ఆ ఎత్తు వేయకపోయుంటే...

ఆ ఎత్తు వేయకపోయుంటే...


మన ఆనంద్ మరోసారి ఓడిపోవడం బాధగా ఉంది. ఈ గేమ్ కోసం అతను చాలా చక్కగా సన్నద్ధమై వచ్చినట్లు ఆరంభంలో కనిపించింది. 26వ ఎత్తు వరకు కూడా మొగ్గు విషీ వైపే ఉంది. అయితే రూక్‌ని బి4లోకి పంపడం ద్వారా అతను చాలా పెద్ద తప్పు చేశాడు. ఈ ఎత్తు వేయడంతో అతను తొందర పడ్డాడు. దాని టైమింగ్ తప్పు అనేది నా అభిప్రాయం. కాస్త ఆగి ఉండాల్సింది. బహుశా పాన్‌ను ముందుకు తీసుకెళ్లి క్వీన్‌ను చేద్దామనే ఆలోచన కావచ్చు! కానీ బలి అవుతుందని తెలిసినప్పుడు చాలా రకాలుగా ఆలోచించాలి.



ఈ ఎత్తు వేసేటప్పుడు ఆనంద్ అతి ధైర్యవంతుడిగా, అతి ఆశావాదిగా కనిపించాడు. బహుశా ఈ సమయంలో తాను అనుకున్న వ్యూహం మర్చిపోయి ఉంటాడు లేదా విజయంపైనే దృష్టి నిలపడం వల్ల ‘డ్రా'కు ఉన్న అవకాశాల గురించి కూడా ఆలోచించలేదేమో. ఇలాంటి అవకాశం ఇస్తే కార్ల్‌సన్‌లాంటి ఆటగాడు వదిలేస్తాడా. అందుకే ఎక్కడా పట్టు విడవకుండా, మరో చాన్స్ లేకుండా దూసుకుపోయాడు.



చెన్నైతో పోలిస్తే ఈ టోర్నీలో ఆనంద్ ప్రదర్శన చాలా బాగుంది. ఎన్నో సార్లు విజయానికి చేరువలో కూడా వచ్చాడు. కానీ సఫలం కాలేకపోయాడు. ఓటమి విషీని బాధ పెట్టడం సహజమే కానీ అతని గొప్పతనం తగ్గదు. భవిష్యత్ టోర్నీలపై కూడా దీని ప్రభావం ఉండదని నేను భావిస్తున్నా.

     - పెంటేల హరికృష్ణ, చెస్ గ్రాండ్ మాస్టర్

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top