ఢీఆర్‌ఎస్...

ఢీఆర్‌ఎస్...


ప్రస్తుతం అమల్లో ఉన్న డీఆర్‌ఎస్ పద్ధతిపై మాకు అభ్యంతరాలు ఉన్నాయి. అది 100 శాతం సరైందని తేలే దాకా దానిని అంగీకరించేది లేదు... చాలా ఏళ్లుగా బీసీసీఐ వినిపిస్తున్న వాదన ఇది.

 


బీసీసీఐ తమ ఆధిపత్యం కోసమే ఇలాంటి వాదన వినిపిస్తోంది. సరైన నిర్ణయాలు తీసుకునేందుకు  ఉపయోగపడే ఈ పద్ధతిని అమలు చేయడం ఎంతో అవసరం... భారత్ మినహా దీనిని వాడుతున్న మిగతా దేశాల మాట ఇది.

 

డీఆర్‌ఎస్ అంటేనే లోపాల పుట్ట. ఒక్క తప్పుడు నిర్ణయం మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది... అడిలైడ్ డేనైట్ టెస్టు తర్వాత ప్రపంచం మొత్తం ఏకమై పలుకుతున్న మాట ఇది.


 

ఒక్క దెబ్బతో అంతా భారత్ బాటలోకే వచ్చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి మనగలుగుతుందా... ప్రస్తుత తరహాలోనే కొనసాగిస్తారా లేక ఐసీసీ మార్పులు చేస్తుందా?


 

* టెక్నాలజీపై కొత్త సందేహం

* అడిలైడ్ టెస్టులో బయటపడ్డ లోపాలు

* భారత్‌ను ఒప్పించడం కష్టమే!


సాక్షి క్రీడా విభాగం: అడిలైడ్ టెస్టులో లయోన్ అవుట్ గురించి రివ్యూ చేస్తున్న సమయంలో హాట్‌స్పాట్ మార్క్ ‘మరే కారణంగానైనా’ వచ్చి ఉండవచ్చు. బంతి లయోన్ బ్యాట్‌కు తగిలిందని కచ్చితంగా చెప్పలేము అంటూ థర్డ్ అంపైర్ నెజైల్ లాంగ్, ఫీల్డ్ అంపైర్ రవికి చెప్పడం అందరికీ వినిపించింది.



ఈ మరే కారణం ఏమిటో అంపైర్ సెలవిస్తారా అంటూ ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. హాట్‌స్పాట్ పని తీరు ఎంత నాసిరకంగా ఉందో అనేదానికి ఇది చక్కటి ఉదాహరణ. అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్‌ఎస్)కి సంబంధించి ఇప్పటి వరకు ఎల్బీడబ్ల్యూ నిర్ణయాల విషయంలోనే సందేహాలు ఉండేవి. ఇప్పుడు బ్యాట్ క్యాచ్ అవుట్‌లను కూడా గుర్తించలేని స్థితిలో టెక్నాలజీ ఉందంటే దానిని వాడటం అవసరమా అనే కొత్త వాదన తెరపైకి వచ్చింది.

 

దెబ్బ తిన్న భారత్

డీఆర్‌ఎస్‌ను మొదటిసారి 2008లో భారత్, శ్రీలంక మధ్య సిరీస్‌లో వాడినప్పుడు దాదాపు అన్ని నిర్ణయాలు టీమిండియాకు వ్యతిరేకంగా వచ్చాయి. ఈ పద్ధతిలో ఎల్బీగా అవుటైన తొలి బ్యాట్స్‌మన్ సెహ్వాగ్. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో టె స్టు సిరీస్‌లో ‘ద్రవిడ్ రిమూవల్ సిస్టం’గా దీనిపై విమర్శలు వచ్చాయి. అంతకు ముందు వరల్డ్ కప్‌లో కూడా ఇలాంటి నిర్ణయం ధోనిని తీవ్ర అసహనానికి గురి చేసింది. దాంతో డీఆర్‌ఎస్‌కు రాంరాం పలికిన బీసీసీఐ ఇప్పటికీ దాని ఊసెత్తలేదు.



గత ఏడాది ఆస్ట్రేలియా పర్యటన తర్వాత కెప్టెన్ కోహ్లితో పాటు బోర్డు కూడా కాస్త మెత్తబడింది. అధ్యక్షుడు శశాంక్ మనోహర్ కూడా ఎల్బీలకు మినహా మిగతావాటికి అభ్యంతరం లేదన్నట్లుగా మాట్లాడారు. కానీ తాజా ఉదంతం భారత్ తమ వాదనకే కట్టుబడేట్లుగా చేసింది.

 

పని తీరు-అభ్యంతరాలు

మూడు రకాల వేర్వేరు టెక్నాలజీల సహాయంతో డీఆర్‌ఎస్‌ను అమలు చేస్తున్నారు. ఎల్బీలను నిర్ధారించేందుకు హాక్ ఐ (బాల్ ట్రాకింగ్ టెక్నాలజీ)ని వాడుతున్నారు. ఇది బంతి దిశను సూచిస్తుంది. బ్యాట్స్‌మన్ బంతిని అడ్డుకోకపోతే అది వికెట్లను తాకేదా లేదా అనే విషయం తెలుస్తుంది. వివాదానికి ఇది పెద్దన్నలాంటిది. పిచ్ అయిన తర్వాత బంతి ప్రయాణించిన దూరం, వేగం ఇలాంటివన్నీ ఇందులో కలిసి ఉండటంతో చాలా గందరగోళం కనిపిస్తుంది.



