‘చిక్కుముడి’ వీడేదెలా..!

‘చిక్కుముడి’ వీడేదెలా..!


‘ప్రయోగాలు చేయడం అనే మాట మా వద్ద నిషేధం. అలాంటి ఆలోచనే లేదు. అత్యుత్తమ 11 మందిని ఆడించడం, ఎవరు దానికి సరిపోతారో సరి చూసుకోవడమే మా వ్యూహం’... ముక్కోణపు టోర్నీ సందర్భంగా ధోని చెబుతూ వచ్చిన మాట ఇది. కానీ ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో మన ఆట, ఆ తర్వాత ధోని వ్యాఖ్యలు చూస్తే తుది జట్టు ఎంపిక, వ్యూహాలకు సంబంధించి అతనికి ఇంకా స్పష్టత రాలేదని చెప్పవచ్చు. ఈ టోర్నీలో భారత్ నాలుగు వన్డే లు ఆడింది. మూడు ఓడితే, ఒకటి రద్దయింది. ఈ మ్యాచ్‌ల ఫలితం ప్రపంచకప్‌పై ఉండకపోవచ్చుగాక... కానీ అలాంటి మెగా టోర్నీకి ముందు ఇది సరైన సన్నాహకం మాత్రం కాదు.

 

తుది జట్టు ఏమిటి...




ఈ టోర్నీలో అనుసరించిన వ్యూహాలను ప్రయోగాలు అనవచ్చా లేక కెప్టెన్ తాను అనుకుంటున్న ‘బెస్ట్ ఎలెవన్’ టీమ్ ఇదేనా చూడాలి. ఎందుకంటే రెండు మ్యాచ్‌ల్లో కోహ్లిని నాలుగో స్థానంలో ఆడించి మరోసారి మూడో స్థానానికి మార్చారు. అతను అక్కడా విఫలమయ్యాడు. మూడో స్థానంలో ఫర్వాలేదనిపించిన రాయుడును ఒక్కసారిగా ఐదుకు పంపి, రైనాను ముందుకు తెచ్చారు. ఇదీ దెబ్బ తీసింది. బ్యాటింగ్‌ను పటిష్టంగా మార్చడం కోసమే ఇద్దరు స్పిన్నర్లతో ఆడుతున్నామని కెప్టెన్ చెబుతాడు గానీ మూడు ఇన్నింగ్స్‌లలో కలిపి అక్షర్ ఆడిన బంతులు 8! ఇషాంత్ ఫిట్‌గా లేకపోతే, భువీ ఫామ్‌లో లేడని భావిస్తే పెర్త్‌లాంటి బౌన్సీ వికెట్‌పై ఉమేశ్‌కు అవకాశం ఇస్తే అతని సత్తా ఏమిటో తెలిసేది కదా. ప్రపంచ కప్ జట్టులోనే లేని మోహిత్‌ను ఆడించడంలో ఔచిత్యమేముంది! పైగా జడేజా, అక్షర్ ఇద్దరూ ఒకే శైలికి చెందిన ఆటగాళ్లు.



ముగ్గురు పేసర్లతో ఆడితే ఓవర్ రేట్ సమస్య వస్తుందంటూ చెప్పిన ధోని... తుది జట్టులో ఐదుగురు ప్రధాన బౌలర్లు కాకుండా నలుగురితోనే (ఇద్దరు స్పిన్నర్లు) దిగుతామని సూత్రప్రాయంగా వెల్లడించాడు. గత రెండు మ్యాచ్‌లలో బిన్నీలాంటి పార్ట్‌టైమర్‌తో తొలి ఓవర్ వేయించడాన్ని బట్టి మూడో పేసర్ స్థానానికి అతను దాదాపు ఖాయం అనిపిస్తోంది. కానీ శుక్రవారం మ్యాచ్‌లో బిన్నీ బ్యాటింగ్ చూస్తే కెప్టెన్ ‘బలమైన బ్యాటింగ్ ఆర్డర్’ కోరికకు ఏ మాత్రం న్యాయం చేయగలడో సందేహమే. పరిష్కరించలేని పజిల్‌లా మా పరిస్థితి ఉందంటూ ధోని విభిన్నంగా స్పందించడాన్ని చూస్తే... ఈ టోర్నీతో చిక్కు ముడులు వీడలేదని, తాను అనుకున్న తుది కూర్పు ఇంకా రాలేదని మాత్రం ధోని చెప్పకనే చెప్పేశాడు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top