ఇదేం పైశాచికానందం!

ఇదేం పైశాచికానందం!


బంగ్లాదేశ్‌లో ప్రధాన వార్తా పత్రిక ‘ప్రోథోమ్ ఆలో’ ప్రచురించిన ఒక చిత్రం (గ్రాఫిక్) ఇప్పుడు భారత క్రికెట్ అభిమానుల మనోభావాలను దెబ్బతీసింది. సోష ల్ మీడియా పరిధి పెరగడంతో ఈ వార్త కాస్త ఆలస్యంగా అయినా భారత్‌లోనూ  వెలుగుచూసింది. తమ క్రికెట్‌కు పెద్దన్నగా నిలబడిన భారత్‌ను ఏ మాత్రం క్రీడాస్ఫూర్తి లేకుండా, అవమానపరిచేలా ఉన్న ఈ చిత్రం ఇప్పుడు కొత్త వివాదాన్ని రేకెత్తించినట్టయింది.



  పేసర్ ముస్తాఫిజుర్ వరుసగా తొలి రెండు వన్డేల్లో తన ఆఫ్ కట్టర్ బంతులతో భారత బ్యాట్స్‌మెన్‌ను దెబ్బతీశాడు. ఒక హోర్డింగ్ మీద ముస్తాఫిజుర్ చేతిలో కట్టర్ పట్టుకుని, భారత క్రికెటర్లకు గుండు గీశాడట. ‘ఈ ఆఫ్ కట్టర్ బాగా పనిచేస్తుంది. మేం వాడాం. మీరూ వాడండి’ అని ఓ ప్రకటనలో చెప్పినట్లుగా దీనిని తయారు చేశారు. బంగ్లాదేశ్ లో మాస్ జనాలు బాగా ఎక్కువ . అదే సమయంలో అక్కడ మీడియా కూడా ఎక్కువే. విపరీతమైన పోటీ. ఈ నేపథ్యంలో పాఠకులను ఆకట్టుకోవడానికి పత్రికలు రకరకాల గిమ్మిక్కులు చేస్తుంటాయి. భారత్‌పై బంగ్లాదేశ్ వన్డే సిరీస్ గెలవడం వారి చరిత్రలోనే అతి పెద్ద విజయంగా భావించారు.



ఆ రోజు రాత్రి ఢాకా నగరం నిద్రపోలేదు. రోడ్లన్నీ సంబరాలు. దీంతో పాఠకుల్లో మరింత జోష్ పెంచాలనే ఉత్సాహంతో ‘ప్రోథోమ్ ఆలో’ పత్రిక అత్యుత్సాహం చూపించింది. మంగళవారం ఆ పత్రిక క్షమాపణ చెప్పినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మీడియా ఎప్పుడూ ఆటను ప్రోత్సహించేలా, అభివృద్ధి చేసేలా ఉండాలి. బాగా ఆడకపోతే విమర్శించాలి. అంతేగానీ ఇలాంటి పైశాచిక ఆనందం ప్రదర్శించకూడదు. ఆటలో గెలుపోటములు సహజం. కానీ క్రీడాస్ఫూర్తి లేకుండా ఇలాంటి కథనాలు ప్రచురించడం వల్ల అక్కడి అభిమానులు మురిసిపోవచ్చేమో గానీ... ప్రత్యర్థి మనోభావాలు దెబ్బతింటాయి.



 నిజానికి బంగ్లాదేశ్ క్రికెట్‌ను భారత్ బాగా ప్రోత్సహించింది. 1990ల్లో దాల్మియా బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఆ దేశాన్ని బాగా ఆదుకున్నారు. బంగ్లాకు టెస్టు హోదా ఇప్పించింది కూడా ఆయనే. అంతర్జాతీయ క్రికెట్ మార్కెట్‌లో భారత్‌దే ప్రధాన పాత్ర. భారత జట్టు వచ్చి ఆడితేనే ఏ దేశ బోర్డుకైనా కాస్త ఆదాయం వస్తుంది. అందరూ భారత్‌తో సిరీస్ కోసం అందుకే తహతహలాడుతుంటారు. బంగ్లాదేశ్ కూడా దీనికి అతీతం కాదు. ‘మా క్రికెటర్లు బిజీగా ఉన్నారు కాబట్టి బంగ్లాదేశ్ పంపలేం’ అని బీసీసీఐ ఒక్క మాట అంటే ఎవరూ ఏమీ చేయలేరు. అంత శక్తి మనది.



అయినా బంగ్లాదేశ్‌లోనూ క్రికెట్ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పెద్దన్న పాత్రను మన బోర్డు పోషిస్తోంది. ఇది బంగ్లాదేశ్ మీడియాకు కూడా తెలుసు. అయినా ఆ విశ్వాసం చూపించలేకపోయింది. బంగ్లాదేశ్ ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్‌కు చేరితే భారత మీడియా ఆకాశానికెత్తింది. అలాగే భారత్‌పై వన్డే సిరీస్ గెలిస్తే... బాగా ఎదిగారని అన్ని పత్రికలూ ప్రశంచించాయి.



కానీ ఎక్కడా ఏ పత్రిక కూడా అక్కసు చూపించలేదు. ఐపీఎల్‌లో ఆడే షకీబ్‌ను కోల్‌కతా మీడియా తమ సొంత క్రికెటర్‌లా చూసుకుంటోంది. ఈ మాత్రం విజ్ఞత బంగ్లాదేశ్ మీడియా చూపించలేకపోయింది. ఓ పత్రిక ఇలాంటి చెత్త చేసినంత మాత్రాన భారత క్రికెట్‌కు, క్రికెటర్లకు వచ్చిన నష్టమేం లేదు. కానీ ఇన్నాళ్లూ బంగ్లాదేశ్ క్రికెటర్లను మనోళ్లు సోదరుల్లా చూశారు. అక్కడి అభిమానులను మన అభిమానులుగా ఆదరించారు. కానీ ఈ చెత్త తర్వాత అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఇక బంగ్లాదేశ్ వాళ్లు గెలవాలని కోరుకునే వాళ్లెవరూ భారత్‌లో ఉండరు..!            

-సాక్షి క్రీడావిభాగం

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top