రత్నాకర్‌ శెట్టికి హైదరాబాద్‌ ‘టెస్టు’ బాధ్యతలు


ముంబై: హైదరాబాద్‌లో వచ్చే నెల 9 నుంచి జరగాల్సిన భారత్, బంగ్లాదేశ్‌ ఏకైక టెస్టు మ్యాచ్‌ను సమర్థంగా నిర్వహించేందుకు బీసీసీఐ ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం(హెచ్‌సీఏ)లో ప్రస్తుతం తాత్కాలిక ప్రాతిపదికన ఆఫీస్‌ బేరర్లు పని చేస్తుండగా, ఇటీవలే జరిగిన ఎన్నికల ఫలితాలను కూడా ప్రకటించకుండా హైకోర్టు నిలిపేసింది. ఈ నేపథ్యంలో బోర్డు జనరల్‌ మేనేజర్‌ (గేమ్‌ డెవలప్‌మెంట్‌) రత్నాకర్‌ శెట్టికి టెస్టు మ్యాచ్‌ నిర్వహణ బాధ్యతను అప్పగించారు. ‘ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా టెస్టు మ్యాచ్‌ జరిగేలా చూడటమే నా పని. నా బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తా’ అని శెట్టి వెల్లడించారు.



ఈ నిర్ణయాన్ని బోర్డు సీఈఓ రాహుల్‌ జోహ్రి తీసుకున్నారు. అయితే పరిస్థితులను బట్టి అవసరమైతే టెస్టును హైదరాబాద్‌ నుంచి తరలించే అధికారాన్ని కూడా శెట్టికి అప్పగించారు. తమ వద్ద నిధులు లేవంటూ ఇటీవలే హెచ్‌సీఏ బోర్డుకు లేఖ రాయడంతో టెస్టు నిర్వహణపై సందేహాలు తలెత్తినా... హెచ్‌సీఏ తాము అలా రాయలేదని, మ్యాచ్‌కు సిద్ధమంటూ వివరణ ఇచ్చింది.  

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top