కోహ్లి నమ్మకమే నడిపించింది

కోహ్లి నమ్మకమే నడిపించింది


కటక్‌: దాదాపు మూడేళ్ల విరామం అనంతరం వన్డే జట్టులోకి వచ్చినా డాషింగ్‌ బ్యాట్స్‌మన్  యువరాజ్‌ సింగ్‌ సూపర్‌ సెంచరీతో అదరగొట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రమాదకర క్యాన్సర్‌ బారిన పడడంతో పాటు ఫామ్‌లో లేకపోవడం కారణంగా ఇన్నాళ్లూ తనకు జట్టులో చోటు లేకుండా పోయింది. ఈ దశలో ఇక కెరీర్‌కు ముగింపు పలకాలని కూడా ఆలోచించాడట. కానీ కెప్టెన్  విరాట్‌ కోహ్లి తనపై ఉంచిన నమ్మకం కారణంగానే భవిష్యత్‌పై ఆశలు పెంచుకున్నానని యువీ తెలిపాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో యువీ 150 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.


‘జట్టు ఆటగాళ్లతో పాటు కెప్టెన్  మన వెనకాల ఉంటే ఆత్మవిశ్వాసం ఎప్పటికీ ఉంటుంది. నా విషయంలో కోహ్లి చాలా నమ్మకం ఉంచాడు. గడ్డు స్థితిలో ఉన్నప్పుడు కెరీర్‌లో కొనసాగాలా? వద్దా? అని కూడా ఆలోచించాను. ఈ ప్రయాణంలో నాకు చాలా మంది సహకరించారు. ఫిట్‌నెస్‌ కోసం రెండు మూడేళ్లు కఠినంగా శ్రమించాను. జట్టులో కూడా నిలకడగా స్థానం లేకుండా పోయింది. అయితే పరిస్థితులు కచ్చితంగా మారతాయని విశ్వసించాను’ అని 35 ఏళ్ల యువరాజ్‌ తెలిపాడు. క్యాన్సర్‌ నుంచి కోలుకున్నాక చేసిన ఈ సెంచరీ చాలా ప్రత్యేకమైందని అన్నాడు. రెండో వన్డేలో ధోని, తాను ముందుగా 25, 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాలని చర్చించుకున్నామని అన్నాడు. ఆ తర్వాత తాము కూడా క్రీజులో కుదురుకున్నాక పరుగులు భారీగా వచ్చాయని వివరించాడు.



ధావన్ కు గాయం : భువనేశ్వర్‌ నుంచి కోల్‌కతా చేరుకున్న వెంటనే శిఖర్‌ ధావన్  ఆస్పత్రికి వెళ్లడం చర్చనీయాంశమైంది. గత అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ధావన్  ఎడమ బొటనవేలికి గాయమైంది. ఇప్పుడు అదే మళ్లీ తిరగబెట్టిందని అనుమానిస్తున్నారు. గంటకు పైగా తను రేడియాలజీ డిపార్ట్‌మెంట్‌లో గడిపినట్టు సమాచారం.



ఇంగ్లండ్‌కు జరిమానా: భారత్‌తో జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా ఇంగ్లండ్‌ జట్టు కెప్టెన్  మోర్గాన్ పై 20%, ఆటగాళ్లపై 10% మ్యాచ్‌ ఫీజులో కోత వేశారు. మరోవైపు గాయంతో అలెక్స్‌ హేల్స్‌ చివరి వన్డే, టి20లకు దూరమయ్యాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top