విండీస్‌ పరీక్షకు సిద్ధం

విండీస్‌ పరీక్షకు సిద్ధం


ఆత్మవిశ్వాసంతో మిథాలీ రాజ్‌ బృందం

విజయమే లక్ష్యంగా బరిలోకి

మహిళల వన్డే ప్రపంచకప్‌






ఆతిథ్య ఇంగ్లండ్‌ను ఓడించిన ఉత్సాహంతో ఉన్న భారత మహిళల జట్టు... వెస్టిండీస్‌తో పోరుకు సై అంటోంది.          ‘ట్రిపుల్‌’ ప్రపంచకప్‌ చాంపియన్‌ను జయించిన ధీమాతో ఉన్న మిథాలీ సేన... దీన్ని తలకెక్కించుకోకుండా బరిలోకి దిగాలి. ఎందుకంటే వెస్టిండీస్‌ ఆషామాషీ జట్టు కాదు. గత వన్డే ప్రపంచకప్‌ రన్నరప్, టి20 చాంపియన్‌. పైగా ఆస్ట్రేలియా చేతిలో పరాజయంతో దెబ్బతిన్న పులిలా కాచుకుంది. ఈ నేపథ్యంలో భారత అమ్మాయిలు ఏమాత్రం ఆదమరిచినా అంతే సంగతులు! కాబట్టి... మిథాలీ సేన బహు పరాక్‌!



టాంటన్‌: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు మరో విజయంపై దృష్టి పెట్టింది. ఆతిథ్య ఇంగ్లండ్‌పై గెలిచి టోర్నీలో శుభారంభం చేసిన మిథాలీ సేన గురువారం వెస్టిండీస్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ‘ట్రిపుల్‌’ ప్రపంచకప్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌ను కంగుతినిపించిన భారత్‌ ఈ మ్యాచ్‌లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో భారత క్రికెటర్లు నిలకడగా రాణిస్తున్నారు. ఓపెనర్లు స్మృతి మంధన, పూనమ్‌ రౌత్‌లతో పాటు టాపార్డర్‌లో మిథాలీరాజ్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు.



 బౌలింగ్‌ విభాగంలో పేసర్‌ శిఖాపాండేతో పాటు స్పిన్నర్లు దీప్తి శర్మ, పూనమ్‌ యాదవ్‌లు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను సమర్థంగా కట్టడి చేస్తున్నారు. సెమీఫైనల్‌ లక్ష్యంగా పెట్టుకున్న మిథాలీ అండ్‌ కో ఇంగ్లండ్‌పై కనబరిచిన జోరును టోర్నీ ఆసాంతం కొనసాగించాలని భావిస్తోంది. అయితే గత మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లతో అదరగొట్టినప్పటికీ ఫీల్డింగ్‌ మాత్రం పేలవంగా ఉంది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఉన్న ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ ఇచ్చిన సునాయాస క్యాచుల్ని భారత ఫీల్డర్లు నేలపాలు చేశారు. జట్టు మేనేజ్‌మెంట్, కోచింగ్‌ స్టాఫ్‌ ఈ విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలి. మేటి ఈవెంట్‌లో ఇలాంటి పొరపాట్లు పునరావృతమైతే అవకాశాలు గల్లంతవుతాయన్న సంగతి మరవొద్దు.



సమష్టిగా రాణించాలి...

మరోవైపు వెస్టిండీస్‌ జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. అయితే ఒక్క మ్యాచ్‌ ఫలితంతో స్టెఫానీ టేలర్‌ సేనని తక్కువ అంచనా వేయలేం. గత మ్యాచ్‌లో టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ హేలీ మాథ్యూస్, చెడియన్‌ నషన్, కెప్టెన్‌ టేలర్‌ చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. అయితే ఏ ఒక్కరూ వాటిని భారీ స్కోర్లుగా మలచుకోలేకపోయారు. ఇదే విండీస్‌ ఇన్నింగ్స్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. దీనికి తోడు మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేయడం కూడా విండీస్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. అయితే భారత్‌తో జరిగే కీలకమైన మ్యాచ్‌లో ఇలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సమష్టిగా రాణించాలనే పట్టుదలతో విండీస్‌ ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో బోణీ కొట్టాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.



జట్లు: భారత్‌: మిథాలీ రాజ్‌ (కెప్టెన్‌), స్మృతి మంధన, పూనమ్‌ రౌత్, హర్మన్‌ప్రీత్‌ కౌర్, వేద కృష్ణమూర్తి, మోనా మేశ్రమ్, దీప్తి శర్మ, జులన్‌ గోస్వామి, శిఖా పాండే, ఏక్తా బిష్త్, పూనమ్‌ యాదవ్‌.



వెస్టిండీస్‌: స్టెఫానీ టేలర్‌ (కెప్టెన్‌), మెరిస్సా, రినిస్‌ బాయిస్, షమీలియా కానెల్, షానెల్‌ డెలీ, డియాం డ్రా డాటిన్, అఫీ ఫ్లెచర్, క్వియానా జోసెఫ్, అనిసా మొహమ్మద్, ఫెలిసియా వాల్టర్స్, చెడియన్‌ నషన్‌.





మధ్యాహ్నం గం. 3.00 నుంచి

స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top