బంతి గమనం మారితే (డీవియేషన్) దానిని గుర్తించలేకపోవడం పెద్ద లోపం. పిచ్‌పై పడ్డ తర్వాత బంతి ఎలా వెళ్లవచ్చనేది నేరుగా నిలబడ్డ అంపైర్‌కు కనిపించినంత స్పష్టత ఇందులో సాధ్యం కాదనేది ఒక వాదన. దీనిపైన భారత్‌తో సహా ఎవరికీ పూర్తి విశ్వాసం లేదు. కానీ అలాగే కొనసాగిస్తున్నారు.

 

అందరూ కాస్త విశ్వసించిన రెండో అంశం హాట్‌స్పాట్. బ్యాట్‌కు బంతి ఎడ్జ్ తీసుకుందా లేదా అనేది స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి క్యాచ్‌ల విషయంలో 90 శాతం వరకు సరైన ఫలితాలే వచ్చాయి. అయితే అడిలైడ్‌లో లయోన్ ఎడ్జ్ హాట్‌స్పాట్‌లో కనిపించినా...అది బ్యాట్ కాకపోవచ్చంటూ థర్డ్ అంపైర్ నిర్ణయించడమే కొత్త వివాదానికి కారణమైంది. అంటే ఎడ్జ్ కాకపోయినా హాట్ స్పాట్ చూపిస్తోందంటే అందులో లోపాలున్నట్లే. పైగా ఇది భారీ ఖర్చుతో కూడుకుంది కావడంతో బోర్డులు ఆసక్తి చూపించడం లేదు.

 

బంతి బ్యాట్‌కు లేదా ప్యాడ్‌కు తగిలిందా శబ్దం సాయంతో గుర్తించేందుకు స్నికో మీటర్ టెక్నాలజీని వాడుతున్నారు. అయితే నెమ్మదిగా వచ్చే స్పిన్నర్ల బంతులతో పాటు బ్యాట్స్‌మన్ ముందుకు వచ్చి ఆడితే మైక్‌లు ఈ శబ్దాన్ని గుర్తించలేకపోతున్నాయి. ఆశ్చర్యకరంగా లయోన్ భుజానికి బంతి తగిలినా కూడా మీటర్‌లో అది ఏ మాత్రం కనిపించలేదు. మొత్తానికి డీఆర్‌ఎస్ పూర్తి భరోసానిచ్చేది కాదని మాత్రం అర్థమవుతోంది.

 

మార్పులు చేస్తారా...

అంపైర్లు మానవ మాత్రులే కాబట్టి తప్పులు చేస్తారు. దానిని తగ్గించేందుకు టెక్నాలజీ సహాయం తీసుకుంటున్నాం అని ఐసీసీ చెబుతూ వస్తోంది.

* అన్నీ కాకపోయినా...చాలా వరకు సరైన నిర్ణయాలే వస్తున్నాయని మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయ పడుతున్నారు. తాజా ఘటనతో ఇందులో లోపాలు ఉన్నాయనే భారత్ వాదనకు బలం చేకూరింది. అయితే ఏదీ 100 శాతం పర్‌ఫెక్ట్‌గా ఉండదని, మెరుగ్గా ఉన్నదానిని వాడాలని సూచనలు వస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఐసీసీ టెక్నికల్ కమిటీ ఏకపక్షంగా డీఆర్‌ఎస్‌కు ఎర్రజెండా చూపించకపోయినా.... హాక్ ఐ నిబంధనల్లో మార్పులు, హాట్ స్పాట్, స్నికోలలో లోపాలు సవరిస్తూ మరి కాస్త మెరుగైన టెక్నాలజీ వాడి అడిలైడ్‌లాంటి ఘటన పునరావృతం కాకుండా పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తుందనడంలో సందేహం లేదు.

 

తప్పు అంగీకరించిన ఐసీసీ

అడిలైడ్ టెస్టులో నాథన్ లయోన్‌ను మూడో అంపైర్ నెజైల్ లాంగ్ నాటౌట్‌గా ప్రకటించడం తప్పుడు నిర్ణయమని ఐసీసీ అంగీకరించింది. లాంగ్ నిబంధనల ప్రకారమే వ్యవహరించినా... సరైన నిర్ణయం మాత్రం ఇవ్వలేకపోయారని అభిప్రాయపడింది. ఈ మ్యాచ్‌లో శాన్‌ట్నర్ బౌలింగ్‌లో స్వీప్ చేయబోయిన లయోన్ బ్యాట్‌కు తగిలిన బంతి అతని భుజం మీదుగా గల్లీలో ఫీల్డర్ చేతిలో పడింది.



ఆ వెంటనే అవుట్‌గా భావించిన లయోన్ క్రీజ్ వదిలినా... ఫీల్డ్ అంపైర్ రవి నాటౌట్‌గా ప్రకటించాడు. న్యూజిలాండ్ రివ్యూ కోరడంతో థర్డ్ అంపైర్ లాంగ్ సుదీర్ఘ సమయం తీసుకొని హాట్ స్పాట్, స్నికోల ద్వారా ఏమీ తేలడం లేదని బ్యాట్స్‌మన్‌ను నాటౌట్‌గా ప్రకటించడం వివాదాస్పదమైంది. ఈ నాటౌట్ మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top