మెగా ఫైట్

మెగా ఫైట్


మేవెదర్‌తో పాకియో అమీతుమీ నేడే

ప్రొఫెషనల్ కెరీర్‌లో పరాజయమెరుగని బాక్సర్ ఒకవైపు... పట్టుదల ఉండాలేగాని అట్టడుగు స్థాయి నుంచి అగ్రపథానికి చేరుకోవచ్చని నిరూపించిన బాక్సర్ మరోవైపు... నేపథ్యాలు వేరైనా దశాబ్దకాలంగా ‘రింగ్’లో కింగ్స్‌గా వెలుగొందుతున్న వారిద్దరే ఫ్లాయిడ్ మేవెదర్ (అమెరికా), మ్యానీ పాకియో (ఫిలిప్పీన్స్). ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య పోరు నిర్వహించేందుకు ఐదేళ్లుగా సాగిన ప్రయత్నాలు ఈ ఏడాది ఫలించాయి. భారత కాలమానం ప్రకారం నేటి ఉదయం 8.30 గంటలకు మొదలయ్యే ఈ ‘శతాబ్దపు పోరు’లో విజేతగా ఎవరు నిలుస్తారో వేచి చూడాలి.



సాక్షి క్రీడావిభాగం

బాక్సింగ్ క్రీడా చరిత్రలోనే అత్యంత ఖరీ దైన పోటీకి అమెరికాలోని లాస్‌వేగాస్‌లో మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. పదేళ్లకంటే ఎక్కువ కాలం నుంచి ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో ఉన్నప్ప టికీ ఈ బౌట్ ద్వారా మేవెదర్, పాకియోల పేర్లు అందరి నోళ్లలో నానుతున్నాయి. ఈ బౌట్ విశేషాలు, బాక్సర్ల నేపథ్యం గురించి క్లుప్తంగా...



ఎలా జరుగుతుందంటే...

వెల్టర్ వెయిట్ కేటగిరీ (63.5 కేజీల నుంచి 67 కేజీల వరకు)లో జరిగే ఈ బౌట్‌లో మూడు నిమిషాల నిడివిగల 12 రౌండ్లు ఉంటాయి. నిర్ణీత 12 రౌండ్లలోపు ఎవరైనా నాకౌట్ అయితే బౌట్ అక్కడే ముగుస్తుంది. ఒకవేళ బౌట్ పూర్తిగా 12 రౌండ్లు జరిగితే పాయింట్ల ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. మొత్తానికి 45 నిమిషాల పోరాటం ద్వారా ఈ ఇద్దరు బాక్సర్లు వందల కోట్లు జమచేసుకోనున్నారు.



ఆదాయమెంతంటే....

ముందే కుదిరిన ఏకాభిప్రాయం ప్రకారం ఫలితంతో సంబంధం లేకుండా ఈ బౌట్ ద్వారా వచ్చే ఆదాయంలో 60 శాతం మేవెదర్ ఖాతాలోకి... 40 శాతం పాకియో ఖాతాలోకి వెళ్తుంది.  విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ బౌట్ ద్వారా రూ. 2500 కోట్ల ఆదాయం వచ్చే అవకాశముంది. అదే జరిగితే మేవెదర్‌కు దాదాపు రూ. 1500 కోట్లు, పాకియోకు దాదాపు రూ. 1000 కోట్లు వస్తాయి. ఈ బౌట్‌కు రిఫరీగా కెన్నీ బేలిస్ వ్యవహరిస్తారు. ఆయనకు 25 వేల డాలర్లు (రూ. 16 లక్షలు) ఫీజు ఇస్తారు. బాక్సింగ్‌లో ఓ రిఫరీకి ఇంత భారీ మొత్తం చెల్లించడం ఇదే ప్రథమం.



అజేయుడు...

‘అమెచ్యూర్’ బాక్సర్ హోదాలో మేవెదర్ 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో ఫెదర్ వెయిట్ కేటగిరిలో అమెరికాకు కాంస్య పతకం అందించాడు. అదే ఏడాది అతను ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిపోయాడు. ఆ తర్వాత మేవెదర్ తన కెరీర్‌లో పోటీపడిన 47 బౌట్‌లలోనూ గెలిచి అజేయుడుగా ఉన్నాడు. 38 ఏళ్ల మేవెదర్ తాను సాధించిన 47 విజయాల్లో 26 బౌట్‌లలో ప్రత్యర్థిని నాకౌట్ చేశాడు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రీడాకారుడైన మేవెదర్‌కు లక్షల డాలర్లు విలువవేసే అరుదైన ఎనిమిది కార్లు, రెండు ప్రత్యేక జెట్ విమానాలు ఉన్నాయి.



పోరాట యోధుడు

మేవెదర్ మాదిరిగా పాకియో అజేయుడు కాకపోయినా తన కెరీర్‌లో పోటీపడిన 64 బౌట్‌లలో 57 విజయాలు సాధించాడు. ఐదింటిలో ఓడిపోయాడు. మరో రెండు బౌట్‌లు ‘డ్రా’గా ముగిశాయి. 1995లో ప్రొఫెషనల్‌గా మారిన 36 ఏళ్ల పాకియోకు ఫిలిప్పీన్స్‌లో విశేష ఆదరణ ఉంది. అతని ‘ఫైట్’ జరుగుతున్న సమయంలో అందరూ టీవీలకు అతుక్కుపోతారని, ఆ సమయంలో దేశంలో ఎలాంటి నేరాలు సంభవించవని అంటుంటారు. కేవలం బాక్సింగ్‌లోనే కాకుండా బాస్కెట్‌బాల్‌లోనూ పాకియోకు ప్రవేశముంది. 2010లో ఫిలిప్పీన్స్ చట్టసభలో ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన పాకియో సినిమాల్లోనూ నటించాడు. తన ఇంట్లోని కుక్కను తండ్రి చంపేసి వంటకం చేయడంతో తీవ్రంగా నొచ్చుకున్న పాకియో 12 ఏళ్ల వయస్సులో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. వీధుల్లో మిఠాయిలు అమ్ముతూ జీవనం సాగించిన అతను బాక్సింగ్‌ను కెరీర్‌గా ఎంచుకొని 14 ఏళ్లకే ప్రొఫెషనల్‌గా మారాడు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top