ఇదేం అనిశ్చితి?

ఇదేం అనిశ్చితి?


సాక్షి క్రీడావిభాగం

 ‘గత రెండు రోజులుగా కొత్త ప్రాక్టీస్ పిచ్‌లు ఏర్పాటు చేయాలని మా జట్టు పదే పదే కోరింది. అయితే అది చేయకపోగా పాత, పాడైపోయిన వికెట్లపైనే ప్రాక్టీస్ చేయమని మాకు చెప్పారు. ఎగుడుదిగుడుగా ఉన్న ఆ పిచ్‌లపై ఈ ఉదయం ప్రాక్టీస్ చేసి మా ఇద్దరు ఆటగాళ్లు కోహ్లి, ధావన్ గాయపడ్డారు. అందుకే ధావన్ ఉదయం బ్యాటింగ్‌కు రాలేకపోయాడు’... నాలుగో రోజు ఆట కొనసాగుతున్న సమయంలో భారత జట్టు అధికారిక ప్రకటన ఇది. మణికట్టు నొప్పి కారణంగా తాను బ్యాటింగ్‌కు వెళ్లలేనని ధావన్ ఆఖరి నిమిషంలో తనకు చెప్పడంతో డ్రెస్సింగ్ రూమ్‌లో ‘అనిశ్చితి’ నెలకొందని ధోని వెల్లడించాడు. దాంతో హడావిడిగా కోహ్లిని ముందు పంపాల్సి వచ్చిందని, సిద్ధమయ్యేందుకు అతనికి కనీసం 10 నిమిషాల సమయం కూడా లభించలేదని కెప్టెన్ చెప్పాడు.

 

 తగిన సమయమేనా!: మన ప్రకటన చూస్తే మ్యాచ్ ఓటమికి ముందే సిద్ధపడిపోయారా? అనిపిస్తుంది. ఎందుకంటే ప్రకటన విడుదల చేసే సమయానికే జట్టు ఐదు వికెట్లు కోల్పోయింది. ఒకవేళ అది నిజమే అయినా ధావన్ బ్యాటింగ్ ఆర్డర్ గురించి తర్వాతైనా కారణం ఇవ్వవచ్చు. కానీ మ్యాచ్ నాలుగో రోజు మధ్యలో ప్రాక్టీస్ పిచ్‌ల గురించి విమర్శించడమేమిటి? మ్యాచ్ ఆరంభానికి ముందు ఇద్దరు బ్యాట్స్‌మెన్‌తో పాటు తర్వాతి ఆటగాడు కూడా ప్యాడ్లతో సిద్ధంగా ఉండటం చాలా సాధారణం.

 

  కోహ్లి స్థాయి ఆటగాడికి క్రీజ్‌లోకి వెళ్లేందుకు సన్నద్ధత కావాలా! తొలి బంతికే వికెట్ పడి ఉంటే వెళ్లకపోయేవాడా! బ్రిస్బేన్‌లో జిమ్ సౌకర్యం కూడా సరిగ్గా లేదని భారత జట్టు అసహనం వ్యక్తం చేసింది. విషయాన్ని వివాదం చేయదల్చుకోలేదు అంటూనే ఈ విషయంలో బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియాకు అధికారిక ఫిర్యాదు చేసింది. అయితే పిచ్‌లపై భారత్ ఆరోపణను ‘గాబా’ క్యురేటర్ కెవిన్ మిషెల్ ఖండించారు.

 

 మ్యాచ్ పిచ్‌ల తరహాలోనే ప్రాక్టీస్ పిచ్‌లు కూడా మంచి నాణ్యతతో ఉన్నాయని, గతంలో ఏ విదేశీ జట్టూ ఇలాంటి ఫిర్యాదు చేయలేదన్న ఆయన... భారత్ తమను అడిగిన కొత్త వికెట్‌లు ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదని వివరణ ఇచ్చాడు. నాలుగో రోజు ఉదయమే అదే వికెట్లపై ఆసీస్ ఆటగాడు హారిస్ కూడా ప్రాక్టీస్ చేసినా ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదని మిషెల్ గుర్తు చేశారు. సాధారణంగా ధోని ఓటమికి సాకులు చెప్పడు. కానీ పిచ్‌ల విషయంలో అతని వ్యాఖ్యలు మాత్రం అందరికీ ఆశ్చర్యం కలిగించాయి.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top