోవాలని పట్టుదలగా ఉన్నారు.

 

వన్డే వ్యూహాల్లో దిట్ట

టెస్టు కెప్టెన్సీ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా... ధోని వన్డే కెప్టెన్సీ మాత్రం అద్భుతం అనేది అందరూ అంగీకరించాల్సిందే. ఏ దశలోనూ గెలుపు అవకాశం లేని స్థితినుంచి జట్టును విజయం వైపు మళ్లించడం ధోనికి వెన్నతో పెట్టిన విద్య. క్లిష్ట పరిస్థితుల్లో అతడి వ్యూహాలే జట్టును నిలబెడతాయి. ఒక్కసారి చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను గుర్తు చేసుకుంటే చాలు అతనేమిటో తెలుస్తుంది. 3 ఓవర్లలో 27 పరుగులిచ్చిన ఇషాంత్‌తో 18వ ఓవర్ వేయించడం... అదే ఓవర్లో 2 వికెట్లతో మ్యాచ్ భారత్ వైపు మళ్లించడం ధోనికే సాధ్యమైంది. కెప్టెన్సీనే కాకుండా ధోని ధనాధన్ బ్యాటింగ్ కూడా జట్టుకు బలం. 2011 సిరీస్‌లో వన్డేల్లోనూ మనకు ఒక్క విజయం కూడా దక్కలేదు. అయితే ఈ సారి గత రికార్డును సవరించాలని ధోని భావిస్తున్నాడు.  కాబట్టి టెస్టు సిరీస్‌తో పోలిస్తే కెప్టెన్‌నుంచి మరింత మెరుగైన ఫలితాన్ని ఆశించవచ్చు.

 

శాస్త్రి బృందం ఏం చేయనుంది..?

అంతర్జాతీయ క్రికెట్‌నుంచి రిటైర్ అయిన వెంటనే రవిశాస్త్రి... తాను కామెంటేటర్‌గా మారనున్నట్లు, రెండేళ్లలో అగ్రశ్రేణి వ్యాఖ్యాతగా నిలబడతానని తన సహచరులతో చాలెంజ్ చేశాడు. పట్టుదలతో అతను దానిని చేసి చూపించాడు. క్రికెట్ ఆడే సమయంలోనూ భారత జట్టులో ‘మానసికంగా దృఢమైన’ వ్యక్తిగా శాస్త్రికి పేరుంది.  రవిశాస్త్రి భారత డెరైక్టర్ పాత్ర నిర్వహించేందుకు సమర్థుడు అని అందరూ అంగీకరిస్తున్నారు. ఇప్పుడు జట్టులో ఆటగాళ్ల ప్రతిభను బట్టి చూస్తే పెద్దగా సమస్య లేదు. ఆటగాళ్లతో సంభాషిస్తూ వారి బలాలు, బలహీనతలు గుర్తించి వన్డేలకు తగిన విధంగా మలచడం శాస్త్రిలాంటి సీనియర్‌కు సమస్య కాకపోవచ్చు.



అయితే భారీ ఓటమినుంచి వారిని విజయాల బాట పట్టించాలంటే మానసికంగా ఆటగాళ్లలో స్ఫూర్తి నింపాల్సి ఉంది. ఈ సమయంలో సంజయ్ బంగర్ సహకారం కూడా కీలకం కానుంది. ఐపీఎల్‌లో పంజాబ్ ఒక్కసారిగా దూసుకు రావడానికి... క్రెడిట్ మొత్తం బంగర్‌దే. మార్పుల తర్వాతైనా టెస్టు పరాజయాలు మరచిపోయే విధంగా భారత్ వన్డేల్లో విజయాలతో అభిమానులను అలరించాలని, తిరిగి గాడిలో పడి ప్రపంచకప్‌కు సన్నద్ధం కావాలని కోరుకుందాం. ఎందుకంటే ఉపఖండంలో మ్యాచ్‌లను మినహాయిస్తే ఈ సిరీస్ తర్వాత మనం వన్డేలు ఆడేది ఆస్ట్రేలియా గడ్డపైనే!    - సాక్షి క్రీడా విభాగం

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top