డబ్బులు కావాలంటే భారత్‌కు ఆడాల్సిందే!

డబ్బులు కావాలంటే భారత్‌కు ఆడాల్సిందే!


అథ్లెట్లకు కేంద్ర క్రీడా శాఖ స్పష్టీకరణ



 న్యూఢిల్లీ: తమ నుంచి నిధులు పొందాలనుకుంటే కచ్చితంగా భారత్‌కు ఆడాల్సిందేనని అథ్లెట్లకు కేంద్ర క్రీడా శాఖ అల్టిమేటం జారీ చేసింది. ఎప్పుడు పిలిచినా అథ్లెట్లు అందుబాటులో ఉండాలని సూచించింది. ఇంచియాన్ ఏషియాడ్‌లో ఆడటానికి చాలా మంది ఆటగాళ్లు అయిష్టత వ్యక్తం చేయడంతో క్రీడా శాఖ ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంది. అయితే ఇలాంటి నిబంధనలను గతేడాదే అన్ని జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్‌ఎస్‌ఎఫ్)లకు పంపించినా అవి సరిగా అమలుకాకపోవడంతో మరోసారి వాటిని బయటకు తీసుకొచ్చింది.



ఇప్పట్నించి ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ‘ఆసియా క్రీడల కోసం భారత బృందాన్ని ఎంపిక చేసిన తర్వాత ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు మేం ఆడబోమని చెప్పారు. ఇది మా దృష్టికి వచ్చింది. గేమ్స్‌లో కాకుండా ప్రైజ్‌మనీ వచ్చే టోర్నీల్లో ఆడేందుకు వాళ్లు మొగ్గు చూపారు.  వీళ్లు ఈ పోటీలను సీరియస్‌గా తీసుకోవడం లేదని తేలింది. గేమ్స్ నాలుగేళ్లకు ఒకసారి మాత్రమే వస్తాయి. ఇలాంటి టోర్నీలో ఎక్కువ పతకాలు గెలిస్తే దేశ ప్రతిష్ట పెరుగుతుంది’ అని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పేస్, బోపన్న, సోమ్‌దేవ్‌లను ఉద్దేశించి ఈ ప్రకటన చేసినట్లు సమాచారం.



 టెన్నిస్ ఆటగాళ్లకు ఏఐటీఏ మద్దతు

 అంతర్జాతీయ టోర్నీలకు డుమ్మా కొడితే ఆర్థిక సహాయం చేయబోమని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ (ఐఏటీఏ) స్పందించింది. సోమ్‌దేవ్, పేస్, బోపన్నలు ఏషియాడ్‌లో ఆడకపోవడానికి కారణాలను వెల్లడించింది. ‘ఆటగాళ్ల నిర్ణయాన్ని ప్రభుత్వం తప్పుగా అర్థం చేసుకుంది. అంతకు వారం కిందటే ఆ ముగ్గురు డేవిస్ కప్‌లో ఆడారు.



హోరాహోరీ పోరులో సెర్బియా చేతిలో ఓడారు. వాళ్లకు దేశం పట్ల ఎలాంటి అంకితభావం ఉందో ఈ మ్యాచ్‌లను చూస్తే తెలిసిపోతుంది. ఆటగాళ్లకు మెరుగైన ర్యాంక్‌లు ఉండటం చాలా అవసరం. లేదంటే దేశం తరఫున గ్రాండ్‌స్లామ్, ఒలింపిక్స్‌లో ఆడలేరు’ అని ఏఐటీఏ సెక్రటరీ జనరల్ భరత్ ఓజా అన్నారు.



గేమ్స్‌లో ఆడకపోవడం వల్ల ఆటగాళ్లు పెద్ద మొత్తంలో డబ్బును త్యాగం చేశారన్నారు. ‘గేమ్స్‌లో ఆడితే ఈ ముగ్గురికి పతకాలు వచ్చేవి. అప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా నగదు పురస్కారాలు ఇచ్చేవి. కానీ గేమ్స్ నుంచి వైదొలిగి ఏటీపీ, చాలెంజర్ టోర్నీలో ఆడటం వల్ల దీన్ని నష్టపోయారు. కారణం ర్యాంక్‌లను కాపాడుకోవాలన్న లక్ష్యమే’ అని ఓజా వ్యాఖ్యానించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top